Politics

కేంద్రంపై నేడు అవిశ్వాస తీర్మానం!

కేంద్రంపై నేడు అవిశ్వాస తీర్మానం!

మణిపుర్‌పై పార్లమెంటులో ప్రధాని మోదీతో ఎలాగైనా మాట్లాడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న విపక్ష కూటమి ‘ఇండియా’ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ప్రధాని మాట్లాడటంతోపాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనేది ఆ కూటమి యోచనగా ఉంది. మంగళవారం ఉదయం సమావేశమైన విపక్షాలు ఈ విషయమై చర్చించాయి. మణిపుర్‌పై పార్లమెంటులో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని కూటమి వర్గాలు వెల్లడించాయి. బుధవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చే అవకాశముంది. ఉదయం 10 గంటల కంటే ముందే ఇవ్వాలనేది కూటమి ఆలోచనగా ఉంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదా సిద్ధమైందని, 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించాల్సి ఉందని కూటమి వర్గాలు తెలిపాయి. 10.30కు పార్లమెంటరీ కార్యాలయంలో హాజరుకావాలని ఎంపీలకు కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. మణిపుర్‌పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంటులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని 26 పార్టీల నేతలు సమావేశంలో అనుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.

2018లోనే వీగిపోయింది: భాజపా
అవిశ్వాస తీర్మానం వృథా ప్రయాసని, 2018లోనే అది వీగిపోయిందని, ఇప్పుడు తమ బలం మరింత పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంలో తమకు 350 మందికిపైగా సభ్యుల మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు.

మళ్లీ వాయిదా:మణిపుర్‌ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో మంగళవారమూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేశారు. అన్ని పార్టీల సభాపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని ఇందులో విపక్షాలు పట్టుబట్టాయి. హోం మంత్రి అమిత్‌ షా సమాధానమిస్తారని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ సమావేశమూ ఎటువంటి ఫలితాన్నివ్వలేదు. గందరగోళం మధ్యే సహకార బిల్లును ఆమోదించాక లోక్‌సభ బుధవారానికి వాయిదా పడింది. మణిపుర్‌ అంశం, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌పై సస్పెన్షన్‌ వేటుతో రాజ్యసభ కార్యకలాపాలూ సజావుగా సాగలేదు. సభను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అంతకుముందు కొంతసేపు గందరగోళం మధ్యే సభను నడిపారు. ఆ తర్వాతా విపక్షాలు పట్టువీడకపోవడంతో బుధవారానికి సభ వాయిదా పడింది. రాజ్యసభలో మణిపుర్‌ అంశంపై ఖర్గే, మంత్రి పీయూష్‌ గోయెల్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూపీఏ హయాంలోనూ మణిపుర్‌లో ఘర్షణలు జరిగాయని, అప్పటి హోం మంత్రి ఇప్పుడు సభలోనే ఉన్నారని, ఆయన ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని గోయెల్‌ డిమాండ్‌ చేశారు. మోదీ సాహెబ్‌ ఎక్కడున్నారని, మణిపుర్‌పై ఆయన ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. సభ వాయిదా అనంతరం ఆప్‌, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీల ఎంపీలతో ధన్‌ఖడ్‌ భేటీ అయ్యారు. సభను సజావుగా నడపడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

రాత్రంతా నిరసన:మణిపుర్‌పై ప్రధాని ప్రకటన చేయాలనే డిమాండ్‌తోపాటు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు సోమవారం రాత్రంతా పార్లమెంటు ప్రాంగణంలో దీక్ష చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ సహా ‘ఇండియా’ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష చేశారు.

చిదంబరంపై ధన్‌ఖడ్‌ ఆగ్రహం:కాంగ్రెస్‌ ఎంపీ చిదంబరంపై రాజ్యసభ ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపుర్‌పై ప్రధాని మాట్లాడాలని డిమాండ్‌ చేస్తూ 267 నిబంధన కింద విపక్షాలు 51 నోటీసులిచ్చాయి. వీటికి ధన్‌ఖడ్‌ ప్రాముఖ్యం ఇవ్వలేదని చిదంబరం ఆరోపించారు. 267 నోటీసులు ఉండగా 176 నోటీసులను ముందుగా తీసుకోవడాన్ని తప్పుబట్టారు. దీంతో ఆయనపై ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది సూచనేనని, వ్యతిరేక వ్యాఖ్యలు కావని చిదంబరం వివరణ ఇచ్చారు. చివరకు ధన్‌ఖడ్‌ సభ్యుల నుంచీ తాను నేర్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

విపక్షాలకు లేఖ రాశా: అమిత్‌ షా

ప్రభుత్వం మణిపుర్‌పై ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉందని ప్రతిపక్షాల నేతలకు లేఖ రాశానని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. బహుళ రాష్ట్రాల సహకార సంఘాల బిల్లుపై స్వల్ప చర్చ సందర్భంగా మంగళవారం ఆయన లోక్‌సభలో మాట్లాడారు. నినాదాలు చేస్తున్న సభ్యులకు సహకరించడంపైనా, సహకార సంఘాలపైనా శ్రద్ధ లేదని విమర్శించారు. ‘మణిపుర్‌పై పార్లమెంటులో చర్చించడానికి మీ అమూల్య సలహాలను కోరుతున్నాం. అతి ముఖ్యమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయని భావిస్తున్నా. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. పార్టీలకతీతంగా స్పందించాలి’ అని లేఖలో అమిత్‌ షా కోరారు. ఖర్గే, అధీర్‌ రంజన్‌ చౌధురి తదితరులకు ఆయన ఈ లేఖ రాశారు. ‘తమతో దేశం, పార్లమెంటు ఉండాలని మణిపుర్‌ ప్రజలు కోరుకుంటున్నారు. చర్చలతోపాటు ప్రకటన చేయడానికీ సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి శాశ్వత పరిష్కారం కనుగొందాం’ అని లేఖలో పేర్కొన్నారు.