Politics

నిన్న రెవెన్యూ…నేడు ఇంటర్ బోర్డ్ రద్దు యోచనలో కేసీఆర్!

telangana intermediate board cancellation by kcr

ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు తెలంగాణలో అగ్గిరాజేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పదుల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడుతున్నారు. ఫలితాలు విడదలయిప్పటి నుంచి వారం రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీతో పాటు విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు కార్యాలయం, విద్యాశాఖమంత్రి నివాసంతో పాటు ప్రగతి భవన్ ఎదుట ధర్నాలు చేశాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఇలా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ప్రగతి భవన్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫలితాల్లో అవకతవకలపై ఈ సందర్భంగా కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటర్ రద్దు దిశగానూ కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. శ్శ్ఛ్ పరిధిలోనే తెలంగాణ ఇంటర్ విద్యను అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ తరహాలో 10+2 విధానాన్ని తీసుకొస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఇంటర్ ఫలితాల తప్పిదాల కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు విద్యార్థులకు న్యాయం చేకూర్చేందుకు ఇదే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.