DailyDose

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-TNI నేటి నేర వార్తలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-TNI నేటి నేర వార్తలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా వడమాలపేట చెక్‌పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది మరో లారీ. దీంతో… రోడ్డుకు అడ్డంగా పడిన లారీని ఢీకొట్టింది మరో కారు.ఈ తరుణంలోనే కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత కారును ఢీకొంది మరో బైక్. దీంతో మరో ఇద్దరు మృతి చెందారు. ఇలా వరుసగా వాహనాలు ఢీ కొట్టుకోవడంతో… ఏకంగా నలుగురు మృతి చెందారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ నుంచి బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు(కావేరీ) మిర్యాలగూడ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా  టైరు పేలి బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణికులను నిద్రలేపి బస్సు నుంచి బయటకు పంపించాడు. అదే సమయంలో సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. నెల్లూరు ఏఎస్‌పేటలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు అఫ్జల్‌గంజ్‌ నుంచి 26 మంది ప్రయాణికులతో బయల్దేరగా.. మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే టైరు పేలి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫ్లైఓవర్‌ పక్కనే ఆగి ఉన్న ఉల్లిగడ్డలోడు లారీకి మంటలు  వ్యాపించి సరకు స్వల్పంగా దగ్ధమైంది. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు యాజమాన్యం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి మండల పరిధిలోని దుంపలకుంట చౌరస్తాలో రహస్యంగా ఆడుతున్న పేకాట స్థావరంపై దాడి చేయగా 8 మంది పేకాటరాయులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో రూ.1లక్షా66 వేల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు. మండలంలో ఎక్కడ పేకాట ఆడిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ జూదరులను అరెస్టు చేయకుండా మండలానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు పోలీసులపై గురువారం రాత్రి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకు వచ్చినట్లు తెలిసింది. అరెస్టు అయిన వారిలో 5 మంది ఏనగండ్ల గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం.

వాలంటీర్ల ముసుగులో కర్ణాటక మద్యం అమ్మకాలు

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఇద్దరు వాలంటీర్లు కర్ణాటక మద్యం విక్రయిస్తూ పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అంగళ్లు పాత ట్యాంకు వీధిలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్‌ ఆదేశాలపై మదనపల్లె సెబ్‌ గురువారం తనిఖీలు నిర్వహించింది. అంగళ్లు క్లస్టరు-19 వాలంటీరు అవర దాసరి సందీప్‌కుమార్‌, మరో మహిళా వాలంటీరు లేపాక్షి అమ్మాజీ,  కర్ణాటకలోని రాయల్పాడుకు చెందిన ఆర్‌.ఎస్‌.నడిపిరెడ్డిని అరెస్టు చేసింది. వీరి నుంచి ఆటోతోపాటు రూ.35 వేల విలువైన 480 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. నిందితులను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండు విధించారు. ఓ వైకాపా నాయకుడి అండదండలతోనే కర్ణాటక మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని విలాస్‌పూర్‌లో షాకింగ్ ఘటన

ఛత్తీస్‌గఢ్‌లోని విలాస్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కూరగాయల వ్యాపారి మరో వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. జబల్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారికి, రాజస్థాన్‌కు చెందిన వ్యాపారికి మధ్య కూరగాయల ఒప్పందం జరిగింది. కానీ జబల్‌పూర్ వ్యాపారికి ఆ కూరగాయ నచ్చలేదు. కాబట్టి వారి మధ్య ఒప్పందం విఫలమైంది. అదే కారణంతో ఇద్దరూ వాదించుకున్నారు. ఆ తర్వాత జబల్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి రాజస్థాన్‌కు చెందిన వ్యాపారిని హత్య చేశాడు.వివరాల్లోకి వెళితే.. విలాస్‌పూర్‌లోని తఖ్త్‌పూర్ ప్రాంతంలోని జబల్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి సనమ్ అన్సారీకి రాజస్థాన్‌కు చెందిన కూరగాయల వ్యాపారి భగవాన్ రామ్ బిష్ణోయ్ తీసుకువచ్చిన కొన్ని కూరగాయలు నచ్చలేదు. కాబట్టి వారి మధ్య కొనుగోలు ఒప్పందం విఫలమైంది. దీంతో కోపోద్రిక్తుడైన రాముడు తన ఎదుటే వ్యాపారిని దుర్భాషలాడి కొట్టాడు. ఇది జబల్పూర్ వ్యాపారికి కోపం తెప్పించి, రాముడిని చంపాలని ప్లాన్ చేశాడు. జబల్పూర్ వ్యాపారులు విలాస్పూర్ చేరుకుని రాముడిని అపహరించారు. ఆ తర్వాత గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి మరీ కొట్టి ప్రాణాలు తీశారు. మృతదేహాన్ని పారవేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే భగవాన్ రామ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరకు అతని సోదరుడు శ్రవణ్ కుమార్ సెప్టెంబర్ 3న పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన సోదరుడు భగవాన్‌రామ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 2న ఆదిత్య కృషి ఫారం నుంచి ఇంటికి వచ్చేందుకు వెళ్లాడని, ఇంతవరకు ఇంటికి రాలేదని తెలిపారు.అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా వ్యవసాయ పొలానికి కిలోమీటరు దూరంలో భగవాన్‌రామ్ చెప్పులు, బైక్ లభ్యమయ్యాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, కవార్ధా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. అతన్ని లార్డ్ విష్ణోయ్‌గా గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపి ఒకరిని జబల్‌పూర్‌కు పంపించారు. సనమ్ అన్సారీ సోదరుడు గుల్షేర్ అహ్మద్‌ను అక్కడే అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం కేసు వెలుగు చూసింది.ఈ కేసులో నిందితుడు గుల్షేర్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. అతని ఒప్పందం ప్రకారం.. అతను తన సోదరుడు సనమ్ అన్సారీ, రవాణాదారు, కూరగాయల వ్యాపారితో కలిసి బసాజల్‌కు వెళ్లాడు. అక్కడి నుండి వారు రాముడిని కిడ్నాప్ చేసి జబల్‌పూర్‌కు బయలుదేరారు. కాని దారిలో అతడిని చంపారు. ఆపై మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. ఈ కేసులో నిందితుడు సనమ్ అన్సారీని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

కర్నూలులో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లోకాయుక్త భవనంలో కానిస్టేబుల్ సత్యనారాయణ( హెచ్ సి 2451) తుపాకీతో కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. కర్నూల్‌ లో ఉన్నటు వంటి లోకాయుక్త భవనంలో బందోబస్తుగా విధినిర్వహణలో ఉండి ఆత్మహత్య చేసుకున్నారు కానిస్టేబుల్‌ సత్యనారాయణ.గత కొన్నిరోజులుగా లోకాయుక్త కు బందోబస్తుగా ఉంటున్నాడు సత్యనారాయణ. అయితే.. తాజాగా ఎస్ ఎల్ ఆర్ తో… బాత్రూమ్ లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు సత్యనారాయణ. సత్యనారాయణకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కుమార్తె చేస్తున్నది. ఇక సత్యనారాయణ ఆత్మహత్యకు కారణాలపై విచారిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

రాత్రిపూట 8 ఏళ్ల బాలికను ఓ యువకుడు అపహరించి అత్యాచారం

కేరళలో దారుణం జరిగింది. రాత్రిపూట 8 ఏళ్ల బాలికను ఓ యువకుడు అపహరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎర్నాకుళం జిల్లా అలువాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్‌ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం స్థానికంగా నివసిస్తోంది. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా.. 2 గంటల సమయంలో బాలిక బయటకు వచ్చింది. ఆ సమయంలో నిందితుడు ఆ చిన్నారిని అపహరించి సమీపంలోని వరి పొలంలోకి తీసుకెళ్లాడు. స్థానికుడు ఒకరు దీన్ని గమనించి ఇతరులను అప్రమత్తం చేసి వెతుకులాట ప్రారంభించారు. కాసేపటి తర్వాత వరిపొలం నుంచి బయటకు వచ్చిన బాలికను గుర్తించారు. చిన్నారి రహస్య అవయవాలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలికకు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు గురువారం నిందితుడి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఓ వంతెన కింద మద్యం తాగుతూ కనిపించిన అతణ్ని అరెస్టు చేశారు. నిందితుణ్ని క్రిస్టల్‌రాజ్‌(27)గా గుర్తించారు.

దళిత మహిళపై సామూహిక అత్యాచారం

 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు దురాగతానికి ఒడిగట్టారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ దళిత మహిళకు ఇద్దరు ముస్లిం యువకులు మత్తుమందు ఇచ్చి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘోరంలో బాధితురాలి స్నేహితురాలైన ఓ ముస్లిం మహిళ కూడా పాలుపంచుకుంది.బాధితురాలిని ఆమె స్నేహితురాలు ఓ హోటల్ కి రమ్మని పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను బీఫార్మ్ విద్యార్థి షోయబ్, బార్బర్ గా పనిచేస్తున్న నజీమ్ గా గుర్తించారు. ఈ మొత్తం అత్యాచార ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిందితులు, బాధిత మహిళను బ్లాక్‌మెయిల్ చేశారు.ఈ ఘటన అనంతరం చిత్రీకరించిన వీడియోను బాధితురాలి భర్తకు పంపారు. నిందితులిద్దరు కాశ్మీర్ పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటన గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన ముస్లిం స్నేహితురాలి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బును రిటన్ ఇవ్వాలని అనుకుంది. సెప్టెంబర్ 2న నిందితురాలు ఆమెను ఓ కేఫ్ కి పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ తర్వాత బాధిత మహిళను ఓ హోటల్ కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్ లో ఫైనాన్షియర్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

 హైదరాబాద్ అత్తాపూర్ సులేమాన్ నగర్ లో దారుణం వెలుగుచూసింది. తౌఫీక్ అనే ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఫైనాన్షియర్ వేధింపులతో యువకుడు మృతి చెందాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికి తోడు యువకుడిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి రౌడీషీటర్లతో దాడి చేయించాడు. దీంతో వేధింపులు భరించలేక యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుద్వేల్ వద్ద డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.అయితే నలుగురు విద్యార్థులు కూడా వ్యాలిడ్ లైసెన్స్ యాప్‌లో కారు అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. కాలేజీకి వెళ్లకుండా కారులో షికారుకు వెళ్లినట్లు సమాచారం. కారును అతివేగంగా నడిపి డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు కారు నడిపిన విద్యార్థికి లైసెన్స్ కూడా లేనట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ వారికి కారు అద్దెకు ఇవ్వడపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాలిడ్ లైసెన్స్ యాప్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.