NRI-NRT

న్యూయార్క్‌ గురుద్వారా‌లో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీలు

న్యూయార్క్‌ గురుద్వారా‌లో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీలు

అమెరికాలో ఖలిస్థానీ సానుభూతిపరులు మరోసారి రెచ్చిపోయారు. భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు (Taranjit Singh Sandhu)ను  న్యూయార్క్‌లోని గురుద్వారాలో అడ్డుకున్నారు. గురునానక్‌ జయంతి సందర్భంగా న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌లో ఉన్న హిక్స్‌విల్లే గురుద్వారాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం, ఆయన్ను ఖలిస్థానీ సానుభూతిపరులు చుట్టుముట్టారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందని ఆరోపించారు. దాంతోపాటు సిఖ్స్ ఫర్‌ జస్టిస్‌ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ.. ఆయన్ను చుట్టుముట్టి నిరసన తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనతో తరణ్‌జిత్‌ కార్యక్రమం మధ్యలోనే అక్కుణ్నుంచి వెళ్లిపోయారు.

గతంలో కూడా ఖలిస్థానీ సానుభూతిపరులు బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామిని గ్లాస్గోలోని గురుద్వారాలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రక్తతలు తలెత్తాయి. ఈ క్రమంలో విదేశాల్లోని భాతర దౌత్య కార్యాలయాలపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడులకు పాల్పడుతున్నారు.

కొద్దిరోజుల క్రితం గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ పశ్చిమ దేశాల పత్రికలు కథనాలు వెలువరించాయి. ఆ కుట్రను తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం వెల్లడించినట్లు వాటిల్లో తెలిపాయి. దీనిపై భారత విదేశాంగశాఖ పరోక్షంగా స్పందించింది. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ సానుభూతిపరులు తరణ్‌జిత్‌ సింగ్‌ను అడ్డుకోవడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z