Agriculture

మేడ్చల్‌లో విదేశీ కూరగాయలు

narasimharaju from medchal grows foreign vegetables contact details telugu farmers in hyderabad organic farmers hyderabad

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే అప్పట్లో రవాణా సౌకర్యం అందుబాటులో లేని కారణాలు మరియు అనేక రకాల కారణాల వలన స్థానికంగా దొరికే ఆహారాలు మాత్రమే తింటూ జీవితాన్ని గడుపుతుండేవారు. కాని రాను రాను అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఒక చోట నుండి వేరే చోటికి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావటంతో ఏ వస్తువైనా ఎలాంటి మారుమూల పల్లెలోనైనా అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ పరిణామాలు ఇంకొంత ముందడుగు వేసి గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ప్రపంచంలో అన్ని ప్రదేశాలలో ఇతర ప్రాంతాలలో లభించే వస్తువులు కూడా అందుబాటులో ఉంటున్నవి. వ్యవసాయ రంగం కూడా దానికేమీ అతీతం కాకుండా ప్రస్తుత పరిస్థితులలో ఆయా దేశాలలో లభించని పండ్లు, కూరగాయలలాంటివి లభించే దేశాల నుండి దిగుమతి చేసుకుని వినియోగ దారులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ క్రమంలో విదేశీ పండ్లు, కూరగాయలు మన దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దానిని గమనించిన నరసింహరాజు మరియు సుదర్శన ప్రసాద్‌ వర్మ మిత్ర ద్వయం ఈ విదేశీ కూరగాయలను స్థానికంగానే పండించి వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో పలు రకాల విదేశీ రకాల కూరగాయలను ప్రయోగాత్మకంగా పండిస్తూ వాటి సాగు మరియు మార్కెటింగ్‌లో ఉన్న సాధక బాధకాలను అవగాహన చేసుకుంటున్నారు. ఆహార పదార్థాలలో ఉన్న రసాయనిక అవశేషాలు ప్రజల ఆరోగ్యాలను చెడగొట్టడం మరియు విచక్షణారహిత రసాయనాల వినియోగం వలన నేల, నీరు, భూమి, వాతావరణం కలుషితమవుతున్న విషయం ఇటీవల కాలంలో ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు.ఈ సమస్యలకు పరిష్కారం వ్యవసాయంలో రసాయనాలను మానివేసి సేంద్రియ పద్ధతులు పాటించడమే అని గమనించిన వీరు మేడ్చెల్‌ సమీపంలో ఒక ఎకరంలో పలు రకాల స్థానిక కూరగాయలను 2013వ సంవత్సరం నుండి సాగు చేస్తూ ఆరోగ్యకర దిగుబడి తీస్తూ వచ్చిన దిగుబడి తాము సొంతంగా ఉపయోగించుకుంటూ తోటి స్నేహితులకు ఇస్తూ వస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే వంగ, బెండ, టమాట, చిక్కుడు, పాలకూర, తోటకూర మొదలగు కూరగాయలు మరియు ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పండించిన స్ఫూర్తితో వారి దృష్టి విదేశీ కూరగాయలపై మరల్చి వీటిని పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించి సమాజానికి అందించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు. మేడ్చెల్‌ సమీపంలో ఒక ఎకరం స్థలంలో వివిధ రకాల కూరగాయలు, ఆవుల కొరకు మేతను పెంచుతున్నారు. రెండు దేశీయ ఆవులను పోషిస్తూ వాటి వ్యర్థాలతో వివిధ రకాల కషాయాలు ద్రావణాలు తయారు చేసుకొని పంటలపై ఉపయోగిస్తున్నారు. సుమారు 100 రకాలకు పైగా కూరగాయలు మరియు ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రత్యేకించి సెలరి, పార్శిలి, లీక్‌, కేల్‌, బ్రొకోలీ, పాక్‌బైన్‌, బ్రసెల్స్‌ స్ట్రాట్‌, లెట్యూస్‌, చెర్రి టమాట, కాప్సికం, నూల్‌కోల్‌, టర్నిప్‌, ఆస్పరాగస్‌, బేసిల్‌ మొదలగు విదేశీ కూరగాయల రకాలతో పాటు మన దేశీ రకాలైనటువంటి బెండ, వంగ, టమాట, చిక్కుడు, గోరుచిక్కుడు, బీర, కాకర, పొట్ల, బెంగుళూరు వంగ, కాలీఫ్లవర్‌, క్యాబేజీ, పచ్చిమిర్చి మొదలగు కూరగాయలతోపాటు వివిధ రకాల ఆకుకూరలు, కంది, అరటి మొదలగు పంటలు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. విదేశీ రకం కూరగాయల విత్తనాలను పూణే నుంచి తెప్పించి ఉపయోగిస్తున్నారు. స్థానిక రకాలని స్థానికంగానే సేకరిస్తున్నారు. ఈ పంటలన్నింటికి దుక్కిలో బాగా మాగిన దేశీయ ఆవుల ఎరువును అందించడంతో పాటు పైపాటుగా నెలకు ఒకసారి 200 లీటర్ల జీవామృతం అందిస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా ఆవుమూత్రాన్ని డ్రిప్పు ద్వారా వివిధ మొక్కలకు అందిస్తున్నారు. పంటలపై బవేరియా బాసియానా, వర్టిసీలియం లఖాని, ట్రైకోడెర్మావిరిడి, ఇ.పి.యన్‌లతో పాటు అన్ని రకాల జీవన ఎరువులను పిచికారి చేస్తున్నారు. వీటితో పాటు లింగాకర్షకబుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన అన్ని మెళకువలు తెలుసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా విదేశీ రకాలు మరియు మన స్థానిక రకాలు కలిపి 100 రకాలకు పైగా పంటలను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ఆర్థికపరమైన అంశానికి వస్తే 2018వ సంవత్సరం మే నెల నుంచి 2019 సంవత్సరం జనవరి వరకు సుమారు 50,000/ ల వరకు ఖర్చు చేసి, అన్ని రకాలు కిలో50/రూ. చొప్పున లెక్క వేసుకొంటే సుమారు 80,000/ల వరకు దిగుబడిని కేవలం 9 నెలలలో తీయడం జరిగింది. ఇంకా రాబోవు 3 నెలల్లో ఇంకా కొంత దిగుబడి పొందే అవకాశం ఉంది. వాటికి అదనంగా సుమారు 60 కిలోల కందులను కూడా పొందినారు. మరిన్ని వివరాలు 9676486789 కి ఫోను చేసి తెలుసుకోగలరు.తమ దగ్గర పెంచే ఆవులకు కూడా అక్కడే పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. ఇందుకుగాను గింజ జాతి మరియు పప్పుజాతి పశుగ్రాసాలను ఎన్నుకొని సాగు చేస్తున్నారు. అవి నేపియర్‌ మరియు హెడ్జ్‌లూసర్న్‌. వీరి అనుభవం ప్రకారం 75 శాతం గింజజాతి పశుగ్రాసం, 25 శాతం పప్పుజాతి పశుగ్రాసం సాగు చేసుకున్నట్లయితే పశువులకు సమీకృత పశుగ్రాసాన్ని అందించటానికి అవకాశం ఉంటుంది. వీరు సాగు చేసే పప్పుజాతి పశుగ్రాసం హెడ్జ్‌లూసర్న్‌ బహు వార్షికం. ఇది ఒకసారి నాటుకుంటే 5 సంవత్సరాలకు పైగా దిగుబడి పొందవచ్చు.