DailyDose

ముగిసిన ఎన్నికల పోలింగ్‌ సమయం-తాజా వార్తలు

ముగిసిన ఎన్నికల పోలింగ్‌ సమయం-తాజా వార్తలు

* ముగిసిన ఎన్నికల పోలింగ్‌ సమయం

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం ముగిసింది. వాటి తుది ఫలితాలు వెలువడేలోపు మధ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Poll) అంచనాలు అందరిలో ఆసక్తి కలిగిస్తాయి. ఓటింగ్‌కు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌పై ఇదివరకు విధించిన నిషేధాన్ని తాజాగా ఎన్నికల సంఘం సవరించింది. సాయంత్రం 5.30గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించవచ్చని తెలిపింది. తొలుత నవంబర్‌ ఏడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సమయంలో మార్పులు చేసింది. (Exit Poll Predictions)ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నవంబర్ ఏడు నుంచి విడతలవారీగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయింది. తెలంగాణలో కూడా నేటి సాయంత్రంతో పోలింగ్‌ పూర్తి కానుంది. దాంతో ఈ ఐదు రాష్ట్రాల నుంచి ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు(Exit Poll Predictions) రానున్నాయి.

* తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌

తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో (13 constitutions) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (TS Assembly Elections ) ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్‌ ముగిసింది. చెన్నూర్‌, బెల్లంపల్లి, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగనుంది. అయితే, సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌కు అధికారులు అనుమతించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో 69.33 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది.

* ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్‌ సమర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా ఆయన నంద్యాల జిల్లాలో పర్యటించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు.ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ పుణ్యక్షేత్రం కడప అమీన్‌పీర్‌ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగోరోజు బుధవారం దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.రాత్రి ముషాయిరా హాలులో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరీ నిర్వహించారు. గాయకులు ఒకరినొకరు పోటీలు పడి మహా ప్రవక్త గుణగణాల గురించి గానం చేస్తుండగా భక్తులు తన్మయులై ఆలకించారు. దర్గా ప్రాంగణం రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోతోంది. స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

* కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. మంటల్లో కాలి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. (Charred bodies) మరో 27 మంది కార్మికులకు కాలిన గాయాలయ్యాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. ఏథర్ ఇండస్ట్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున కెమికల్‌ స్టోరేజీ ట్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు అదృశ్యమయ్యారు.కాగా, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అదృశ్యమైన కార్మికుల కోసం గురువారం వెతికారు. ఈ నేపథ్యంలో ఏడుగురు కార్మికులు కాలి బూడిదిగా మారినట్లు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు, ఫైర్‌ అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల్లో ఒకరు, 1.3 మిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అశ్విన్ దేశాయ్‌కు చెందిన కంపెనీగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

* శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఆందోళన

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎన్‌ఐటీ అధికారులు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. డిసెంబరు 20లోగా పరీక్షలు ఉన్నప్పటికీ.. రెండు వర్గాల విద్యార్థుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఎన్‌ఐటీ యంత్రాంగం హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారు. హఠాత్తుగా హాస్టళ్లు ఖాళీ చేయమనడంతో ఇక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 300 మంది తెలుగు విద్యార్థులు ఎన్‌ఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. శ్రీనగర్‌ నుంచి అత్యవసరంగా ప్రయాణం చేసేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.

* తమ్మినేని వీరభద్రంకు ఊహించని షాక్

ఓటు వేసేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఊహించని షాక్ తగిలింది. ఓటరు ఐడీలో తప్పుల కారణంగా తమ్మినేని ఓటు వేయలేకపోయారు. అయితే తమ్మినేని ఈ సారి ఎన్నికల్లో పాలేరు నుంచి సీపీఎం తరఫున బరిలో ఉన్నారు. ఇటీవలే తమ్మినేని హైదరాబాద్ నుంచి తన ఓటును సొంతూరు తెల్దారుపల్లికి మార్చుకున్నారు. ఓటరు ఐడీలో తప్పుల కారణంగా ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z