Editorials

మార్గశిర విశిష్టత ఇది!

మార్గశిర విశిష్టత ఇది!

మాసాలలోకెల్లా ప్రముఖం -మార్గశిరం!
మార్గశిర మాసం అనగానే శ్రీకృష్ణుడు ఈ మాసం గురించి గీతలో చెప్పిన మాట గుర్తుకువస్తుంది. తాను మాసాలలో మార్గశిరమాసం వంటి వాడిని అంటాడు శ్రీకృష్ణుడు. మార్గశిర మాసానికి నిజంగానే అంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పౌర్ణమినాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికే మార్గశిరమని పేరు. మార్గశిర మాసానికే మార్గశీర్షం అన్న రూపాంతరాన్ని కూడా కల్పించారు. మార్గంలోనే తొలిభాగం అని దీని అర్థం. నిజంగానే భక్తి మార్గంలో దీనిది తొలిభాగమే. సాధారణంగా ఈ నెలలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు. వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన సందర్భం. వైష్ణవాలయాలను దర్శించేందుకు, నారాయణుడిని అర్చించుకునేందుకు… వారు ఈ మాసంలో ప్రాధాన్యతని ఇస్తారు. తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదువుతారు.

మార్గశిర, పుష్యమాసాలను కలిపి హేమంత రుతువు అంటారు. ఈ కాలంలో చలి అధికంగా ఉండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పంటలు కోతకి చేరుకునే కాలం కావడంతో పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ఆలయాలను సందర్శించేందుకు అత్యంత అనువైన కాలం ఇది. మార్గశిరమాసానికి ‘అగ్రహాయనము’ అన్న పేరు కూడా ఉంది. అంటే తొలి మాసం అన్న అర్థం స్ఫురిస్తుంది. పూర్వం మన సంవత్సరం ఈ మాసంతోనే ప్రారంభమయ్యేదట! చంద్రుని ప్రభావం ఈ మాసంలో అధికంగా ఉంటుందని చెబుతారు. చంద్రుడు మనఃకారకుడు. అందుకని అతను కలిగించే చిరాకుపరాకులను తప్పించుకోవడానికి భగవన్నామస్మరణ ఉపయోగపడగా, ఆయన కలిగించే సృజన శక్తిని అందుకునేందుకు ధ్యానం తోడ్పడుతుంది. బహుశా అందుకేనేమో ఈ కాలంలో ఏ పని చేసినా ఉత్తమమైన ఫలితం దక్కుతుందని చెబుతారు.

కార్తీక మాసంలాగానే మార్గశిర మాసంలో కూడా ప్రతిరోజూ ఒక పండుగే. ఈ నెలలోని మొదటిరోజైన శుద్ధ పాడ్యమినాడు గంగాస్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. బహుశా పుణ్యక్షేత్ర తీర్థాలను దర్శించేందుకు భక్తులను ప్రోత్సహించేలా ఈ విధిని కల్పించి ఉంటారు. ఇక నక్త చతుర్ధి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్రసప్తమి, కాళభైరవాష్టమి… ఇలా ఒకో తిథినీ దాటుకుంటూ ఏకాదశిని చేరుకోగానే మార్గశిర ప్రాముఖ్యత పతాకస్థాయిని చేరుకుంటుంది. ఒకవేళ అదే సమయంలో ధనుర్మాసం ప్రవేశించి ఉంటే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి పేరుతో అంగరంగవైభవంగా జరుపుకొంటారు. కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. హనుమద్వత్రం, గురువార లక్ష్మి వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు. ఇంతటి మార్గశిర మాసం ఈవేళతో ప్రారంభమవుతోంది… శుభం!

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z