ScienceAndTech

ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని చేర్చాలని ఆ దేశం చెపట్టిన ప్రయోగం విఫలమైంది. గురువారం ఉదయం పూట ఉత్తర కొరియా ఈ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అలాగే మూడు నెలల క్రితం మొదటిసారిగా ఉత్తర కొరియా ప్రయోగం చేపట్టింది. అయితే ఇది విఫలం కావడంతో ఆ రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఇప్పుడు జరిగినటువంటి తాజా ప్రయోగంలో రాకెట్ మూడో దశలో ఫెయిల్ అయినట్లు ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. యద్ధ సమయంలో శత్రు దేశాలపై నిఘా పెట్టేందుకు.. అలాగే తమ దేశ పైలట్లకు సహాయంగా ఉండేందుకు నిఘా ఉపగ్రహ ప్రాజెక్టును ఉత్తర కొరియా సర్కార్ చేపట్టింది. అయితే ఈ ప్రయోగం రెండోసారి విఫలం కావడంతో ఆ దేశ స్పేస్ ఏజెన్సీ స్పందించింది.

అక్టోబర్‌లో మళ్లీ మూడో ప్రయోగం చేపడతామని పేర్కొంది. అయితే రాకెట్‌కు సంబంధించి మూడో దశ ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్ల ఈ ప్రయోగం విఫలం అయిందని కేసీఎన్‌ఏ తమ కథనంలో పేర్కొంది. అయితే ఇదేమి అంత పెద్ద సమస్య కాదని వెల్లడించింది. ఇదిలా ఉండగా దక్షిణ కొరియా నిఘా వర్గాలు ఉత్తర కొరియా చేప్టట్టిన ప్రయోగంపై ఓ కథనాన్ని వెల్లడించింది. వాస్తవానికి ఎల్లో సీ మీదుగా ఉత్తర కొరియా రాకెట్‌ను ప్రయోగించింది. దీనివల్ల జపాన్‌లో గగనతల రక్షణ వ్యవస్థలు స్పందించాయి. వెంటనే తమ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు ఎవరి ఇళ్లలో వారు తలదాచుకోవాలని సూచనలు చేశాయి. అయితే మరో విషయం ఏంటంటే 20 నిమిషాల వరకే ఈ హెచ్చరికలు అమలులో ఉన్నాయి. ఆ తర్వాత వీటిని జపాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ఉపసంహరించుకున్నాయి.

మరోవైపు ఉత్తరకొరియా చేపట్టినటువంటి ఈ నిఘా ఉపగ్రహ ప్రయోగాన్ని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సైతం ఖండించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఉత్తర కొరియా చేపట్టినటువంటి ఈ ప్రయోగానికి వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా కూడా ఈ ప్రయోగంపై స్పందించింది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. వెంటనే ఇలాంటి చర్యలను మానుకోవాలని సూచనలు చేసింది. దౌత్యమార్గాల ద్వారా ఏమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడంపై దృష్టి సారించాలని తెలిపింది. ఇటీవలే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు వాషింగ్టన్‌లో సమావేశాన్ని నిర్వహించాయి. అయితే ఈ భేటీ అనంతంర ఉత్తర కొరియా నిఘా ఉప్రగహాన్ని ప్రయోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.