Politics

విజయవాడ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న కేశినేని శ్వేత

Political And Personal Details Profile Of Kesineni Swetha

రాజకీయాల్లోకి యువత, మహిళలు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునందుకుని తాను ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ కార్పొరేటర్‌ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) రెండో కుమార్తె కేశినేని శ్వేత చెప్పారు. పుట్టి పెరిగిన విజయవాడ అభివృద్ధికి, ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానన్నారు.
****2014, 2019 సాధారణ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసిన తన తండ్రి కేశినేని నాని తరపున విస్తృతంగా ప్రచారం చేసి ఆయన విజయానికి తోడ్పాటునందించారు. అమెరికా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యర్థిగా పోటీ చేసిన డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తరపున ప్రచార కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలందుకున్నారు. ఉన్నత విద్యావంతురాలైన శ్వేత పార్టీకి చేసిన సేవలను గుర్తించి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఆ వివరాలు ఆమె మాటల్లోనే… ‘‘మహిళలు, యువత రాజకీయాల్లోకి వచ్చి కీలక పాత్ర పోషించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేయాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. నాన్న (కేశినేని నాని) ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నుంచి నా కోరిక మరింత బలపడింది. నాన్నతోపాటు కుటుంబ సభ్యులు కూడా నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. రతన్‌ టాటా నిర్వహిస్తున్న ట్రస్టులో చేరి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, అస్సాంలలో ప్రజలకు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలలో పని చేస్తు న్నాను. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్నాం. విజయవాడ నగరంపైన, ఇక్కడి రాజకీయాలపై కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసిన మా నాన్న కేశినేని నానితోపాటు నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేశాను.
*తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో ప్రతి గల్లీలోనూ, మురికివాడలు, కొండ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగాను. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. నగరంలో తాగునీటి సమస్య ఎప్పటి నుంచో వెంటాడుతోంది. డ్రెయినేజీ సమస్య చాలా పెద్దది. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా మా నాన్నగారు కేశినేని నాని, మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల కృషితో నగరం చాలా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. 2018లో స్వచ్ఛ సర్వేక్షన్‌లో మొదటి స్థానంలో నిలిచిన విజయవాడ నగరం.. ప్రస్తుతం మూడో స్థానానికి దిగజారిపోయిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో ముందుకు వెళతున్నామా.. తిరోగమనంలో ఉన్నామా అనేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒకవేళ మేయర్‌గా అవకాశమొస్తే విజయవాడ నగరాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే విషయంలో నాకంటూ ఒక విజన్‌ ఉంది. పైగా నేను చదువుకున్న చదువు, ప్రస్తుతం నేను చేస్తున్న పనులు, వివిధ దేశాల్లో పర్యటించిన నేర్చుకున్న జ్ఞానం కూడా పల్లెలు, పట్టణాలు, నగరాలు, మురికివాడల అభివృద్ధితో ముడిపడి ఉన్నవే. గత ఆరేళ్లుగా పూర్తిగా అభివృద్ధి పనుల్లో భాగస్వామినవుతున్నాను’’ అని శ్వేత వివరించారు.
***శ్వేత బయోడేటా
పేరు : శ్వేత కేశినేని
వయసు : 24 సంవత్సరాలు
వివాహం : అవివాహిత
తండ్రి : శ్రీనివాస్‌
తల్లి : పావని
సోదరి : హైమాచౌదరి
విద్యార్హతలు : డిగ్రీ (అమెరికాలోని అట్లాంటా)
**పని చేసిన సంస్థలు
* మైక్రో ఫైనాన్స్‌ కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌, ఘనా, ఆఫ్రికా
*చైల్డ్‌ సైకాలజీ ప్రోగ్రాం, ఐర్లాండ్‌, గాల్వే
*టాటా ట్రస్ట్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఎంవీఎస్‌టీఎఫ్‌ ప్రాజెక్ట్‌, మహారాష్ట్ర
*టాటా ట్రస్ట్‌ కాన్సర్‌ కేర్‌ ప్రోగ్రాం, అస్సాం
***రాజకీయ నేపథ్యం
* 2014 – అట్లాంటా సెనేటర్‌ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు
*2016 – అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరి క్లింటన్‌ తరపున ప్రచారం నిర్వహించారు
*2014, 2019 సాధారణ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు నిర్వహించారు
*2019 – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారు.