Agriculture

టమాటా తీగల సాగులో తీసుకోవల్సిన జాగ్రత్తలు

March 2020 Telugu Agricultural News-Tomato Farming In Green Houses

హరితగృహాలలో తీగజాతి టమాటా రకాలు సాగుచేయడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇది రెండు రకాలు. మొదటిది సాధారణ టమాటా (10 సెం.మీ. వ్యాసం గల కాయలు), రెండవది చెర్రీ టమాటా (1-2 సెం.మీ. వ్యాసం గల కాయలు). చెర్రీ టమాటాను సలాడ్లలో ఎక్కువగా వాడుతారు.వాతావరణం: వేడిగా (18-30 డిగ్రీల సెల్సియస్‌), తేమగా ఉండే వాతావరణం టమాటా సాగుకు బాగా అనుకూలంగా ఉంటుంది. మంచును, తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. అయినప్పటికీ దీనిని హరిత గృహాలలో డిసెంబరు – జనవరి మాసాలల్లో ముందస్తు వేసవి కాలపు పంటగా సాగు చేసుకోవచ్చు. సంవత్సరమంతా దిగుబడి కోసం కొమ్మ కత్తిరింపులు, శిక్షణ తప్పనిసరి. హరిత గృహాలలో సాగుచేసే తీగజాతి సంకర రకాలను నాటినప్పటి నుంచి కొమ్మలు కత్తిరించి శిక్షణ నివ్వాలి. ఈ తీగజాతి రకాలలో ప్రతీ మొక్కకు ఒక ప్రధాన కాండాన్ని ఉంచి మిగతా పక్క కొమ్మలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఈ పక్క కొమ్మలను లేత దశలో గోరుతో గిచ్చి కూడా తొలిగించవచ్చు. ఎదిగే టమాటా మొక్కలను ప్లాస్టిక్‌ దారము సహాయంతో మొక్క మొదలు వద్ద కట్టి దారం కొన భాగాన్ని కప్పు కింది భాగములో 10 అడుగుల ఎత్తులో నేలకు సమాంతరంగా ఉండే జి.ఐ వైరుకు వదులుగా కట్టి మొక్కకు ఊతాన్నివ్వాలి.

ఎదిగే మొక్క ప్రధాన కాండాన్ని పక్కనే ఉన్న వదులైన ప్లాస్టిక్‌ దారానికి సవ్య దిశలో కింది నుంచి పైకి చుడుతూ పోవాలి. ఇలా చుట్టేటప్పుడు ప్లాస్టిక్‌ దారము పూల, కాయ గుత్తుల మీద, ప్రధాన కాండం కొన భాగం మీదికి రాకుండా కేవలం ఆకు కాడల కింద భాగంలో ఉండేటట్లు చూసుకోవాలి. మొక్కలు 10 అడుగుల ఎత్తులో ఉన్న జి.ఐ వైరుకు చేరుకోగానే తీగ కొనభాగాన్ని కిందికి వదలాలి. ఈ విధంగా మొక్కలను నిర్దిష్ట వ్యవధిలో పక్కకొమ్మలు కత్తిరించి శిక్షణనిస్తే నాటిన తర్వాత 10-11 నెలల వరకు పూత, కాతనిస్తాయి. మొక్క మొదలు భాగంలో ఉన్న కాయలు పరిపక్వదశకు చేరేటప్పుడు దాని కింది భాగంలో ఉండే ముదురు ఆకులను గిచ్చి తొలిగించాలి. కాయ గుత్తిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాయలను తొలి దశలోనే గమనించి తొలిగించాలి. కాండానికి ఆకు కాడ కలిసే భాగం దగ్గర ఏర్పడిన పిలకలను గిచ్చి వేయాలి. పూగుత్తులలో ఉన్నటువంటి ఆకులను కూడా తొలిగించాలి. టమాటాలో స్వపరాగ సంపర్కం జరిగినప్పటికీ, హరిత గృహలలో సాగు చేసేటప్పుడు పరాగ సంపర్కం సరిగా జరగకపోవటం వలన పిందె సరిగా కట్టదు. దీనిని అధిగమించడానికి హరిత గృహలలో బంబుల్‌ ఈగల పెట్టెలను అమర్చాలి. దీనితోపాటుగా వైబ్రేటర్లు పొద్దటి పూట మొక్కలకు తాకించి కూడా పరాగ సంపర్కాన్ని ప్రోత్సహించవచ్చు. హరితగృహాలలో వేసవిలో ఆకుముడత వైరస్‌ తెగులు ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులు ఆకులు పైకి, కిందికి ముడుచుకొని, పసుపుపచ్చ మచ్చలను కలిగి ఉంటాయి. నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌ 5 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి. వైరస్‌ తెగులు ఆశించిన మొక్కలను పెరికి నాశనం చేయాలి. రసం పీల్చే పేనుబంక, తామర పురుగులను ఎప్పటికప్పుడు నివారించాలి. మచ్చల మాడు వైరస్‌ తెగులు: చిగురుటాకుల పైభాగంలో గోధుమ వర్ణంతో కూడిన పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు కిందివైపున వంగిపోతాయి. వైరస్‌ తెగులు ఆశించిన మొక్కలను పెరికి నాశనం చేయాలి. రసం పీల్చే పేనుబంక, తామర పురుగులను ఎప్పటికప్పుడు నివారించాలి.