Politics

సుప్రీంకు తెదేపా. తెలంగాణాకు మూడో వందేభారత్-తాజావార్తలు

సుప్రీంకు తెదేపా. తెలంగాణాకు మూడో వందేభారత్-తాజావార్తలు

* ఇంటర్‌ అర్హతతో పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనుకొనే వారికి అలర్ట్‌. దిల్లీ పోలీసు విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 7,547 కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 1 నుంచి మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌లో https://ssc.nic.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. డిసెంబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

* చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు (Women’s Reservation Bill)కు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇది సాధారణ చట్టం కాదని.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బలమైన ప్రభుత్వం ఆవశ్యకతను చాటిచెప్పిన ప్రధాని.. దీని ద్వారానే ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న బిల్లు ఆమోదం పొందిందన్నారు. ఈ నేపథ్యంలో ‘భాజపా మహిళా మోర్చా’ సత్కార కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహిళా నేతలకు వినమ్రంగా నమస్కరించారు.

* మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (కాచిగూడ – బెంగళూరు) రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బయలుదేరి బెంగళూరుకు (610 కి.మీ. దూరం) 8.30 గంటల్లోనే చేరుకోనుంది.

* ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. న్యాయపోరాటం దృష్ట్యా మరి కొన్ని రోజులు దిల్లీలోనే ఉండాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్ణయించారు. ఎప్పటికప్పుడు న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్నారు. లోకేశ్‌ శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రావాలనుకున్నప్పటికీ .. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ తిరస్కరణతో పరిణామాలు మారాయి. మరో వైపు చంద్రబాబు రిమాండ్‌ను ఈనెల 24 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు, రెండ్రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పు, సీఐడీ కస్టడీ తదితర అంశాలపై న్యాయవాది లక్ష్మీనారాయణ.. చంద్రబాబుతో చర్చించారు.

* లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ పార్టీ(JDS Party) భాజపా (BJP)సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. భాజపా అగ్రనేతలు అమిత్‌ షా(Amit shah), జేపీ నడ్డా(JP Nadda)తో భేటీ అనంతరం జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ కీలక భేటీ సమయంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ తాజా పరిణామంతో కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ మధ్య పొత్తు పొడుపులపై గత కొన్నాళ్లుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే, కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

* రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నరేంద్రమోదీ ఫొటో ఎగ్జిబిషన్‌ను పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మద్యం ద్వారా వైకాపా నాయకులు జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. నరసాపురంలో గురువారం మద్యం దుకాణాన్ని తనిఖీ చేసినప్పుడు నగదు లావాదేవీల్లో అక్రమాలు వెలుగు చూశాయన్నారు. మధ్యాహ్నం సమయానికి రూ.లక్షల వరకు విక్రయాలు జరిగితే అందులో డిజిటల్‌ చెల్లింపులు జరిపింది కేవలం రూ.700 మాత్రమేనన్న విషయం బయటపడిందన్నారు. ప్రతి రోజు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా వైకాపా నాయకుల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజల జేబుల నుంచి డబ్బులు దోచుకుని ఉచితాలు ఇస్తున్నామనే దిశగా మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థనీయం కాదన్నారు.

* విజయవాడ వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University) ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ యూనివర్సిటీ వీసీకి మెమొరాండం ఇవ్వటానికి వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పార్డీ నాయకులను యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ మెమొరాండం ఇవ్వడానికి వచ్చిన తమపై పోలీసు ఆంక్షలు ఏంటంటూ రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి బస్సులో పడేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు ఇది నిదర్శనమని, బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నిర్బంధాలు కొత్తేమీ కాదని రుద్రరాజు తెలిపారు. రెచ్చగొట్టడం మానుకోవాలని పోలీసులకు ఆయన హితవు పలికారు. ఆందోళన తర్వాత కాంగ్రెస్ నాయకులు వీసీకి వినతిపత్రం సమర్పించారు.

* మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ వర్గీయులు అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అయితే అందులో శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన నవాబ్‌ మాలిక్ సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లను మినహాయించడం గమనార్హం. అజిత్ పవార్‌ (Ajit Pawar) వర్గానికి మద్దతుగా ఉన్న దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గతంలోనే శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గం కోరింది.

* భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ సమక్షంలో భాజపా నేత వెంకట్‌రెడ్డి దంపతులు శుక్రవారం భారాసలో చేరారు. భారతీయ జనతాపార్టీ గద్వాల్‌ జిల్లా ఇన్‌ఛార్జి వెంకటరెడ్డి, ఆయన సతీమణి బాగ్‌ అంబర్‌పేట్‌ డివిజన్‌ కొర్పొరేటర్‌ పద్మా వెంకట్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. భాజపాకు రాజీనామా చేసిన అనంతరం భారాసలో చేరినట్టు ఈ సందర్భంగా వారు ప్రకటించారు ‘‘గత 40 ఏళ్లుగా పార్టీకి సేవలందించా. ఆ ఉద్దేశంతోనే అంబర్‌పేట అసెంబ్లీ టికెట్‌ ఆశించా.. కానీ, పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేశారు. ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా ఇప్పటికీ అవకాశం రాకపోతే ఎలా? కిషన్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నిస్తే సమయం ఇవ్వడం లేదు. మీరు పోటీ చేయకుంటే నేను పోటీ చేస్తానని కిషన్‌రెడ్డిని స్పష్టంగా అడిగితే పార్టీ నిర్ణయిస్తుందని దాటవేశారు’’ అ ని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

* తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్‌లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జార్ఖండ్‌ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం చత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది.

* భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం భారత్‌-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతం మేర పెరిగాయని తెలిపాయి. గురువారం భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో దిల్లీ నుంచి టొరంటో విమాన టికెట్‌ బుకింగ్స్‌కు చివరి నిమిషంలో డిమాండ్ పెరిగిందని వెల్లడించాయి.

* కోర్టులకు హాజరుకాకుండా పారిపోయిన వ్యక్తి జగన్‌ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. రాజమహేంద్రవరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ‘‘చంద్రబాబు అరెస్ట్‌తో జగన్‌ తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారు. ఆయన బయటకు వచ్చాక యుద్ధమే.’’ అని పట్టాభి వ్యాఖ్యానించారు.

* చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడలకు (Asian Games) సంబంధించి భారత్‌కు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతోందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అథ్లెట్లకు వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ను నిరాకరించినట్లు తెలిసింది. దీనిపై తాజాగా భారత్‌ ప్రతిస్పందించింది. క్రీడాకారులను అడ్డుకునేందుకు చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు దిగిందని పేర్కొంటూ అధికారికంగా నిరసన తెలియజేసింది. అంతేకాకుండా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చైనా పర్యటన కూడా రద్దు చేసుకుంటున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది.

* చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women reservation bill)ను ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, జనగణన (Census), డీలిమిటేషన్‌ (Delimitation) తర్వాతే దీనిని అమల్లోకి తెస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు మంచిదే.. కానీ, జనగణన, డీలిమిటేషన్‌కు ఏళ్ల సమయం పడుతుందన్నారు. ఈ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

* రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యం పొందాలంటే భారత్‌, ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్‌ రామస్వామి చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్‌ ఓ కథనంలో పేర్కొంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఆయన నాలుగు అంశాలతో ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించింది.