NRI-NRT

USలో ఐటీ నిపుణుల కొరత

USలో ఐటీ నిపుణుల కొరత

నిపుణుల కొరత తీవ్రంగా ఉండటంతో హెచ్‌-1బీ(H-1B) వీసాల కోటాను 65,000 నుంచి రెట్టింపు చేయాలని 2,100 చిన్న, మధ్య శ్రేణి ఐటీ కంపెనీలు అమెరికా(USA) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వీటిల్లో భారతీయుల నిర్వహణలోనివి కూడా చాలా ఉన్నాయి. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్‌, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి.ఐటీ సర్వీస్‌ (ITServe) అనే అసొసియేషన్‌లోని 241 మంది సభ్యులు మంగళవారం కాంగ్రెషనల్‌ అడ్వకసి డే నిమిత్తం సమావేశమయ్యారు. నిపుణుల కొరత అంశాన్ని కాంగ్రెస్‌ సభ్యులు, సెనెటర్లకు తెలియజేయాలని నిర్ణయించారు. నిపుణుల కొరత తమ వ్యాపారం, అమెరికా అభివృధ్దిపై ప్రభావం చూపిస్తోందని వారు పేర్కొన్నారు. దీంతో 1,30,000 హెచ్‌1బీ వీసాలు జారీచేయాలని కోరడంతోపాటు.. స్టెమ్‌ (STEM) (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం)విద్యపై పెట్టుబడులు పెంచాలని కోరారు. ఫలితంగా స్థానికంగా నిపుణులను తయారు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఐటీ సర్వీస్‌ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ దేశంలోని 23 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాం. 1,75,000 ఉపాధి అవకాశాలు, నిపుణల ఉద్యోగాలను సృష్టించగలం. దేశ జీడీపీకి ఏటా 12 బిలియన్‌ డాలర్లు అందిస్తాం’’ అని వెల్లడించారు.

ఐటీ సర్వీస్‌ బృందం విజ్ఞప్తులకు అనుగుణంగా ఇండో-అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హైస్కిల్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ రిఫార్మ్‌ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ (హెచ్‌ఐఆర్‌ఈ) చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం పోటీ తత్వాన్ని పెంచడంతోపాటు.. నిపుణుల కొరతను కూడా తీరుస్తుందని ఆయన వెల్లడించారు. దీంతోపాటు ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో స్టెమ్‌ విద్యపై వెచ్చించే మొత్తాన్ని పెంచనున్నారు. ‘‘ఉద్యోగ సృష్టి, భవిష్యత్తు ఆర్థిక నిర్మాణం కోసం దేశీయ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులతో టెక్నాలజీ అభివృద్ధిలో ముందుండాలి. ప్రపంచంలో సృజనాత్మకత, టెక్నాలజీలో అమెరికా లీడర్‌గా ఉండాలి ’’ అని ఆయన వెల్లడించారు.