Devotional

గణేష్ ఉత్సవాలపై కీలక సమీక్ష

గణేష్ ఉత్సవాలపై కీలక సమీక్ష

శోభకృత్‌ నామ సంవత్సరంలో వినాయక చవితి పండగను భాద్రపద శుక్ల చతుర్థి (18-09-2023) సోమవారం రోజున నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ సూచించింది. సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచే నవరాత్రులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజలకు విద్వత్సభ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పీఠాలకు శాస్త్రబద్ధంగా నిర్ణయించిన పండగల జాబితాను విద్వత్సభ సమర్పిస్తూ ఉంటుంది. వినాయక చవితి పండగను సెప్టెంబర్‌ 18న నిర్వహించాలా? లేదా సెప్టెంబర్‌ 19న జరపాలా? అనే అంశంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రంలో 100 మంది సిద్ధాంతుల సమక్షంలో జులై 22, 23న షష్ఠమ వార్షిక విద్వత్సమ్మేళనంలో చర్చించి పండగ తేదీపై నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు ప్రకటనలో తెలిపింది.

గణేశ్‌ ఉత్సవాలపై తలసాని సమీక్ష: మరోవైపు హైదరాబాద్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వినాయక చవితి ఏర్పాట్లు, మండపాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో గణేశ్‌ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ నగరంతోపాటు చుట్టుపక్కల 32,500 వరకు వినాయక మండపాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. వచ్చే నెల 19వ తేదీన వినాయక చవితి ప్రారంభం నుంచి నిమజ్జనం జరిగేంత వరకు బందోబస్తు ఉంటుందన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకుంటామని వెల్లడించారు.అయితే, పండగకు మరికొన్ని రోజుల సమయం ఉన్నందున వినాయక చవితి ఎప్పుడన్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.