Sports

కొరియా ఓపెన్ మనదే

కొరియా ఓపెన్ మనదే

ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ తమ ఖాతాలో నాలుగో టైటిల్‌ను జమ చేసుకుంది. కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంక్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 17–21, 21–13, 21–14తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జోడీ ఫజర్‌ అల్ఫీయాన్‌–మొహమ్మద్‌ రియాన్‌ అర్దియాంతో (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాత్విక్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్‌ తొలి గేమ్‌లో తడబడినా వెంటనే తేరుకొని తర్వాతి రెండు గేమ్‌లను దక్కించుకున్నారు. తొలి గేమ్‌లో ఒకదశలో 2–10తో వెనుకబడ్డ భారత జోడీ ఆ తర్వాత అంతరాన్ని తగ్గించినా గేమ్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అయితే రెండో గేమ్‌ నుంచి సాత్విక్, చిరాగ్‌ ఆట మారింది. ముఖ్యంగా సాత్విక్‌ తిరుగులేని స్మాష్‌లతో చెలరేగాడు. విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 33,180 డాలర్ల (రూ. 27 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ‘వరుసగా టైటిల్స్‌ గెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వారం మాకెంతో అద్భుతంగా గడిచింది. ఈ టోర్నీ మొత్తం గొప్పగా ఆడాం. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మంగళవారం నుంచి జరిగే జపాన్‌ ఓపెన్‌లో మా జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాం’ అని సాత్విక్, చిరాగ్‌ వ్యాఖ్యానించారు.