Politics

సామర్లకోటలో 12న జగన్‌ పర్యటన

సామర్లకోటలో 12న జగన్‌ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభం కాకినాడ జిల్లా లో జరుగనుంది. అయితే, తాజాగా సామర్లకోటలో ఈటీసీ లే అవుట్‌లో పేదలకు నిర్మించిన గృహాలను సామూహికంగా ప్రారంభించేందుకు, పైలాన్‌ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబరు 12వ తారీఖున వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారికంగా సీఎం పర్యటన ఖరారు అయింది. ఇప్పటి వరకూ మూడు దఫాలు సామర్లకోటకు సీఎం పర్యటన ఉందంటూ ప్రచారం జరిగింది. గత 50 రోజులుగా సీఎం పర్యటనకు సామర్లకోటలోనే జిల్లా అధికార యంత్రాంగం ఉండి షేర్‌వాల్‌ టెక్నాలజీతో గృహాలను నిర్మించే పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా సామూహిక గృహ ప్రవేశాలతో పాటు సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం జగన్ పర్యటన తేదీ ఖరారు కావడంతో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తు్న్నారు. సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సామర్లకోట అర్బన్ లబ్దిదారులకు కేటాయించిన ఈటీసీ లేవుట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు లేఅవుట్ లో పూర్తైన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, రహదారులు, డ్రైయిన్లు, కరెంట్, తాగునీరు తదితర అంశాలపై గృహా నిర్మాణ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ ఇతర శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం సమీపంలోని కళాశాలలో హెలిప్యా్డ్ తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద బడుగు బలహీన వర్గాల వారికి 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాలు అందించనున్నారు.