Devotional

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం – TNI ఆధ్యాత్మికం

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం – TNI ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభ‌వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి చేసి శ్రీదేవి ,భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు ఉత్సవ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు.అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్దఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పెర్నివెంక‌ట‌రామ‌య్య, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు అధికారులు పాల్గొన్నారు.తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో పునర్నిర్మించిన జగన్నాథ భవన్ అతిథి గృహాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన దాత ప్రమోద్ కుమార్ అగర్వాల్ ఈ అతిథి గృహాన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు

2. Srisailamలో ఒళ్లు గగ్గుర్లు పొడిచేలా కన్నడిగుల విన్యాసాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కన్నడిగులు చేసిన విన్యాసాలు ఒళ్లు గగ్గుర్లు పొడిచేలా ఉన్నాయి. ఉగాది మహోత్సవాల సందర్బంగా కన్నడిగుల వీరాచార్యా విన్యాసాలు చేశారు. శూలాలతో ఒంటిపై గుచ్చుకుంటూ కర్నాటక భక్తులు భక్తిని చాటుకున్నారు. ఉగాది ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. మరోవైపు ఉగాది పండుగ పురస్కరించుకుని శ్రీశైలంలో ఉదయం పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం అర్చకులు రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి భ్రమరాంబ దేవికి రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం చేయనున్నారు.

3. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 56,958 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని 26,029 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

4. పుట్టపర్తిలో ఉగాది వేడుకలు ప్రారంభం
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయి కుల్వంత్ సభా మందిరంలో శుభకృత ఉగాది పంచాంగ శ్రవణ పఠనం కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూలతో సత్యసాయి బాబా మహా సమాధిని అలంకరించారు. వేడుకల్లో పాల్గొనడానికి దేశ, విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో ప్రశాంతి నిలయంలో భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు.

5. దేవుని కడప ఆలయంలో ముస్లిం భక్తుల తొలిపూజలు
కడప జిల్లాలో ఉగాది పర్వదినం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తొలిగడప దేవుని కడప ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడుతోంది. ముస్లిమ్ సోదరులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తొలిపూజలు నిర్వహించారు. స్వామివారి ముస్లిమ్ అత్తింటివారు శ్రీనివాసుడికి సారె ఇచ్చి ఉగాదికి ఇంటికి ఆహ్వానించారు. బీబీనాంచారమ్మను ముస్లింలు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితిగా వస్తోంది.

6. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం ప్రారంభం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ఉదయం 8 గంటల నుంచే అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర “ఉగాది”, చైత్రమాస “వసంత నవరాత్రోత్సవాలు” మొదలయ్యాయి. అమ్మవారి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు పంచాంగ శ్రవణం జరుగనుంది. ఉగాది సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ ఉదయం అమ్మవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని మంత్రి వెల్లంపల్లి తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు.

7. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 16 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 10న శ్రీసీతారామ కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్ 11న శ్రీరామ మహపట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

8. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. ఆన్‌లైన్‌ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేశారు. ముందుగా భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు దేవస్థానం అధికారులతో సంప్రదించి బ్యాంకు ఖాత నెంబరు తీసుకున్నారు. తరువాత విరాళం మొత్తాన్ని ఆన్‌లైన్లో బదిలీ చేశారు 1991లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల నిత్యాన్నదాన పథకం రూ.15లక్షలతో ప్రారంభించారు. మూడు దశాబ్దాల్లో నిత్యాన్నదానానికి వచ్చిన విరాళాల్లో భారత్‌ బయోటెక్‌ సంస్థ అందజేసిన విరాళం అత్యధికంగా ఉన్నదని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఒక సంవత్సరంలో అన్నదానానికి ప్రస్తుతం వచ్చిన విరాళంతో కలిపి రూ.11 కోట్లు జమచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్నదానానికి భక్తులు ఇచ్చిన విరాళాలు రూ.90కోట్లకు చేరినట్లు ఈవో పేర్కొన్నారు.

9. తిరుమలలోని శ్రీవారిని నిన్న 56,958 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. కాగా నేటి నుంచి అంగప్రదక్షణం భక్తులకు టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 9 నుంచి వయో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.

10. రాజగోపాలస్వామి ఆలయంలో వైభవంగా ఉగాది వేడుకలు
విజయనగరం మన్నారు రాజగోపాలస్వామి ఆలయంలో వైభవంగా ఉగాది వేడుకలను విజయనగరం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వేద పండితులను సత్కరించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి జరుగుతుందని.. శుభం చేకూరుతుందని పేర్కొన్నారు

11. అన్నమ‌య్య 108 అడుగుల విగ్రహం వ‌ద్ద శ్రీ‌వారి ఆలయం : టీటీడీ చైర్మన్‌
శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తిరుగాడిన ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామ‌ని టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. విగ్రహం వద్ద శ్రీవారి ఆలయాన్ని నిర్మించి అర్చకుడు, భద్రత, ఇతర సిబ్బందిని నియమిస్తామన్నారు. ప్రతిరోజు ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలు వినిపించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేస్తామని, వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రాంగ‌ణంలోని అన్నమయ్య విగ్రహానికి రంగులు, నిత్య సంగీత కార్యక్రమాలు, ప‌చ్చద‌నాన్ని పెంపొందించి తాళ్లపాకకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

12. శ్రీవారి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్‌ నెల దర్శన టోకెన్ల కోటాను 8వ తేదీన ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల 1వ తేదీకి బదులు 8వ తేదీకి దర్శన టోకెన్ల విడుదలను వాయిదా వేశారు. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి నిర్దేశించిన స్లాట్‌లో వీరిని దర్శనానికి అనుమతిస్తారు