Sports

అదే కథ. ఓడిపోయిన సింధు.

Sindhu Loses All England Championship

ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియన్ షట్లర్లకు మళ్లీ నిరాశే మిగిలింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్‌‌ ప్లేయర్‌‌ పీవీ సింధు కూడా క్వార్టర్స్‌‌లోనే ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌‌లో నాలుగోసీడ్‌‌ నజోమి ఒకుహర (జపాన్‌‌) 12–21, 21–15, 21–13తో సింధుపై గెలిచి సెమీస్‌‌లోకి అడుగుపెట్టింది. గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో సింధు గట్టిగానే పోరాడింది. సుదీర్ఘమైన ర్యాలీలు, పదునైన సర్వీస్‌‌లతో తొలి గేమ్‌‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. కానీ రెండో గేమ్‌‌లో సీన్‌‌ రివర్స్‌‌ అయ్యింది. స్కోరు 2–2తో సమమైన తర్వాత ఒకుహర వరుస పాయింట్లతో హోరెత్తించింది. బలమైన స్మాష్‌‌లు కొడుతూ సింధును ఎక్కడికక్కడ కట్టిపడేసింది. దీంతో స్కోరు సమం చేసేందుకు తెలుగమ్మాయి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.ఇక నిర్ణాయక మూడో గేమ్‌‌లో కూడా ఒకుహర జోరే కొనసాగింది. ఇద్దరు చెరో పాయింట్‌‌ సాధించినా.. తర్వాత ఒకుహర దూకుడు ముందు సింధు నిలువలేకపోయింది. స్కోరు 3–2 వద్ద జపాన్‌‌ ప్లేయర్‌‌ వరుసగా 4 పాయింట్లు నెగ్గి 7–2 లీడ్‌‌ సాధించింది. ఈ దశలో సింధు ఒకటి, రెండు పాయింట్లు గెలిచినా.. ఒకుహర మళ్లీ నాలుగు పాయింట్లతో ఆధిక్యాన్ని 12–6కు పెంచుకుంది. ఇక ఇక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కాగా, ఈ మ్యాచ్కు ముందు సింధు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజుకు ఫోన్ చేసింది. కరోనా నేపథ్యంలో టోర్నీలో కొనసాగాలా? వద్దా? అని రిజిజును అడిగింది. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకొని మ్యాచ్ ఆడాలని సింధుకు చెప్పినట్టు రిజిజు తెలిపారు.