NRI-NRT

ప్రవాసులకు కోమటి జయరాం లేఖ

jayaram asks nrts to vote for tdp

విదేశాల్లో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకి దేశ విదేశాల్లోని తెలుగువారంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ప్రవాసాంధ్రులకు గురువారం బహిరంగ లేఖ రాశారు. ‘‘భవిష్యత్‌ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు చంద్రన్న నాయకత్వాన్ని బలపరచాలి. ఎన్‌ఆర్‌ఐల కోసం చంద్రబాబు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. వారి ప్రతినిధిగా ఒక ఎన్‌ఆర్‌ఐని నియమించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి, విరాళాలు ఇచ్చేవారికి సహకరించే ఏర్పాటు చేశారు. విదేశాల్లోని ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారికి నైపుణ్య శిక్షణ తరగతుల నిర్వహణకు రూ.40 కోట్లు మంజూరు చేశారు. తెలుగు విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి మోసపోయి జైలు పాలైతే… వారికి అండగా నిలబడి, వెనక్కు తీసుకొచ్చి తల్లిదండ్రుల కడగండ్లు తుడిచారు. ప్రవాసాంధ్ర కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. జగన్‌లాంటి అవినీతిపరులు, నాకది-నీకిది (క్విడ్‌ ప్రోకో) వంటి వైట్‌ కాలర్‌ నేరాలకు పాల్పడేవారు అధికారంలోకి వస్తే మన ఆస్తులు, పెట్టుబడులు ప్రశ్నార్థకమవుతాయనడంలో అతిశయోక్తి లేదు. కేసుల నుంచి బయటపడటం కోసం, అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రక్షించుకోవడం కోసం తెలంగాణ పాలకులకు, దిల్లీ పెద్దలకు నవ్యాంధ్ర సంక్షేమాన్ని అమ్ముకున్న వారిని నమ్మితే మన భవిష్యత్తుకి భద్రత కొరవడుతుంది. అందుకే సైకిల్‌ గుర్తుకు ఓటేద్దాం, నవ్యాంధ్ర ఖ్యాతిని ఇనుమడింపజేద్దాం’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.