Business

హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం- TNI నేటి వాణిజ్య వార్తలు

హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం- TNI నేటి వాణిజ్య వార్తలు

నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు అనగా శుక్రవారం బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి మీద ధరను పోల్చి చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 కు తగ్గి రూ.54,900 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కు తగ్గి రూ.59,890 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,900,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,890.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,900,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,890.

*  డ్రాగన్‌ కొరికిన యాపిల్‌

అమెరికా (USA) టెక్‌ దిగ్గజం యాపిల్‌(Apple)కు చైనా (China) సెగ గట్టిగానే తాకింది. ఈ సంస్థ షేర్లు కేవలం రెండు రోజుల్లో 200 బిలియన్‌ డాలర్ల (రూ.16.63 లక్షల కోట్లు) మేరకు విలువ కోల్పోయాయి. ఇది కంపెనీ మొత్తం విలువలో సుమారు ఆరు శాతానికి సమానం. యాపిల్‌కు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో చైనా కూడా ఒకటి. ఆ సంస్థ మొత్తం ఆదాయంలో 18 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. దీంతోపాటు యాపిల్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఫాక్స్‌కాన్‌కు చైనాలో అతిపెద్ద తయారీ యూనిట్‌ ఉంది. వాల్‌స్ట్రీట్‌లో అతిపెద్ద మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీల్లో యాపిల్‌ కూడా ఒకటి. దీని మార్కెట్‌ విలువ 2.8 ట్రిలియన్‌ డాలర్లు.ఇటీవల చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్‌ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్‌ ఫోన్లూ వాడొద్దని సూచించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బాంబు పేల్చింది. ఇక ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీల ఉద్యోగులు కూడా యాపిల్‌ ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశించే అవకాశం ఉందటూ ఆ మర్నాడే బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ 12న ఐఫోన్‌-15 విడుదలకు ముందు వచ్చిన ఈ కథనాలు యాపిల్‌ పెట్టుబడిదారుల్లో భయాల్ని రేకెత్తించాయి. చైనా మాత్రం ఈ కథనాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.బీజింగ్‌-వాషింగ్టన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిలో తాజా కథనాలు ఆజ్యం పోశాయి. ఈ ఏడాది అమెరికా తన మిత్రదేశాలైన జపాన్‌, నెదర్లాండ్స్‌తో కలిసి చైనాకు చిప్‌ టెక్నాలజీ ఎగుమతులను నియంత్రించింది. దీనికి ప్రతిగా చైనా నుంచి పశ్చిమ దేశాల సెమీకండెక్టర్‌ పరిశ్రమకు సరఫరా అయ్యే రెండు కీలక పదార్థాల ఎగుమతులను డ్రాగన్‌ నిలువరించింది. దీంతో పాటు దేశీయ చిప్‌ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఏకంగా 40 బిలియన్‌ డాలర్లను బీజింగ్‌ కేటాయించింది. అంతేకాదు.. ఇటీవల చైనాకు చెందిన హువావే సంస్థ అత్యాధునిక మేట్‌ 60 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. దీనిలో చైనాకు చెందిన ఎస్‌ఎంఐసీ తయారు చేసిన 5జీ కిరిన్‌ 9000ఎస్‌ ప్రాసెసర్‌ను వాడింది. ఈ పరిణామం చైనా టెక్నాలజీ పరిశ్రమలో మేలిమలుపుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కూడా యాపిల్‌ షేర్ల పతనానికి కారణమై ఉంటుందని చెబుతున్నారు.

* హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం

దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. అన్ని రకాల లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్‌) వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఆయా రుణాలపై ఈఎంఐ భారం మరింత భరించక తప్పదు.హెచ్‌డీఎఫ్‌సీ రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర పెంచింది. దీని ప్రకారం బ్యాంకుకు సంబంధించిన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఇకపై వడ్డీ భారం పెరగనుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ పెంపు తర్వాత 8.35 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.70 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఏడాదిలోపు రుణాలపై వడ్డీరేటు భారం 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.15 శాతానికి చేరింది.సెప్టెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ MCLR,6 నెలలుకాల రుణాలపై 9.05 శాతం,ఏడాది రుణాలపై 9.15శాతం రెండేళ్ల కాలపరిమితి రుణాలపై 9.20 శాతం ,మూడేళ్ల కాల రుణాలపై 9.25శాతం వడ్డీ వర్తిస్తుంది.

నేడు తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరట కలిగించిన విషయం తెలిసిందే. అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లను తగ్గించారు.హైదరాబాద్: రూ. 966, వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ.927 గుంటూర్: రూ. 944.

భారత్‌లోనూ పిక్సెల్‌ 8 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌

గూగుల్‌ తన పిక్సెల్‌ 8 సిరీస్‌ ఫోన్ల లాంచ్‌కు సిద్ధమైంది. భారత్‌లోనూ ఈ ఫోన్లను విడుదల చేయనుంది. అక్టోబర్‌ 4న నిర్వహించే ‘మేడ్‌ బై గూగుల్‌’ పేరిట నిర్వహించే ఈవెంట్‌లో గూగుల్‌ తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు అయిన పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8 ప్రోను (Google Pixel 8, Pixel 8 Pro) లాంచ్‌ చేయనుంది. ఆ మరుసటి రోజు నుంచి (అక్టోబర్‌ 5) ఫ్లిప్‌కార్ట్‌లో వీటి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఫోన్లతోపాటు పిక్సెల్‌ వాచ్‌ 2, బడ్స్‌ ప్రోను కూడా లాంచ్‌ చేయనుంది. తాజాగా దీనికి సంబంధించి గూగుల్‌ ఇండియా ఎక్స్‌ ద్వారా ఓ టీజర్‌ను విడుదల చేసింది.గూగుల్‌ గతంలో పిక్సెల్‌ 4, 5, 6 సిరీస్‌ ఫోన్లను రిలీజ్‌ చేసినప్పటికీ.. వీటిని భారత్‌కు తీసుకురాలేదు. పిక్సెల్‌ 4ఏ, 6ఏ, 7ఏ ఫోన్లను మాత్రం తీసుకొచ్చింది. పిక్సెల్‌ 7, 7 ప్రో ఫోన్లను గతేడాది అక్టోబర్‌లో భారత్‌లో గూగుల్‌ లాంచ్‌ చేసింది. ఇప్పుడు గూగుల్‌ పిక్సెల్‌ 8, 8 ప్రో ఫోన్లను (Google Pixel 8, Pixel 8 Pro) తీసుకొస్తోంది. అయితే, ఫస్ట్‌ సేల్‌, ధర వంటి వివరాలు మాత్రం గూగుల్‌ వెల్లడించలేదు.గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14తో వచ్చే అవకాశం ఉంది. టెన్సర్‌ జీ3 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు తెలిసింది. పిక్సెల్‌ 8లో 4,485 ఎంఏహెచ్‌ బ్యటరీ, 24W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం; పిక్సెల్‌ 8 ప్రో 4,950 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 27W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతోనూ వస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. వేరియంట్‌ను బట్టి ధర సైతం రూ.78 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.30 లక్షలు ఉండే అవకాశం ఉంది. అసలు ధర, పూర్తి స్పెసిఫికేషన్లు తెలియాలంటే ఈవెంట్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఇదే ఈవెంట్‌లో గూగుల్‌ వాచ్‌ 2, బడ్స్‌ ప్రో తీసుకొస్తున్నారు. వీటిని భారత్‌లో విక్రయిస్తారా లేదా అన్నది తెలియరాలేదు.

* డీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,089 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల చేసినా.. అధికారులు తాజాగా బయటపెట్టారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ డీఎస్సీ పరీక్ష 2023 నవంబర్ 20 నుంచి 30 వరకు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో మొత్తం 5,089 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితుల పోస్టులు, 164 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణతతో పాటు టెట్ లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది. వయో పరిమితి 18 నుంచి 44 ఏళ్లు.. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

* ఏటీఎం కార్డుతో పేటీఎం పేమెంట్స్

మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్లు అధికంగా జరగుతున్నాయి. వినియోగదారులు తమ ఫోన్ నుంచి క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు చేసేస్తున్నారు. కరోనా అనంతరం పరిణామాల్లో ఈ వ్యవస్థ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందులో పేటీఎం ప్రధాన పాత్ర పోషించింది. డిజిటల్ ఇండియా నినాదానికి ఆర్థిక లావాదేవీల పరంగా పేటీఎం తన వంతు పాత్రను సమర్థంగా పోషించింది. దీంతో మనం చేతుల్లో చిల్లిగవ్వ లేకపోయినా.. కేవలం ఫోన్ ఉండి.. దానిలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ ఉంటే చాలు ఎంచక్కా ఏది కావాలంటే అది కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకూ ఈ తరహా లావాదేవీలు చేయాలంటే కేవలం పలు యాప్ ల ద్వారా మాత్రమే సాధ్యమైంది. మీ బ్యాంకు అకౌంట్ ను పేటీఎం వంటి వాటితో అనుసంధానించి, ఖాతాలోని నగదును వాడుకోవచ్చు. అయితే ఇకపై మన కార్డు ఆధారిత పేమెంట్లు కూడా చేసే విధంగా పేటీఎం సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఇందుకోసం పేటీఎం కార్డు సౌండ్ బాక్స్ ను లాంచ్ చేసింది. ఇప్పడు ఎంచక్కా ఏటీఎం కార్డుతోనే మీరు లావాదేవీ పూర్తి చేయచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..పేటీఎం కార్డు సౌండ్ బాక్స్..పేటీఎం తీసుకొచ్చిన ఈ కార్డు సౌండ్ బాక్స్ ద్వారా మీరు అన్ని ఏటీఎం కార్డులు అంటే వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డులతో లావాదేవీలు చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఆధారిత మొబైల్ చెల్లింపులకు అదనంగా ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడనుంది. ట్యాప్ అండే పే విధానంలో వినియోగదారులు తమ కార్డును ఉపయోగించి పేమెంట్ పూర్తి చేయొచ్చు. ఇది యూజర్లతో పాటు వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
సౌండ్ బాక్స్ ద్వారా నోటిఫికేషన్..పేటీఎం సౌండ్ బాక్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వ్యాపారుల వద్ద మనం చేసిన లావాదేవి వివరాలు వాయిస్ నోటిఫికేషన్ రూపంలో అక్కడ వినిపిస్తుంది. మీరు చేసిన చెల్లింపు విజయవంతం అయితే పేటీఎం పేమెంట్ ఆఫ్ రూపీస్ 100 అంటూ వినిపించే వాయిస్ ఉంటుంది. దీంతో ఫోన్ ఓపెన్ చేసి నగదు చెల్లింపు జరిగిందా లేదా అని తనిఖీ చేసుకోవాల్సిన అసవరం ఉండదు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 2019లోనే పేటీఎం ఈ సౌండ్ బాక్స్ ను తీసుకొచ్చింది. మన దేశంలో మొట్టమొదటిగా ఇలా ఆడియో నోటిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది పేటీఎం సంస్థే.సౌండ్ బాక్స్ పూర్తి వివరాలు ఇవి..పేటీఎం ప్రవేశపెట్టిన ఈ కొత్త కార్డు సౌండ్ బాక్స్ ద్వారా మీరు గరిష్టంగా రూ. 5000 వరకూ పేమెంట్ చేయొచ్చు. మీరు కార్డును ఆ సౌండ్ బాక్స్ వద్ద ఉంచగానే ఆటోమేటిక్ గా పేమెంట్ మొదలవుతుంది. పేమెంట్ పూర్తయిన వెంటనే ఆడియో ద్వారా నోటిఫికేషన్, అలాగే ఎల్సీడీ స్క్రీన్ లో విజువల్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సౌండ్ బాక్స్ లు మన దేశంలోనే పేటీఎం తయారు చేసింది. 4జీ నెట్ వర్క్ కనెక్టివిటీతో ఇది పనిచేస్తుంది. దీనిలో బ్యాటరీ 4వాట్స్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 5 రోజుల పాటు పనిచేస్తుంది. ఈ బాక్స్ 11 భాషలను సపోర్టు చేస్తుంది. వ్యాపారులు పేటీఎం ఫర్ బిజినెస్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని దీనిని ఉపయోగించుకోవచ్చు.

*  నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లేకపోతే మరిన్ని ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48, లీటర్ డీజిల్ ధర రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ. 99.

* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. దాదాపు ఈ వారం మొత్తం సూచీలు సానుకూలంగానే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణించడం విశేషం. రూపాయి పతనం, ముడి చమురు ధరలు కలవరపెడుతున్నా సూచీలు మాత్రం ముందుకే పరుగులు తీశాయి. బ్యాంకింగ్‌, డిఫెన్స్‌, ప్రభుత్వరంగ సంస్థల షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి.ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 66,381.43 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,766.92 వద్ద గరిష్ఠాన్ని, 66,299.30 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 333.35 పాయింట్ల లాభంతో 66,598.91 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,774.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,867.15- 19,727.05 మధ్య ట్రేడైంది. చివరకు 92.90 పాయింట్లు లాభపడి 19,819.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.97 వద్ద నిలిచింది.సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, విప్రో, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

* టమాటా నుంచి వంటగ్యాస్ వరకు తగ్గిన ధరలు

టమాటా కిలో రూ.400 నుంచి రూ.30కి, వంటగ్యాస్ ధర రూ.200కి తగ్గింది. వాస్తవానికి ఆగస్టు ప్రారంభం నాటికి ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల వెన్ను విరిచింది. టమాట సహా ఇతర కూరగాయలు, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కానీ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రయత్నించింది. టమాటాలను రూ.400 నుండి 30 రూపాయలకు తీసుకువచ్చింది. వంటగ్యాస్‌ను 200 రూపాయలకు తగ్గించింది. అయితే దీని తర్వాత ద్రవ్యోల్బణం తగ్గిందా? వాస్తవానికి, కూరగాయలు, వంట గ్యాస్ ధరలు సాధారణ ప్రజల ప్లేట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. జూలైతో పోలిస్తే ఆగస్టు నెలలో థాలీ ధరలు తగ్గాయి.వెజ్ థాలీ ధర ఆగస్టులో ఏటా 24శాతం పెరిగింది. దాని పెరుగుదలలో 21శాతం టమాటాల ధరల పెరుగుదల కారణంగా ఉంది. క్రిసిల్ తన నెలవారీ ఫుడ్ ప్లేట్ ధర, రోటీ రైస్ రేటు నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది. ఈ ఏడాది 2023-24లో వెజ్ థాలీ ధర రికార్డు స్థాయిలో పెరగడం ఇది రెండోసారి. గతంలో వెజ్ థాలీ ధర జూన్‌తో పోలిస్తే జూలైలో 28 శాతం పెరిగింది. ఈ సమయంలో కూడా టమాటా కారణంగా ప్లేట్ ధరలో తేడా వచ్చింది. జూలైలో నాన్ వెజ్ థాలీ ధర 11 శాతం పెరిగింది. గతేడాది ఆగస్టులో కిలో టమాటా ధర రూ.37 ఉండగా, ఈ ఏడాది రూ.102కు పెరిగింది. క్రిసిల్ నివేదిక ప్రకారం, ఉల్లి ధర 8%, మిరపకాయ 20%, జీలకర్ర 158% పెరిగింది. నూనె ధర 17శాతం, బంగాళదుంప ధర 14శాతం తగ్గింది.క్రిసిల్ నివేదిక ప్రకారం.. జూలై-ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో థాలీ ధరలో కొంత తగ్గుదల ఉండవచ్చు. ప్రస్తుతం టమాటా ధరలు కిలో 30 నుంచి 40 రూపాయలు ఉండగా, ఇదే కాకుండా సెప్టెంబర్‌లో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర 903 రూపాయలకు తగ్గింది. ఆగస్టులో రూ.1,103గా ఉంది. ఇది ద్రవ్యోల్బణం నుండి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. తాజాగా ప్రభుత్వం వంటగ్యాస్ ధరను రూ.200 తగ్గించింది. మరోవైపు ఆగస్టులో మాంసాహారం థాలీ ధర ఏటా 13శాతం పెరిగింది. అయితే నాన్ వెజ్ థాలీ ధర మాత్రం వార్షిక ప్రాతిపదికన తక్కువగా పెరిగింది. ఏడాదిలో చికెన్ ధర 1 నుంచి 3శాతం మాత్రమే పెరిగింది. నాన్ వెజ్ థాలీ మొత్తం ఖరీదులో చికెన్ 50శాతం ఉంటుంది.