Business

విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం

విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం

విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరనుంది. సముద్ర విహారంపై ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబు అయింది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్ లో వచ్చి విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్ లో ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్ లో రూ.96 కోట్లతో ఈ సముద్ర విహార కేంద్రాన్ని నిర్మించారు.క్రూయిజ్ షిప్ తో పాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్ కు అనుగుణంగా క్రూయిజ్ టెర్మినల్ ను తీర్చి దిద్దారు. దీనిని ఇవాళ (సోమవారం) కేంద్రమంత్రి శర్వానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. రెండు వేల మంది ప్యాసింజర్లను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన వెలెల్స్ ను నిర్వహించే సామర్థ్యం ఈ టెర్మినల్ సొంతం. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైకులు నిలిపేలా ఏర్పాట్లు చేశారు.

2500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తి చేశారు. క్రూయిజ్ లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్, పర్యాటకులు సేద తీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మాణించారు.గంటకు 200 కిలో మీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్లు పొడవు ఉంటుంది. ఈ టెర్మినల్ లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్ నిర్మించారు.

తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ పరిధిలోకి అనుమతించేలా డిజైన్ చేశారు. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఓడ రేవులు, జల రవాణా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్, సహాయ శ్రీపాద నాయక్ మొత్తం రూ.333 కోట్ల 50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.