Politics

కేంద్ర క్యాబినెట్‌ సమావేశంకి కిషన్‌ రెడ్డి రెండోసారి డుమ్మా

కేంద్ర క్యాబినెట్‌ సమావేశంకి  కిషన్‌ రెడ్డి రెండోసారి డుమ్మా

నేడు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ..కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరుకాలేదు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ నెల 4వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగుతున్న బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు మంత్రిగా కొనసాగుతానని కిషన్ రెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించారు.తన శాఖ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఈ నెల 8న వరంగల్ లో జరిగిన ప్రధాని మోదీ పర్యటన విజయవంతం కావడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం తర్వాత రెండోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. కిషన్ రెడ్డి వరుసగా రెండు సమావేశాలకు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో గత సమావేశానికి హాజరు కాలేదని కిషన్ రెడ్డి సమాచారం పంపారు. అయితే నేటి సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో ఇంకా తేలలేదు. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. దీంతో పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ప్రస్తుతం సాగుతోంది.