Politics

ఓటరు నాడీ ఏమిటో అర్థం కావటం లేదు

indian voter mindset is hard to catch

ఎక్కడ చూసినా మౌనం..ఎవరిలో చూసినా గుంభనం..వచ్చినవారికి చిరునవ్వే సమాధానం..వరాలపై చర్చలు కానరావేం..అంతుచిక్కని వ్యూహం..అంచనాలకు మించి ఆశ్చర్యం..అభ్యర్థులకు ప్రసన్నం కాని వైనం..అందరిలోనూ అదే దైన్యం..పోలింగ్‌ తేదీ తమురుకొస్తోంది.. విశ్లేషకులకు కూడా అందని విధంగా ఓటరు నాడి చూసి అభ్యర్థుల్లో గుబులు వ్యక్తమవుతోంది. ఓటరును ప్రసన్నం చేసుకొనే పనిలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా పట్టువిడవని ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
**ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూ చూడనటువంటి విచిత్ర పరిస్థితులు దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అలుముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గాల్లో పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. ప్రధానపక్షాల అభ్యర్థుల అంచనాలు రోజుకో రకంగా కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో రెండు, వడు నియోజకవర్గాల్లో మినహా త్రిముఖ పోటీ బలంగా ఉండటంతో ఎవరి ఓట్లు ఎవరు చీల్చుకుంటారన్న విషయంలో స్పష్టత కానరావడం లేదు. గడచిన రెండు, వడు నెలల కాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛను పెంపు, పసుపు-కుంకుమ, రుణమాఫీ కిస్తీల చెల్లింపులు, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. సంక్షేమ పథకాల పరంగా లబ్ధి పొందిన వారు ఎన్నికల్లో ఏవిధంగా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో అభ్యర్థులు తమ వ్యూహరచన ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ప్రచార పర్వానికన్నా తెర వెనుక మంత్రాంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులతో పాటు సీనియర్‌ కార్యకర్తలు పార్టీ కండువాలు మార్చేశారు. ఇక కార్యకర్తల విషయానికొస్తే గతంలో ఉన్న దూకుడు కనిపించడం లేదు. వేళ్లమీద లెక్కించే స్థాయిలో కార్యకర్తలు ఆయా పార్టీల అభ్యర్థుల విజయానికి అంకితభావంతో పనిచేస్తున్నా..ప్రచారం కోసం కిరాయి కార్యకర్తలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి తప్పడం లేదు.
**అందని ఓటరు నాడి
పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ఓటర్లు సైతం చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఆయా పార్టీల ముఖ్య నాయకుల సభలకు హాజరవుతున్నా బాహాటంగా ఎటువంటి వాఖ్యానాలు చేయడం లేదు. పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించే వారు మినహా మిగిలిన ఓటర్లు తాము ఎటు మొగ్గు చూపుతున్నామన్న సంకేతాలను కూడా తెలియనీయకుండా వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోల్లో అనేక ఉచిత వరాలు ప్రకటించాయి. కనీసం వాటి గురించి చర్చించేందుకు కూడా ఎక్కువ శాతం మంది ఇష్టపడటం లేదు. సహజంగా గ్రామాల్లో, వార్డుల్లో ఉండే సీనియర్‌ నాయకులు అక్కడ నమోదయ్యే ఓటింగ్‌ శాతం, ఎవరికి మెజార్టీ వస్తుందనే అంశాలను అంచనా వేయగలరు. ప్రస్తుతం వారికి కూడా అంతుచిక్కని విధంగా ఓటర్ల తీరు ఉండటంతో కనీస అంచానాలు కూడా రోజుకో రకంగా మారుతున్నాయి.
**పట్టువిడవకుండా ప్రయత్నాలు
ఓ పక్క ఓటరు నాడి తెలియపోవడానికి తోడు అభ్యర్థులు నిర్వహిస్తున్న రోడ్‌షోల సందర్భంగా తటస్థ ఓటర్ల తీరు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటోంది. వారు ఎవరికి ఓటు చేసినా అభ్యర్థుల రోడ్‌షోల సమయంలో స్పందించే వారు. తమ ప్రాంతాల్లో ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు సంతృప్తి కలిగించే విధంగా స్పందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి గోచరించడంలేదు. రోడ్‌షోల సమయంలో ఎక్కువ మంది కనీసం ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. వచ్చిన వారు సైతం అభ్యర్థులు చేసే నమస్కారాలకు తగు రీతిలో స్పందించకుండా చిరునవ్వుతో సరి పెట్టేస్తున్నారు. గతంలో ఇటువంటి అనుభవాలను చవిచూడని నాయకులు ఓటరు వ్యవహారశైలితో విస్తుపోవాల్సి వస్తోంది.