NRI-NRT

హవాయి కార్చిచ్చు ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైనది

హవాయి కార్చిచ్చు ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైనది

శతాబ్దాల చరిత్ర కలిగిన అమెరికా(USA)లోని హవాయి(Hawaii) దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్టు నగరం.. కార్చిచ్చు కారణంగా బూడిద గుట్టగా మారిపోయింది. ఇక్కడ మౌయి దీవిలో మృతుల సంఖ్య తాజాగా 89కి పెరిగింది. ఈ సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అమెరికాలోని ఫైర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లోరీ మూర్‌ మెరిల్లీ పేర్కొన్నారు. ‘‘గతంలో కాలిఫోర్నియాలోని బట్టీ కౌంటీలో చోటు చేసుకొన్న కార్చిచ్చు కన్నా ఇది పెద్దది’’ అని శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. అప్పట్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,53,336 ఎకరాల అడవి కాలిపోయింది. మొత్తం 18,000 నిర్మాణాలు బూడిదైపోయాయి.ఈ వారం మౌయి దీవిలో చోటు చేసుకొన్న ప్రమాదంలో ఇప్పటికే 89 మంది చనిపోయారు. గవర్నర్‌ జోష్‌ గ్రీన్‌ శనివారం మాట్లాడుతూ.. హవాయి రాష్ట్రం చవిచూసిన అతిపెద్ద ప్రకృతి విపత్తు ఇదేనని పేర్కొన్నారు. 2,200 నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. ఈ ఆస్తినష్టం సుమారు 6 బిలియన్‌ డాలర్లకుపైగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ 5.2 బిలియన్‌ డాలర్ల నష్టం అంచనాలను సిద్ధం చేసింది. హవాయి 1960లో భారీ సునామీని ఎదుర్కొంది. అప్పట్లో దాదాపు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు కూడా 1946లో వచ్చిన సునామీకి 158 మంది చనిపోయారు. తాజాగా కార్చిచ్చులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కచ్చితంగా తెలుసుకొనేందుకు మరికొన్ని రోజులు పడుతుందని గవర్నర్‌ జోష్‌ గ్రీన్‌ తెలిపారు.