DailyDose

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు

తెలంగాణలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 350 కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తికి మద్దతు ధర రూ.7,020గా ఉన్నది. ఈ ధర దక్కాలంటే పత్తిలో తేమ 8% మాత్రమే ఉండాలి. కానీ, 16-17% తేమ ఉన్నప్పటికీ ప్రైవేట్‌ వ్యాపారులు రూ.6,800 నుంచి రూ.7 వేలకు కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రకారంగా చూస్తే సాధారణ తేమ శాతం వద్ద క్వింటా పత్తి రూ.7,300 వరకు ధర పలుకుతున్నట్టే.ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పత్తి రాక మొదలైంది. మరో 10-15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కోతకు వస్తుంది. దీంతో మార్కెట్లో ధర పడిపోయే అవకాశం ఉన్నదని వ్యాపారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు నష్టం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ముందుగానే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్టు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తెలిపారు. ఒకవేళ బయట మార్కెట్‌ పడిపోతే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. దీంతో దాదాపు 40 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z