DailyDose

పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ ఫోన్

పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ ఫోన్

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో సోమవారం సాయంత్రం అలాంటి ఓ విషాద ఘటన వెలుగు చూసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కురుస్తుండడంతో.. పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. పిడుగుపాటుతో సూదివరపు జయంత్ (23) అనే యువకుడి జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలింది. దీంతో యువకుడు మృత్యువాత పడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో జయంత్ మరో వ్యక్తితో కలిసి పాత మల్లంపేట నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. అతనితోపాటు ఉన్న యువకుడికి కూడా గాయాలయ్యాయి. కానీ ప్రాణాపాయం తప్పింది.

మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అక్కపల్లి వద్ద ప్రవహిస్తున్న లోతు వాగులో పడి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. తురిమెళ్ళకు చెందిన మహమ్మద్ ఖాశిం బండిమీద వెళుతూ వాగులో కొట్టుకుపోయాడు. అతను చుట్టుపక్కల గ్రామాలకు ద్విచక్ర వాహనం మీద వెళ్లి కూరగాయలను అమ్ముతుంటాడు. అతను గల్లంతవ్వడంతో గజ ఈతగాళ్లు గాలించినా ఆచూకీ దొరకలేదు.