Business

బియ్యం ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం-TNI నేటి వాణిజ్య వార్తలు

బియ్యం ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం-TNI నేటి వాణిజ్య వార్తలు

బియ్యం ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

 దేశంలో బియ్యం ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పుడు బియ్యం(పారాబాయిల్డ్ రైస్) ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని విధించింది. దీనికి సంబంధించి తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 25 నుంచి ఈ సుంకం అమల్లోకి వస్తుంది, అక్టోబర్ 15 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. ఆగస్టు 25వ తేదీలోపు కస్టమ్స్ పోర్ట్‌లో ప్యాకేజీ చేసి ఉన్నటువంటి బియ్యానికి మాత్రం వెసులుబాటు ఉంది. అలాగే, సరైన క్లియరెన్స్‌ పత్రాలు ఉన్న లోడ్‌ను కూడా ఎగుమతికి అనుమతించారు.ఈ నిర్ణయంతో దేశంలో ఉప్పుడు బియ్యం ధరలను అదుపులో ఉంచడంతో పాటు, దేశీయంగా ప్రజలందరికీ అందించడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉంటాయని కేంద్రం భావిస్తోంది. గతంలో బాస్మతి యేతర తెల్ల బియ్యం, విరిగిన బియ్యాన్ని ఎగుమతి చేయడంపై నిషేధం విధించడంతో ఉప్పుడు బియ్యంకు డిమాండ్ ఏర్పడి వాటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.రష్యా నల్ల సముద్రం ధాన్యం ఒప్పందం నుండి వైదొలిగిన తర్వాత, జులై 20న బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులను ప్రభుత్వం పరిమితం చేసినప్పటికీ దేశీయంగా బియ్యం ధరలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఉడకబెట్టిన బియ్యం ధరలు ఏప్రిల్ నుండి దేశీయ మార్కెట్‌లో 19 శాతం, అంతర్జాతీయ మార్కెట్‌లో 26శాతం పెరిగాయి. బియ్యం రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 12 శాతం, జులైలో 12.96 శాతంకి పెరిగింది.

21 ఏళ్లకే 12 వందల కోట్లు సంపాదించాడు

Zepto.. నిమిషాల్లో కిరాణా వస్తువులను మీముందుంచే కంపెనీ.. కంపెనీ మొదలు పెట్టినప్పటి నుంచి ఆగకుండా దూసుకుపోతోంది. మార్కెట్లో పోటీదారులకు అందకుండా అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తోంది. రూ. 1.4 మిలియన్ డాలర్లు అనగా 11వేల 556 కోట్ల రూపాయలు టర్నోవర్ తో 2023లో దేశంలోనే మొట్టమొదటి యూనికార్న్ గా నిలిచింది. ఈ కంపెనీని స్థాపించింది కేవలం 17 యేళ్ల కుర్రాడు.. అమెరికా కాలేజీలో డ్రాప్ అవుట్..ఇంజనీరింగ్ కోర్సును విడిచిపెట్టిన అదిత్ పాలిచా మరో పార్టినర్ కైవల్య వోహ్రాతో కలిసి 2021లో స్టార్టప్ కంపెనీనీ స్థాపించారు. ఈ ఇద్దరు యంగ్ బిజినెస్ మ్యాన్ లు తక్కువ కాలంలో కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాలిచా నికర ఆదాయం రూ. 11,556కోట్లు.. అతని వయస్సు కేవలం 21 యేళ్లు మాత్రమే.. ఏ రంగంలోనేనా దూసుకుపోవాలంటే వయస్సు కాదు.. టాలెంట్ అని నిరూపించాడు అదిత్ పాలిచా.పాలిచా 2001లో ముంబైలో జన్మించాడు. కేవలం 17 యేళ్ల వయసులో కంపెనీలు స్థాపించాడు. 2021లో వోహ్రాతో కలిసి  Zeptoని స్థాపించారు. కార్యకలాపాలు ప్రారంభించిన వారం రోజుల్లోనే స్టార్టప్ కంపెనీ విలువ 200 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ముంబైలో కంపెనీ ప్రధాన కార్యాలయం నడుస్తోంది. Zepto నిమిషాల్లో కిరాణా వస్తువులను అందిస్తోంది. 

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ప‌లు కొత్త కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తుండ‌గా, ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు ప్రారంభించిన ప‌లు కంపెనీలు.. త‌మ ప్లాంట్ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.కోకా కోలా సంస్థ‌ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌ను రెట్టింపు చేస్తుంది. సిద్దిపేట‌లోని ప్లాంట్‌ను మ‌రింత విస్త‌రించాల‌ని కోకా కోలా సంస్థ నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్లాంట్‌లో అద‌నంగా రూ. 647 కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. వ‌రంగ‌ల్ లేదా క‌రీంన‌గ‌ర్‌లో రెండో త‌యారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టింది కోకా కోలా సంస్థ‌.

వాయిస్‌ కాలింగ్‌తో పెబల్ కొత్త వాచ్

స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ పెబల్‌ (Pebble) భారత్‌ మార్కెట్‌లో కొత్త వాచ్‌ తీసుకొచ్చింది. ఈ ఏడాది జులైలోనే కాస్మోగ్‌ వోగ్  (Pebble Cosmos Vogue) పేరిట వాచ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ ఇప్పుడు.. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ (Pebble Game of Thrones) పేరిట మరో స్మాట్‌వాచ్‌ను శుక్రవారం విడుదల చేసింది. 1.43 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో ఇది వచ్చింది. బ్లూటూత్‌ కాలింగ్ (BT calling) ఫీచర్‌ కూడా ఇందులో ఉంది.పెబల్ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ.5,499 గా కంపెనీ ప్రకటించింది. నలుపు, గ్రే, గోల్డ్‌.. ఈ మూడు రంగుల్లో లభిస్తుంది. 1.43 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో గుండ్రపు ఆకారంలో ఈ వాచ్‌ ఉంటుంది. ఇందులో 250mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏడు రోజుల పాటు వస్తుందని కంపెనీ వెల్లడించింది. లెధర్‌ స్ట్రాప్స్‌తో ఈవాచ్‌లను తీసుకొచ్చారు. మ్యాగ్నెటిక్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని ఇస్తున్నారు. స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మొబైల్‌ ఫోన్‌లోని బ్లూటూత్‌ కనెక్షన్ ద్వారా ఫోన్‌కు వచ్చే కాల్స్‌ని లిఫ్ట్‌ చేసి వాచ్‌లో అమర్చిన మైక్రోఫోన్ సాయంతో ఫోన్‌ మాట్లాడొచ్చు. ఇందులో SpO2, హార్ట్‌రేట్‌, స్లీప్‌ మానిటరింగ్‌ వంటి హెల్త్‌ ట్రాకర్స్‌ ఉన్నాయి. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌, ఫిట్‌నెస్‌ యాక్టివిటీ ట్రాకర్లను కూడా ఇచ్చారు. వీటితో పాటు కాలిక్యులేటర్ యాప్, అలారం క్లాక్‌, స్టాప్‌వాచ్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. నీరు, దుమ్ము చేరకుండా IP67 రేటింగ్‌ను ఈ వాచ్‌కు ఇచ్చారు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ రెండిటికీ ఈ వాచ్‌ సపోర్ట్‌ చేస్తుందని పెబల్ వెల్లడించింది. పెబల్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ వెబ్‌సైట్‌ సాయంతో వీటిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

*  అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై సెబీ తన విచారణ

అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై సెబీ తన విచారణను పూర్తి చేసింది.  అమెరికాకు చెందిన షార్ట్​సెల్లింగ్​ సంస్థ హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ నివేదికలోని ఆరోపణలపై విచారణ ముగిసిందని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.   తన నివేదికలోని వివరాలను మాత్రం వెల్లడించలేదు.  తమ పరిశోధనల ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని మాత్రమే పేర్కొంది. అదానీ గ్రూప్  లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన 24 లావాదేవీలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. వీటిలో 22 లావాదేవీలపై విచారణ తుదిదశకు చేరింది. మిగతా రెండింటి గురించి కొన్ని ఏజెన్సీల నుంచి సమాచారం రావాల్సి ఉందని పేర్కొంది. విచారణ సమయంలో సెబీ తీసుకున్న చర్యలను కోర్టు ఫైలింగ్ వివరించింది. కొన్ని రిలేటెడ్​ పార్టీ లావాదేవీలపై చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. ఈ కేసును ఆగస్టు 29న సుప్రీంకోర్టు విచారించనుంది. రిలేటెడ్​ -పార్టీ లావాదేవీల నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో 13 అదానీ గ్రూప్ డీలింగ్‌‌‌‌‌‌‌‌లను సెబీ పరిశీలించినట్లు తెలిసింది. కొన్ని ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్ డీల్స్‌‌‌‌‌‌‌‌పైనా విచారణ జరిపినట్టు సమాచారం. అదానీ గ్రూప్ కంపెనీల పబ్లిక్ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌లుగా ఉన్న 12 మంది విదేశీ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లను కవర్ చేసినట్లు రెగ్యులేటర్ తెలిపింది. అయితే ఈ సంస్థలలో కొన్ని ట్యాక్స్​హెవెన్స్​గా పిలిచే దేశాల పరిధిలో ఉన్నాయి.  ఈ అంశంపై ఐదు దేశాల నుంచి సమాచారం కోరినట్లు సెబీ తెలిపింది. 

భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్‌

భారతదేశంలోని 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు (సుమారు 70 శాతం) మిలీనియల్స్‌  (1981 నుంచి 1996 మధ్య పుట్టిన వారు) ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి పేర్కొంది. వీరిలోనూ 22 శాతం మంది మహిళలు కావడం గమనార్హం.గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ నివేదిక ప్రకారం 87 శాతం మంది మిలీనియల్స్ తమ ప్రస్తుత కంపెనీలను గొప్ప కార్యస్థలంగా భావిస్తున్నారు. మిలీనియల్స్‌లో 39 శాతం మంది మేనేజర్‌ స్థాయికి ఎదిగారని, ఈ కంపెనీలు అనుసరిస్తున్న ప్రగతిశీల నాయకత్వ అభివృద్ధి వ్యూహాలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది.మిలీనియల్స్‌లో దాదాపు 52 శాతం మంది తమ యాజమాన్యాల నిర్ణయాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిదింట నాలుగు రంగాల్లో మిలీనియల్స్ బలమైన సానుకూలతను కలిగి ఉన్నారు. అయితే దీనికి విరుద్ధంగా యాజమాన్యాల పక్షపాత వైఖరి, లాభాల పంపిణీ వంటి విషయాల్లో మాత్రం అంత సానుకూలత లేదని నివేదిక పేర్కొంది.మిలీనియల్స్ కీలక రంగాలలో గణనీయమైన శాతంలో ఉన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌లో 75 శాతం, హెల్త్‌కేర్‌లో 75 శాతం, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో 72 శాతం వీరే ఉన్నారు. కార్య క్షేత్రంలో 45 శాతం మిలీనియల్స్‌కు విస్తారమైన ఆవిష్కరణ అవకాశాలు లభిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

 ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నంబర్‌ తిరుపతి – షిర్డీ సాయినగర్‌ (రైలు నంబర్‌ 07637) రైలును సెప్టెంబర్‌ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం నడువనున్నది. అలాగే షిర్డీ సాయినగర్‌ – తిరుపతి (07638) రైలును సెప్టెంబర్‌ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నది. కాజీపేట – దాదర్‌ (07195) రైలు సెప్టెంబర్‌ 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం పరుగులు తీయనున్నది. దాదర్‌ – కాజీపేట (07195) రైలు ప్రతి శనివారం నడువనుండగా.. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. కాజీపేట – దాదర్‌ (07197) వీక్లీ రైలు సెప్టెంబర్‌ 2-30 వరకు ప్రతి శనివారం నడువనున్నది. అలాగే దాదర్‌ – కాజీపేట (07198) మధ్య ఆదివారం అందుబాటులో ఉండనుండగా.. సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పొడిగించింది.అలాగే హైదరాబాద్‌ – రక్సౌల్‌ (07051) మధ్య ప్రతి శనివారం రైలు నడువనుండగా.. సెప్టెంబర్‌ 2 నుంచి 30 వరకు, రక్సౌల్‌ – హైదరాబాద్‌ రైలు ప్రతి మంగళవారం సెప్టెంబర్‌ 5-అక్టోబర్‌ 3 వరకు నడువనున్నది. సికింద్రాబాద్‌ – దానాపూర్‌ (07419) మధ్య శనివారం 2 నుంచి 30 వరకు, దానాపూర్‌ – సికింద్రాబాద్‌ (07420) మధ్య ప్రతి సోమవారం సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు రైలు పరుగులు తీయనున్నది. సికింద్రాబాద్‌ – రక్సౌల్‌ (07007) మధ్య ప్రతి బుధవారం 6 నుంచి 27 వరకు.. రక్సౌల్‌ – సికింద్రాబాద్‌ మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్‌ 8 నుంచి 29 వరకు పొడిగించింది. సికింద్రాబాద్‌ – జైపూర్‌ (07115) మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29, జైపూర్ – హైదరాబాద్ (07116) మధ్య ప్రతి ఆదివారం సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 1 వరకు నడువనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే కాచిగూడ – బికనీర్‌ (07053) మధ్య ప్రతి శనివారం సెప్టెంబర్‌ 2 నుంచి సెప్టెంబర్‌ వరకు, బికనీర్-కాచిగూడ (07054) మధ్య ప్రతి మంగళవారం సెప్టెంబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 3 వరకు ప్రత్యేక రైలును పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

రియల్​మీ  తన మిడ్-రేంజ్ బడ్జెట్​ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్11 5జీ ని లాంచ్

రియల్​మీ  తన మిడ్-రేంజ్ బడ్జెట్​ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్11 5జీ ని లాంచ్​ చేసింది. ఇందులో 108 ఎంపీ మెయిన్​ కెమెరా 67 వాట్ల సూపర్​వూక్​ ఛార్జింగ్ సొల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,   మీడియాటెక్  డైమెన్సిటీ  6100 ప్లస్​ ప్రాసెసర్​, 16 జీబీ వరకు డైనమిక్ ర్యామ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 8జీబీ+128 జీబీ వేరియంట్​ ధర రూ.19 వేలు కాగా, 8జీబీ+256 జీబీ వేరియంట్​ ధర రూ.20 వేలు. అమ్మకాలు ఈ నెల 29 నుంచి మొదలవుతాయి.జూమ్ ఆధ్వర్యంలో జూమ్ ఎక్స్​పీరియెన్స్​డేను హైదరాబాదులోని ఒక హోటల్లో  నిర్వహించారు. తమ టెక్నాలజీల ద్వారా కంపెనీల సామర్థ్యం ఎలా పెరుగుతుందో ఈ సందర్భంగా వివరించారు. జూమ్​లో టీమ్ చాట్, మీటింగ్స్, కాంటాక్ట్, స్మార్ట్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  జూమ్ ఐక్యూ, వైట్​బోర్డ్​, జూమ్ షెడ్యూలర్, జూమ్ కాంటాక్ట్ సెంటర్ వంటివి కంపెనీలకు ఎంతో మేలు చేస్తాయని సంస్థ తెలిపింది.

టాటా నేతృత్వంలోని  ఎయిరిండియాకు భారీ షాక్‌

టాటా నేతృత్వంలోని  ఎయిరిండియాకు భారీ షాక్‌  తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్‌లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు  డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్‌ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు.DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్‌ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్‌లిస్ట్‌ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్‌ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్‌లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్‌లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్‌ చేసింది.అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్‌లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్‌లైన్ నేరుగా  పరిశీలిస్తుందన్నారు.