NRI-NRT

మరణానంతరం కూడా విరాళం ఆగకూడదు

మరణానంతరం కూడా విరాళం ఆగకూడదు

లూలు గ్రూప్ ఛైర్మన్, ఎన్నారై ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కేరళలోని ఓ బధిరుల కేంద్రానికి సంవత్సరానికి కోటీ రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. వికలాంగ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆర్ట్ సెంటర్‌కు ఇలా ప్రతియేటా రూ.1కోటి విరాళం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సహకారం తన మరణాంతరం కూడా కొనసాగుతుందని ఆయన చెప్పారు.

అలాగే డిఫరెంట్ ఆర్ట్స్ సెంటర్ (DAC) కి అలీ మరో రూ. 1.5 కోట్లను విరాళంగా అందజేశారు. కాసర్‌గోడ్ డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ లోగో ఆవిష్కరణ కోసం ఇక్కడి ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసిన ప్రత్యేకం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కేరళ రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికిపైగా పేద, వికలాంగ పిల్లలు ఉన్నారని చెప్పిన ఆయన.. ఈ పిల్లలందిరికీ మంచి విద్యను పొందేలా చేయడం తమ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. తన సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి డీఏసీకి రూ. 1.5 కోట్లు విరాళంగా ఇస్తానని, డీఏసీ అకాడమీ ఆఫ్ మ్యాజికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ ముత్తుకాడ్‌కు దాని తాలూకు చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగానే ఇకపై డీఏసీకి ప్రతియేటా కోటి రూపాయల విరాళాన్ని (Donation) కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. తన మరణాంతరం కూడా సహకారం కొనసాగుతుందని తెలిపారు. “ప్రతి ఏడాది ఈ ఇన్‌స్టిట్యూట్‌కి కోటి రూపాయలు అందుతాయి. నా మరణం తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. నేను నా టీమ్‌కి చెబుతాను. దానిని రాతపూర్వకంగా రాసిస్తాను. ప్రతి జనవరిలో ఆ మొత్తం ఈ ఇన్‌స్టిట్యూట్‌కు చేరుతుంది” అని అలీ చెప్పుకొచ్చారు