DailyDose

మెట్రో మేలంటున్నా బెంగళూరు వాసులు

మెట్రో మేలంటున్నా బెంగళూరు వాసులు

బెంగళూరు వాసుల్లో అత్యధికులు కార్లు, మోటారు సైకిళ్లపై కంటే మెట్రో రైళ్లలో ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది. రోజురోజుకు బెంగళూరు నగరంలో ట్రాఫిక్ పెరిగిపోవడంతో పర్సనల్ వెహికల్స్‌పై వెళ్లే వారి బాధలు వర్ణనాతీతం. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకోవడానికి మెట్రో రైల్ వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బెస్ట్ అని 95 శాతం మంది వాహనాల యజమానులు చెబుతున్నారని స్వచ్ఛంద సంస్థల సర్వేలో తేలింది. పలువురు వాహన చోదకులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి గంట నుంచి గంటన్నర పడుతుందని చెబుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు మరో అర్ధగంట టైం వేస్టవుతుందని అంటున్నారు.

పర్సనల్2 పబ్లిక్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 3,855 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో అత్యధికులు కారు లేదా మోటారు సైకిల్‌పై కంటే మెట్రో రైలులో ప్రయాణిస్తే సగం సమయం కలిసి వస్తుందని చెప్పారు. ప్రతి రోజూ సగటు బెంగళూరు వాసి తన విధులు నిర్వర్తించడానికి 10 కి.మీ దూరం ప్రయాణించాల్సిందే. బెంగళూరు మెట్రో రైల్ నెట్‌వర్క్ 13 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ నెట్‌వర్క్ పరిధిలో గల వారంతా తమ గమ్యస్థానానికి ట్రాఫిక్ సమస్యల్లేకుండా ప్రయాణించాలంటే మెట్రో రైల్ బెస్ట్ అంటున్నారు.

టూ వీలర్, కారులో కంటే మెట్రో రైల్, బస్సులో ప్రయాణానికి మొగ్గు చూపడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు పెట్రోల్ లేదా గ్యాస్ లేదా ఫ్యుయల్ ఆదా అవుతుందని చెబుతున్నారు. మెట్రో రైలులో తమ గమ్యస్థానానికి 35 లేదా 40 నిమిషాల్లో చేరుకుంటున్నామని తెలిపారు.

బెంగళూరులోని టెక్నాలజీ కారిడార్లలో పని చేస్తున్న నిపుణులు తమ సంస్థల కార్యాలయాలకు వెళ్లడానికి ఔటర్ రింగ్ రోడ్ లేదా వైట్ ఫీల్డ్ రూట్‌లో ప్రయాణిస్తుంటారు. 3855 మందిలో సుమారు 58 శాతం మంది ప్రతి రోజూ పనుల కోసం పర్సనల్ వెహికల్స్ వాడతారు. సుమారు 17 శాతం మంది మెట్రో రైల్, బస్సుల్లో ప్రయాణిస్తుంటారు.

టెక్ పార్కులు గల ఔటర్ రింగ్ రోడ్డు, కేఆర్ పురం తదితర ప్రాంతాలకు నడిచే బస్సులు తరుచుగా ఉండవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక యాజమాన్యాలు రవాణా సౌకర్యం కల్పించినా చార్జీలు వసూలు చేస్తాయి. మరోవైపు బెంగళూరులో పని చేసే శ్రామిక మహిళల పరిస్థితి అసలు చెప్పలేం. దాదాపు 50 శాతం మహిళలు రెగ్యులర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, షేర్డ్ మొబిలిటీ ఆప్షన్లపై ఆధారపడుతున్నారు. నిరంతరంగా నమ్మదగిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ కావాలని కోరుతున్నారు.