Movies

సినీ స్మరణీయులు

Remembering Famous Movie Actors And Actresses-March 5th

కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 – మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితులు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన “కంచు కంఠం” జగ్గయ్యగా, “కళా వాచస్పతి”గా పేరుగాంచారు. బ్లాకు & వైట్ సినిమాల నుండి ఇప్పటి ఆధునిక సాంకేతిక నైపుణ్యం తో రూపొందుతున్నచిత్రాల వరకు అయన జీవన ప్రయాణం కొనసాగింది. చిన్న తనం లో దేశభక్తి మెండు గా ఉండటం తో అప్పటి స్వాతంత్ర సమరం లో పాలు పంచుకుని తన దేశభక్తి ని చాటుకున్నారు . సినిమాలో నటించినాలని అయన అనుకోలేదు , అయినా అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి . సుమారు 500 చిత్రాలలో నటించారు.

కాంచనమాల (మార్చి 5, 1917 – జనవరి 24, 1981) తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఈవిడా ఒకరు.

అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి రాజసులోచన. ఈమె ఆగష్టు 15, 1935న జన్మించారు. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు (సి.ఎస్‌.రావు) భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదిలీ కావడంతో చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నారు. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాలను ప్రారంభించారు. అది ఇప్పటికీ నడుస్తున్నది.స్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం ‘గుణసాగరి’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.

నటుడు… దర్శకుడు… నిర్మాత… గాయకుడు… డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌… ఇలా పలు విభాగాల్లో ప్రతిభని ప్రదర్శిస్తున్న సినీ ప్రముఖుడు నాజర్‌. తెలుగుతోపాటు తమిళం, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మణిరత్నం, కమల్‌హాసన్‌ చిత్రాల్లో తప్పక కనిపించే నాజర్‌ భారతదేశంలోనే ఒక ప్రముఖమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతినాయకుడిగానైనా సరే, లేక ఇతర సహాయ పాత్రల్లోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ‘మాతృదేవోభవ’ చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించారు. నాజర్‌ 1958 మార్చి 5న తమిళనాడులోని చెంగల్పట్టులో మెహబూబ్‌ భాషా, ముంతాజ్‌ దంపతులకి జన్మించారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌లో చదువుకున్న ఆయన డ్రమటిక్‌ సొసైటీలో కీలకంగా వ్యవహరించేవారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశాక పూర్తిస్థాయి నటుడిగా మారారు.

శ్రీప్రియ ( జననం మార్చి 5, 1956). 1970, 80 దశకాలలో కథానాయిక పాత్రలలో నటించిన దక్షిణ భారతీయ సినిమానటి. ఈమె తమిళ, తెలుగు,కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో సుమారు 300లు పైగా నటించింది. వాటిలో 200 సినిమాలు తమిళ భాషా చిత్రాలు. ఈమె కొన్ని తమిళ, తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది

సెల్వరాఘవన్ ( 1977 మార్చి 5 ). తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు. తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా తుళ్ళువదో ఇల్లమై కోసం స్క్రిప్ట్ మీద పని చేసిన రాఘవ తరువాత వరుసగా కాదల్ కొండేన్, 7G బృందావన్ కాలనీ లాంటి ప్రేమ చిత్రాలు తీశాడు. తరువాత పుదుపేట్టై, మాయాక్కం ఎన్న లాంటి గ్యాంగ్ స్టర్ సినిమాలు తీశాడు. కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా తీశాడు. రాఘవ నేరుగా తెలుగులో తీసిన సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.

ఆర్తీ అగర్వాల్ (మార్చి 5, 1984 – జూన్ 6, 2015) తెలుగు సినిమా నటీమణి. అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో జన్మించింది. 14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది. ఫిలడెల్ఫియా లోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్‌ డాన్స్ చూసి ముచ్చటపడిన బిగ్‌ బీ, ఆమెను బాలీవుడ్‌లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు. తను భవిష్యత్‌లో మంచి నటి అవగలదని, ఆర్తీ తండ్రిని ఒప్పించారు. అలా ఆర్తీ ముంబాయ్ కి వచ్చి, నట శిక్షణాలయంలో చేరింది. 2001వ సంవత్సరంలో బాలీవుడ్‌లో పాగల్‌పాన్‌ సినిమాలో అవకాశం ఇప్పించారు. ఈ సినిమాలో ఆర్తీ అద్భుతంగా నటించి, అందరి మెప్పు పొందింది. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మరియు నాగార్జున ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రవితేజ,ఉదయ్ కిరణ్, తరుణ్ లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. బి.గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిథి పాత్ర). వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి ఘనవిజయం సాధించాయి. చిరంజీవితో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్‌తో బాబీ.. బాలయ్యతో పల్నాటి బ్రహ్మ నాయుడు.. విక్టరీ వెంకటేష్‌తో వసంతం.. రవితేజతో వీడే.. నాగార్జునతో నేనున్నాను.. ప్రభాస్‌తో అడవిరాముడు.. జూనియర్ ఎన్టీఆర్‌తో నరసింహుడు.. సునీల్‌తో అందాలరాముడు, రాజశేఖర్తో గోరింటాకు, వేణుతో దీపావళి, జెంటిల్‌మెన్‌ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది.

కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆర్తీ చికిత్సకోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది. జూన్ 4, 2015న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015 న కన్ను మూసింది.
రఘురాముడి పాత్రని వేదికలపై రక్తికట్టించిన ఆయనకి అదే పేరు సొంతమైంది. ఈల వేస్తూ పద్యాల్ని, పాటల్ని పాడుతూ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసిన ఆయనకి ఈలపాట ఇంటి పేరైంది. ఈలపాట రఘురామయ్య అంటే తెలుగు నేలకి సుపరిచితమైన పేరు. మార్చి 5, 1901న గుంటూరు జిల్లా, సుద్దపల్లిలో జన్మించిన ఈలపాటి రఘురామయ్య అసలు పేరు కల్యాణం వెంకటసుబ్బయ్య. చిన్నతనం నుంచే నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. దాదాపు 60 యేళ్లపాటు నాటక రంగ ప్రయాణంలో పలు స్త్రీ, పురుష పాత్రలు దరించి మెప్పించారు. వేల ప్రదర్శనలు ఇచ్చారు. కృష్ణుడు, దుష్యంతుడు, నారదుడు పాత్రలకి పెట్టింది పేరు. రంగస్థలంపై ఆయన చూపుడు వేలుని నాలుక కింద పెట్టి వేణుగానం చేశారంటే… ప్రేక్షకులు తన్మయత్వంతో అపూర్వమైన అనుభూతికి గురయ్యేవారట. మెథడ్‌ యాక్టింగ్‌లో ప్రసిద్ధిగాంచిన ఆయన 22 చిత్రాల్లో నటించారు. కళారంగానికి చేసిన సేవలకిగానూ 1973లో సంగీత నాటక అకాడెమీ పురస్కారంతో పాటు, 1975లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఈయన్ని నాటక కోయిల అని ప్రశంసించారు. ఈయన తన 75వ యేట 1975 ఫిబ్రవరి 24న గుండెపోటుతో మరణించారు. ఈయన భార్య సావిత్రి 92 యేళ్ల వయసులో డిసెంబరు 8, 2014న విజయవాడలో కన్నుమూశారు. కుమార్తె తోట సత్యవతి ఉన్నారు. ఈ రోజు ఈలపాట రఘురామయ్య జయంతి.