పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం లేకపోవడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని సోనియా గాంధీని కవిత సూటిగా ప్రశ్నించారు.చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని అడిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళ బిల్లు పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని నిరూపితమైందని స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం రోజున ఎక్స్ (ట్విట్టర్)లో కవిత పోస్ట్ చేశారు.