Politics

నేడే ఏడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు-TNI నేటి తాజా వార్తలు

నేడే ఏడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు-TNI నేటి తాజా వార్తలు

నేడే ఏడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు

దేశంలోని ఈ వారం ప్రారంభంలో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, త్రిపుర రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇదిలా ఉండగా.. ఘోసీ, డుమ్రిలలో.. విపక్ష పార్టీలు కొత్తగా ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో భాగంగా తమ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాయి. అయితే ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు తమ బలాన్ని పరిక్షించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏడు స్థానాల్లో మూడు బీజేపీ, అలాగే సీపీఐ, జెఎంఎం, కాంగ్రెస్, ఎస్పీ చేతిలో ఒక్కొక్కటి ఉన్నాయి.అయితే బీజేపీలోకి తిరిగి చేరిన ఎస్పీ ఎమ్మెల్యే.. ఓబీసీ నేత దారా సింగ్ చౌహన్ రాజీనామా చేయడంతో యూపీలోని ఘోసీ స్థానం ఖాళీ అయిపోయింది. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం.. 130 పోలింగ్ సిబ్బందితో దాదాపు 14 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుందని.. జిల్లా మేజిస్ట్రేట్ అనురాధ పాల్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎమ్మెల్యే, మంత్రి చందన్ రామ్ దాస్ మరణించడంతో బాగేశ్వర్ నియోజకవర్గంలో స్థానం ఖాళీ అయింది. అయితే 2007 నుంచి ఇప్పటివరకు ఆయన ఏకంగా 4 సార్లు గెలిచారు. ఇక జార్ఖండ్‌లోని.. డుమ్రీ అసెంబ్లీ ఉపఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని గిరిదిహ్ జిల్లాలోని పంచంభ, కృషి బజార్ సమితో ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ఇక్కడ 24 రౌండ్ల కౌంటింగ్ జరగనుందని.. 70 మంది అధికారులను ఈ కసరత్తు కోసం నియమించామని చెప్పారు.ఇక సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్.. జార్ఖండ్ పోలీసుల వివిధ విభాగాలు స్వేచ్ఛగా ఓట్ల లెక్కింపు జరిగేలా చూసుకునేందుకు మోహరింపబడ్డాయని అన్నారు. ఇక్కడ 2.98 లక్షల మందిలో 2.98 లక్షల మంది ఓటర్లలో దాదాపు 65 శాతం మంది ఓట్లు వేసినట్లు చెప్పారు. ఇక త్రిపురలో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే సోనామురా బాలికల హెచ్‌ఎస్ పాఠశాలలో బోక్సానగర్, ధన్‌పూర్ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సెపాహిజాలా జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ అన్నారు. అయితే అక్కడి నుంచి సీపీఐ అభ్యర్థి మిజాన్ హుస్సెన్‌పై బీజేపీ తఫజ్జల్ హుస్సేన్‌ను బరిలోకి దింపింది. అయితే ఈ ఓటింగ్ సందర్భంగా రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ సీపీఐ కౌంటింగ్‌ను బహిష్కరించింది. అయితే ఈ ఏడు స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారనే దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

* ఏపీలో సెప్టెంబర్ 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేరపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గురువారం రోజున మంగళగిరిలో రజనీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు నెలరోజుల పాటు చేపట్టిన కార్యాచరణను మంత్రి విడదల రజినీ వివరించారు. వివరాలు.. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి వారి సంబంధిత అధికార పరిధిలోని ఇళ్లను సందర్శిస్తారు. వారి నుంచి సేకరించిన వివరాలను ఏఎన్‌ఎంలు, క్లస్టర్ ఆరోగ్య అధికారులను అందజేస్తాను. ఆ తర్వాత సంబంధిత ఇళ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శించి వ్యాధుల వివరాలను నమోదు చేస్తారు. బీపీ, బ్లడ్ షుగర్, ఇతర పరీక్షలను కూడా నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన రికార్డును నిర్వహిస్తారు.ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నెంబర్లు ఇస్తారు. ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజు ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్‌ క్లినిక్‌తో పాటు, ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ఒక్కో శిబిరానికి ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులను అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే రోగులను ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు.

కాసేపట్లో డిజిపి ఆఫీసుకు కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు ప్రాంతమైన తుక్కుగూడలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. ఈ సభకి ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు ఒకే సభ పై ప్రత్యక్షం కానున్నారు. సుమారు పది లక్షల మంది కాంగ్రెస్ నేతలు ఈ మీటింగ్ కి హాజరుకానున్నారు.ఈ సభలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రకటించనున్నట్లు టిపిసిసి తెలిపింది. దీంతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ (సిడబ్ల్యూసి) తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించనున్నారు. ఇందుకు సిడబ్ల్యుసి సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సీఎల్పీలు, పార్టీ అధ్యక్షులు, జాతీయస్థాయిలో కీలక నేతలు అందరూ హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం డిజిపి కార్యాలయానికి బయలుదేరారు. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై డిజిపి అంజనీ కుమార్ తో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు ముఖ్య నేతలు బయలుదేరారు.

17న కాంగ్రెస్‌లోకి తుమ్మల

బీఆర్ఎస్ తొలి జాబితాలో చోటు దక్కలేదని ఖమ్మం కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల కారు పార్టీ దిగనున్న విషయం తెలిసిందే. అయితే తుమ్మలు ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే తుమ్మల పాలేరు టికెట్ ఖచ్చితంగా కావాలని పట్టు పట్టినట్లు తెలిసింది. అయితే తుమ్మల ప్రతిపాదనకు కాంగ్రెస్ ఏం హామీ ఇచ్చిందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో వైపు సోనియా సభను టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పది లక్షల మందితో సభను భారీ స్థాయిలో నిర్వహించి టీ కాంగ్రెస్ కు పునర్వైభవం తేవాలని భావిస్తోంది. ఇక ఇదే సభలో బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది. మైనంపల్లి మల్కాజిగిరి, మెదక్ సీట్లు ఆశిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ షార్ట్ సర్క్యూట్

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ టాపిక్ మళ్లీ తెరమీదకొచ్చేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తోంది. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా చీకటిమయం అవుతుందన్న కిరణ్‌కుమార్‌రెడ్డి మాటల్ని గుర్తు చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారని.. ఇప్పుడా పరిస్థితి ఏపీలో ఉందని రివర్స్ కౌంటరిచ్చారు. బాబు, కిరణ్‌ వ్యాఖ్యల్నిగుర్తు చేసిన ఎర్రబెల్లి.. అప్పట్లో ఎగతాళి చేసినవాళ్లే నోరెళ్లబెట్టేశారన్నారు. ఇప్పుడు తెలంగాణ రూపు మారిందని.. ఏపీలోనే కరెంట్ కోతలు ఎక్కువంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.తొర్రూరు లయన్స్ క్లబ్ – వాసవి క్లబ్ అధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ, పాత్రికేయ దినోత్సవాల్లో పాల్గొన్నారు ఎర్రబెల్లి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండురాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. ఇటు… మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా ఉచిత కరెంట్ సబ్జెక్ట్‌ని తిరగదోడేశారు. తెలంగాణాలో 24 గంటల ఫ్రీపవర్ ఇస్తున్నారని రుజువు చేయగలరా అని బీఆర్‌ఎస్‌కి బహిరంగ సవాల్ విసిరారు ఈటల. ఉచిత కరెంట్‌పై చర్చకు రావాలని, ఒకవేళ రాకపోతే తప్పుడు ప్రచారం మానుకోవాలని అధికార పార్టీపై ఎటాక్ చేశారు ఈటల. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలేంజ్‌ చేశారు ఈటల రాజేందర్. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ మరోసారి ఉచిత కరెంట్ అంశాన్ని లేవనెత్తడాన్ని నిశితంగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. మరోవైపు రైతుల సమస్యలపై కేసీఆర్‌ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ కేసీఆర్ హామీలను ఎండగట్టారు. అనగనగా ఓ కేసీఆర్ అంటూ మొదలుపెట్టి కథలు కంచికి- కేసీఆర్ ఫాంహౌస్ కి అంటూ ముగించారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. 150 ఎకరాల్లో వేశారని ఎద్దేవా చేశారు. రైతులకు ఫ్రీ ఎరువులు అని.. వారిని గంటల తరబడి క్యూలో నిలబెట్టాడని విమర్శించారు. 24 గంటల కరెంట్ అన్నారు… లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు లేదని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి.

తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు

మునుపెన్నడూ లేనంతగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావడం.. వాటికి తుపాన్లు తోడు కావడం.. వర్షాలు ఆలస్యం కావడం..  ఆ వెంటనే కుంభవృష్టి వర్షాలు.. అన్‌సీజన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు.. మళ్లీ కుండపోత వానలు.. ఇలా వాతావరణం గందరగోళంగా తయారయ్యింది.  తెలుగు రాష్ట్రాలపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.   వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. అయితే ఇవాళ, రేపు తెలంగాణలో విస్తారంగా.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.   శుక్ర, శనివారాల్లో తెలంగాణ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం చేసింది. అలాగే.. మూడు నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

 కాంగ్రెస్ గూటికి మైనంపల్లి

బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత మైనంపళ్లి హనుమంతరావు కాంగ్రెస్ గూటికి వెళ్లడానికి రెడీ అయ్యారా? సెప్టెంబర్ 17న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొనున్న సభలో మైనంపల్లి కాంగ్రెస్ లో చేరనున్నారా? పోలిటికల్ వర్గాల సమాచారం ప్రకారం..మైనంపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైందని తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటు బి‌జే‌పి నుంచి సస్పెండ్ అయిన యెన్నం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ వైపు వస్తున్నట్లు తెలిసింది.అయితే ఇక్కడ బి‌ఆర్‌ఎస్ లో సీటు ఫిక్స్ అయిన మైనంపల్లి కాంగ్రెస్ లోకి వస్తున్నారా? అనేది పెద్ద చర్చ. ఎలాగో తుమ్మలకు సీటు దక్కలేదు కాబట్టి..ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. కానీ మల్కాజిగిరి సీటు మైనంపల్లికి కే‌సి‌ఆర్ ఫిక్స్ చేశారు. కాకపోతే ఆయన..హరీష్ రావుని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తన తనయుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ సీటు అడిగిన విషయం తెలిసిందే. ఇక హరీష్ పై విమర్శలు చేయడంతో మైనంపల్లిపై కే‌సి‌ఆర్ గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.కానీ ఇంతవరకు సీటు క్యాన్సిల్ చేయలేదు. దీంతో మైనంపల్లిని బి‌ఆర్‌ఎస్ లో కొనసాగించాలని చూస్తున్నారా? అనే డౌట్ ఉంది. కాకపోతే మైనంపల్లి మాత్రం పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా రాజకీయం చేసుకుంటున్నారు. అలాగే తన తనయుడు సీటు కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గాని తనతో పాటు, తన తనయుడుకు సీటు ఇస్తే అందులో చేరడానికి రెడీ అవుతారని తెలుస్తోంది.కానీ ఇద్దరికి సీట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ఆలోచనలో పడినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఇటు మల్కాజిగిరి, అటు మెదక్ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కొందరు కీలక నేత దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని కాదని మైనంపల్లికి సీట్లు ఇవ్వడం అనేది కష్టమైన టాస్క్. చూడాలి మరి మైనంపల్లి రాజకీయ పయనం ఎటు వైపు ఉంటుందో.

హోంగార్డ్ రవీందర్ ను కేసీఆర్ సర్కారే చంపేసింది

 హోంగార్డ్ రవీందర్ ను కేసీఆర్ ప్రభుత్వమే హత్య చేసిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ముమ్మాటికీ హోంగార్డ్ చావుకు బాధ్యత వహించాల్సింది కేసీఆర్ సర్కారే… పోలీసులు బిఆర్ఎస్ ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేసారు. నిజాయితీగా పనిచేస తన భర్తను కొందరు పోలీసులు వేధించారని… చంపింది కూడా వారేనని హోంగార్డ్ రవీందర్ భార్య ఆరోపిస్తున్నారు. ఆమె అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై వుందన్నారు. కాబట్టి వెంటనే రవీందర్ ఘటన సమయంలోని గోషామహల్ కమాండెంట్ హోంగార్డు కార్యాలయం వద్ద ఏం జరిగిందో బయటపెట్టాలని అన్నారు. అక్కడ సిసి ఫుటేజీ బయటపెట్టాలని సంజయ్ కోరారు. ఇక రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేసారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన రవీందర్ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని సంజయ్ సూచించారు.హోంగార్డ్ మరణం అత్యంత విషాదకరమని సంజయ్ అన్నారు. ప్రభుత్వం హోంగార్డులకు సకాలంలో జీతాలు ఇచ్చివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఇకనైనా హోంగార్డులపై చిన్నచూపు చూడకుండా తగు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు బండి సంజయ్. ఇక హోంగార్డ్ మ‌ృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేసారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న కిషర్ రెడ్డి బాధలోవున్న అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. హోంగార్డులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరుతో ఆందోళనకు గురయి హోంగార్డులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హోంగార్డులకు సూచించారు. ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాదన్నారు. పోరాటం ద్వారా దక్కాల్సిన హక్కులను సాధించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.  

రాయలసీమకు హైకోర్టు అక్కర్లేదట

బాగా అభివృద్ది చెంది.. రాజధానికి అన్ని విధాలా అనువైన నగరంగా అందరూ ఒప్పుకునే విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు చంద్రబాబు. అక్కడ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజలే అంటున్నారంటూ బుకాయిస్తున్నారు చంద్రబాబు. ఇటు రాయలసీమకు హైకోర్టు అవసరం లేదంటూ ఈ ప్రాంతంపైనా విషం చిమ్ముతున్నారు. తాను తన బంధువులు.. తన ఎల్లో మీడియా అధినేతలు.. టీడీపీ సీనియర్లు వారి బంధువులు భూములు కొని అట్టేపెట్టుకున్న అమరావతిలో మాత్రం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా సరే లక్షన్నర కోట్లకు పైగా ఖర్చే చేసేయాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు.ఏ అమరావతి జపం చేస్తున్నారో అదే అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం ముసుగులోనే  వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అడ్డంగా భోంచేసిన వైనాన్ని ఐటీ శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తాను జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు నాయుడికి అర్ధమైపోయింది. తాను చేసిన తప్పేంటో తనకి తెలుసు. ఆ తప్పుకు శిక్ష ఏం పడుతుందో కూడా బాబుకు తెలుసు. అందుకే  తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఆయన కంగారు పడుతున్నారు. ఈ ఉక్రోషంలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ చాలునని విషం కక్కుతున్నారని రాయలసీమకు చెందిన న్యాయవాదులు అంటున్నారు.

నల్గొండ ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి రెడీ:కోమటి రెడ్డి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హోం గార్డు మృతిపై స్పందించారు ఎంపీ కోమటిరెడ్డి. హోమ్ గార్డ్ రవీందర్ మరణించడం చాలా దురదష్టకరం అని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో ఎక్కడైనా వ్యవసాయానికి 15 గంటల కరెంట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావుకి సవాల్ చేస్తున్నా అన్నారు ఎంపీ కోమటిరెడ్డి.తనకు కాంగ్రెస్ పార్టీ పై ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ కెసిఆర్ ప్రభుత్వం పై ఉంది అని తెలిపారు. ఈ 17న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కెసిఆర్ నీ ఇంటికి పంపేందుకు కొంగర కొలాన్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని.. కర్ణాటక తరహాలో తెలంగాణలోను సోనియా గాంధీ ప్రకటన చేస్తారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ చెప్పాడు. నేడు బిఆర్ఎస్ ఇచ్చే 4వేల పెన్షన్ కాంగ్రెస్ హయాంలో 400లతొ సమానం అన్నారు. పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుంది అన్నారు. ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కెసిఆర్ ఎదుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.  మరోవైపు సామాజిక సమీకరణాలలో బాగంగా అవసరం అయితే నేను నల్గొండ ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి రెడీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

 హోంగార్డు రవీందర్ మృతిపై కిషన్ రెడ్డి విచారం

హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్.. చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే అని మండిపడ్డారు. హోంగార్డులకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా.. వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డులు తొందరపడొద్దని.. ఆత్మహత్యలే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదని విజ్ఞప్తి చేశారు. పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకొవద్దని సూచించారు.హోంగార్డు రవీందర్ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే.. హోంగార్డు రవీందర్ ను కలిసి పరామర్శించేందుకు నిన్న మధ్నాహ్నం ఆసుపత్రికి వెళ్లి, రవీందర్ ను కుటుంబ సభ్యులను పరామర్శించారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వాళ్ళ ఆరోగ్యానికి భద్రత ఇవ్వాలి.. హోంగార్డ్ లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన చూడండి అంటూ వీడియో ప్లే చేసిన కిషన్ రెడ్డి.. ఐదున్నర సంవత్సరాలు గడిచినా.. సీఎం వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు అని ఆయన మండిపడ్డారు. హోంగార్డులకు కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే.. హోంగార్డ్ ల అన్ని సమస్యలు పరిష్కరిస్తాము అని ఆయన హామీ ఇచ్చారు.