Business

ఐటీ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి డిగ్రీ తప్పనిసరా?

ఐటీ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి డిగ్రీ తప్పనిసరా?

ఐటీ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి ఇంజినీరింగ్ డిగ్రీ తప్పనిసరి అనేది చాలా మందికున్న అభిప్రాయం. అయితే, ఈ భావన తప్పని నిపుణులు చెబుతున్నారు. వేగంగా మారుతున్న ఐటీ రంగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేని వారికి కూడా అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఎంచుకున్న రంగంపై ఆసక్తి, మంచి నైపుణ్యాలు ఉంటే ఐటీ రంగంలో కుదురుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఏడు రకాల ఐటీ ఉద్యోగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యత అని అంటున్నారు. మరి ఆ ఏడు ఐటీ జాబ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి!

సాఫ్ట్‌వేర్ డెవలపర్: మంచి కోడింగ్ నైపుణ్యాలతో ఎవరైనా సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావచ్చనేది నిపుణులు చెప్పేమాట. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కచ్చితంగా ఉండాలన్న నిబంధన ఏదీ లేదని వారు చెబుతున్నారు.

వెబ్ డెవలపర్:డిగ్రీలు అవసరం లేని మరో ఐటీ జాబ్.. వెబ్‌డెవలపర్. ఆన్‌లైన్ కోర్సులు, ప్రాజెక్టుల ద్వారా
హెచ్‌టీఎమ్‌ఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వంటి టెక్నాలజీలపై వాటిపై పట్టుపెంచుకుంటే వెబ్‌డెవలపర్ ఉద్యోగం సంపాదించొచ్చు.

డాటా అనలిస్ట్:నేటి ఆధునిక సమాజానికి సమాచారమే ఊపిరి. డాటా మానిప్యులేషన్, విజువలైజేషన్, విశ్లేషణ వంటి నైపుణ్యాలుంటే డాటా సైన్స్ డిగ్రీ లేకున్నా డాటా అనలిస్ట్‌గా జాబ్ కొట్టొచ్చు.

నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్:CompTIA Network,CCNA వంటి కోర్సులతో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా కొలువు పొందొచ్చు. నెట్విర్క్ మేనేజమెంట్‌లో కాస్తంత అనుభవం ఉంటే మరింత లాభం.

ఐటీ సపోర్టు స్పెషలిస్ట్:CompTIA Network సర్టిఫికేషన్‌తో పాటూ సమస్యలు పరిష్కరించే నైపుణ్యాలు, వినియోగదారులను ఆకట్టుకునే తీరున్న వారు ఐటీ సపోర్టు స్పెషలిస్టుగా జాబ్ కొట్టొచ్చు. దీనికి కూడా ఇంజినీరింగ్ డిగ్రీ అక్కర్లేదు.

సైబర్‌సెక్యూరిటీ ఎనలిస్ట్:అనేక రకాలు ప్రమాదాలు పొంచి ఉండే సైబర్ దునియాలో సైబర్‌సెక్యూరిటీ ఎనలిస్టుల పాత్ర ఎంతో కీలకం. CompTIA Security, CISSP సర్టిఫికేషన్‌తో పాటూ సైబర్ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై మంచి పట్టున్న వారు సైబర్ ఎనలిస్టులుగా మంచి కెరీర్ సొంతం చేసుకోవచ్చు.

డాటా సైంటిస్ట్:మ్యాథ్స్‌లో ప్రాథమిక అంశాలపై మంచి పట్టు, గణాంక శాస్త్రంపై అవగాహన, ప్రోగ్రామింగ్, డాటా సైన్స్ టూల్స్‌పై పట్టున్నవారు డాటా సైంటిస్ట్‌గా నిలదొక్కుకోవచ్చు. అయితే, చాలా మంది డాటా సైంటిస్టులకు మ్యాథ్స్‌లో ఉన్నతస్థాయి డిగ్రీలు ఉంటాయి.