ScienceAndTech

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మన ముందుకు వస్తూనే ఉంది. చాట్‌ ఎడిట్‌, చాట్ లాక్, వీడియో కాల్‌ సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ వంటి ఎన్నో సరికొత్త ఫీచర్లను ఇప్పటికే యూజర్లకు అందించింది. తాజాగా గ్రూప్‌ క్రియేట్‌ చేయటంలో వాట్సాప్‌ కొత్త మార్పును తీసుకొచ్చింది.సాధారణంగా వాట్సాప్‌లో గ్రూప్‌ క్రియేట్‌ చేయాలంటే ముందుగా కాంటాక్ట్స్‌లోని వారిని సెలెక్ట్ చేసుకొని దానికో పేరు పెట్టాలి. అప్పుడే గ్రూప్ క్రియేట్ అవుతుంది. అయితే, ఏదైనా హడావిడిలో పేరు ఎంపిక సాధ్యం కాకపోతే.. గ్రూప్‌ క్రియేట్‌ చేయడం కుదరదు. ఇకపై ఆ సమస్య ఉండబోదని వాట్సాప్ తెలిపింది. పేరుపెట్టాలనే నియమం లేకుండా వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ విషయాన్ని మెటా (Meta) సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) తన ఫేస్‌బుక్‌ (Facebook) ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే దానికి సంబంధించిన ఓ ఫోటోలను కూడా షేర్ చేశారు.

అత్యధికంగా ఆరుగురుతో క్రియేట్‌ చేసే వాట్సాప్ గ్రూప్‌లకు ఇకపై పేరు లేకపోయినా ఫర్వాలేదు. సభ్యుల పేర్ల ఆధారంగా గ్రూపు పేరు డైనమిక్‌గా మారుతుంటుంది. ప్రతి సభ్యుడికి వారి కాంటాక్టుల ఆధారంగా ఈ పేరు వేర్వేరుగా కనిపిస్తుంది. కావాలనుకుంటే తర్వాత గ్రూప్‌కి పేరు పెట్టొచ్చు. కేవలం అడ్మిన్‌ మాత్రమే కాకుండా గ్రూప్‌లోని సభ్యులు కూడా పేరును మార్చవచ్చు. అయితే, కాంటాక్ట్‌ని సేవ్‌ చేసుకోని వారికి మాత్రం ఫోన్‌ నంబర్ డిస్‌ప్లే అవుతుందని వాట్సాప్‌ వెల్లడించింది. రానున్న కొన్ని వారాల్లో ఈ సరికొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ తెలిపింది.