Politics

టీడీపీ -జనసేన పొత్తు తేలిందా!

టీడీపీ -జనసేన పొత్తు తేలిందా!

ఇంఛార్జ్‌ల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయిందని.. ఒక ముఠాగా మారిందని విమర్శించారు. ప్రజలకు ఏం చెప్పామో అదే చేస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు బాధ్యతగానే పని చేశామన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల మద్దతు పొందాలని సీఎం చెప్పారని ఆయన అన్నారు. సిట్టింగ్‌ల మార్పులు అనేది ఎన్నికలు ముందు జరిగే సాధారణ ప్రక్రియ అని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సజ్జల స్పష్టం చేశారు. నోటిఫికేషన్ కోసం మేము ఎదురు చూడడం లేదన్నారు.

టీడీపీ, జనసేన కోఆర్డినేషన్ సమావేశాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు. ఒక మీటింగ్ పెట్టుకున్న వెంటనే పార్టీలు కొట్టుకున్నారని ఆయన తెలిపారు. పరీక్షలకు పూర్తి స్థాయిలో చదివిన విద్యార్థుల్లా మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. జైల్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని రోగాలు అన్ని ఉన్నాయి అన్నారని.. ఇప్పుడు రొమ్ము విరుచుకుని దేశం అంతా తిరుగుతాను అంటున్నారని.. చంద్రబాబును ఉద్దేశించి సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం హడావిడి చేసిన భార్య, కోడలు ఎక్కడ ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ -జనసేన పొత్తు తేలిందా.. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు కోసం చనిపోయారు… వాళ్ళ కోసం పరామర్శ అన్నారు…ఏమయ్యిందన్నారు. అసలు ఏ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో వాళ్ళకైనా తెలుసా అంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారని.. ఇక్కడకు వస్తారన్న ఊహాగానాలపై ఏం మాట్లాడతామన్నారు. ఎంత మంది ఏ రకంగా కలిసి వచ్చినా మేం చేసిన అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు మద్దతు ఇస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z