DailyDose

చురుగ్గా PSLV-C46 ప్రయోగ సన్నాహాలు తాజావార్తలు–05/09

PSLV-C46 Getting Ready For Launch On the 22nd Of This Month

*భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 22వ తేదీన పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌- సి 46 వాహక నౌకను నింగిలోకి పంపనున్నారు. ఈ మేరకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదికలో చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి.
*అసోంలో జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)కు తుదిరూపు ఇచ్చే గడువును జులై 31 కంటే ఒక్కరోజు కూడా పొడిగించేది లేదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. అలాగే దీనికి సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలు వంటివాటి విషయమై నిర్ణయం తీసుకోవడానికి సంబంధిత సమన్వయకర్త (కోర్డినేటర్‌) ప్రతీక్‌ హజేలాకు స్వేచ్ఛనిచ్చింది.
*రాజకీయ పక్షాలు, విశ్లేషకుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఈసారి ఆలస్యం కానున్నాయి. అధికారికంగా ఫలితాలు తెలుసుకోవాలంటే గతం కంటే దాదాపు అయిదారు గంటలకు పైగా వేచిచూడక తప్పేలా లేదు.
*ప్రధాని నరేంద్రమోదీ స్థానంలో ఈ నెల 23వ తేదీ తర్వాత వేరే ప్రధాన మంత్రి రానున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటివరకూ బెంగాల్‌ టైగర్‌గానే పేరుపొందారని, రాబోయే భాజపాయేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషించి దేశానికే బెబ్బులి అవుతారని వ్యాఖ్యానించారు.
*నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక నిర్వహణ తీరు మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పాఠం కానుంది. ఈ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికపై అధ్యయనం చేయాలని హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కోరారు. మేనేజ్‌మెంట్‌ రంగంలోని సప్లై-చైన్‌ అంశంలో ఓ కేస్‌స్టడీగా ఈ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయాలని లేఖలో వివరించారు.
*విద్యార్థులు ఇంటర్‌లో ఒక్కో మార్కును ఎంతో కీలకంగా భావిస్తుంటే ఇంటర్‌ బోర్డు మాత్రం మూల్యాంకనాన్ని తేలిగ్గా తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. పునఃపరిశీలనలో భారీగా మార్కుల్లో తేడా ఏమీ రాలేదని, కొద్దిగా మార్కులు పెరిగినా ఎవరూ ఉత్తీర్ణులు కాలేదని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన 22 మంది, ఆత్మహత్యకు యత్నించిన మరో ముగ్గురు విద్యార్థుల 50 జవాబు పత్రాలను ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్‌, ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులతో కమిటీ నియమించి పునఃపరిశీలన చేయించారు. వాటిల్లో 20 పేపర్లలో మార్పులు వచ్చాయి. అంటే 40 శాతం జవాబు పత్రాల మార్కుల్లో మార్పులు వచ్చాయని స్పష్టమవుతోంది.
*కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తన వాటాను పూర్తిగా వినియోగించుకుందని తెలంగాణ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తెచ్చింది. మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కృష్ణా నదీ యాజమాన్యబోర్డును కోరగా, దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను బోర్డు అడిగింది.
* నీతి ఆయోగ్‌ బృందం రాష్ట్రంలో క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభించింది. తొలిసారిగా అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ చేపడుతోంది. ఇందుకు రాష్ట్రంలోని కృష్ణా, విజయనగరం జిల్లాలను ఎంపిక చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆకస్మిక తనిఖీలు జరగనున్నాయి.
*రాష్ట్రంలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో చేపట్టిన సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై ఉత్తరాఖండ్‌ సీనియర్‌ అధికారుల బృందం అధ్యయనం చేసింది. విజయవాడ గొల్లపూడిలోని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయాన్ని బుధవారం ఈ బృందం సందర్శించింది.
*రాయలసీమ విశ్వవిద్యాలయానికి చెందిన వెబ్‌సైట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వైరస్‌తో దాడి చేశారు. దీనితో వర్సిటీ అనుబంధ డిగ్రీ, పీˆజీ విద్యార్థుల వెబ్‌సైట్తో పాటు పీˆజీసెట్-2019 కొన్ని గంటల వరకు పనిచేయలేదు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు వర్సిటీ వెబ్‌సైట్లోకి వైరస్‌ వదిలినట్లు తెలుస్తోంది. దీనిని వర్సిటీ సాంకేతిక నిపుణులు ఉదయం ఆరు గంటల సమయంలో గుర్తించారు. సాంకేతిక నిపుణులు దీనిని పరిష్కరించారని డాటా హ్యాంకింగ్‌ గురికాలేదని అధికారులు చెప్పారు.
*ఏపీ ఈసెట్‌ ఫలితాలు 13న, ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలను 14వ తేదీన విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్‌ చదివిన విద్యార్థులు బీటెక్‌ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ను నిర్వహిస్తున్నారు. పీజీఈసెట్‌ను ఎంటెక్‌, ఎంఫార్మసీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్నారు. ఈసెట్‌కు 37,749మంది హాజరు కాగా పీజీఈసెట్‌కు 24,248మంది హాజరయ్యారు.
*నైపుణ్య ప్రాధాన్యత, వృత్తి విద్య లక్ష్యంగా తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం అయిన మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎంఎస్‌ఐటీ-2019)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు కళాశాల కార్యాలయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్‌, బీఈ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఎంచుకున్న పరీక్ష కేంద్రాల్లో మే 26వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం ‌www.msitprogram.net ను సంప్రదించాలని సూచించారు.
*సార్వత్రిక విద్యా పీఠం పది, ఇంటర్‌ పరీక్షల సమయాల్లో మార్పు చేసినట్లు సంచాలకులు నరసింహారావు ప్రకటనలో తెలిపారు. పదోతరగతి హిందీ, ఇంటర్‌ ఆంగ్ల పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షను గురువారం నిర్వహిస్తున్నందున ఈ మార్పును చేశామన్నారు. శుక్రవారం జరగాల్సిన పరీక్షలు యథావిధిగా ఉదయం 9.30 గంటల నుంచి 12.30గంటల వరకు ఉంటాయని వివరించారు.
*పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రెండో సంవత్సరం ప్రవేశాల కోసం ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే బ్రిడ్జికోర్సు పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలోని ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి వి.ఎస్‌.దత్తు వెల్లడించారు. రూ.300 రుసుము చెల్లించి 20లోపుhttps://apsbtet.net/itibridgecourse లో నమోదుచేసుకోవాలన్నారు.
*తమిళనాడులో 46 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు బుధవారం సంకేతాలు ఇచ్చారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారుల నుంచి నివేదికలు అందిన తర్వాత ఈ అభిప్రాయానికొచ్చినట్లు చెప్పారు.
*ఎంసెట్‌ రాసిన విద్యార్థులకు ఈనెల 11వ తేదీ సాయంత్రానికి ఈ-మెయిల్‌ ద్వారా ప్రశ్నపత్రాలను పంపనున్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష కావడంతో విద్యార్థులకు తాము రాసిన ప్రశ్నపత్రం ఇవ్వరు. ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించామన్నది అధ్యాపకులను అడిగి ఒక అంచనాకు రావడానికి వీల్లేని పరిస్థితి. అయితే ఈ నెల 3,4, 6 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 1.31 లక్షల మంది పరీక్ష రాశారు. ఈ నెల 9వ తేదీ ఉదయం పరీక్షతో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష ముగియనుంది. ఈ క్రమంలో 11వ తేదీ సాయంత్రం లోపు ఎవరు రాసిన ప్రశ్నపత్రాన్ని వారికి ఈ-మెయిల్‌ ద్వారా ఎంసెట్‌ అధికారులు పంపనున్నారు. ప్రశ్నపత్రాలతోపాటు ప్రాథమిక ‘కీ’ విద్యార్థులకు పంపిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య యాదయ్య తెలిపారు.
*రాష్ట్రంలో గురువారం నుంచి మరో మూడు రోజులు వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా ఖమ్మం జిల్లా పమ్మిలో 45.9, పల్లెగూడెం, ఖమ్మం నగరంలో 45.8, గుబ్బగుర్తిలో 45.7, వైరాలో 45.6, చింతకానిలో 45.5, బాణాపురంలో 45.2, తిమ్మారావుపేటలో 45.1, ఏన్కూరులో 45, మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 45.4, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 45.3, కరీంనగర్‌ జిల్లా తంగుళ్ల, పెద్దపల్లి జిల్లా తక్కళ్లపల్లిలో 45.2, నల్గొండలో 45, ఆదిలాబాద్‌లో 44.3, హైదరాబాద్‌లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడటంతో గాలిలో తేమ తగ్గి ఉక్కపోతలు అధికమవుతున్నాయి. వాయువ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ తీరుకు నిరసనగా మరో ఆత్మ గౌరవ ఉద్యమానికి శ్రీకారం చుడతామని టీపీసీసీ ఓబీసీ విభాగం ఛైర్మన్‌ కత్తి వెంకటస్వామి తెలిపారు. ఈ నెల 15న సిద్దిపేట నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు.
*డబ్లింగ్‌ పనుల కారణంగా రద్దుచేసిన హైదరాబాద్‌-వాస్కోడగామా, తిరుపతి-వాస్కోడగామా రైళ్లు 9, 10 తేదీల్లో యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గుంతకల్‌ డివిజన్‌లోని గుంతకల్‌-గుల్లపాళ్యం మధ్య డబ్లింగ్‌ పనుల కారణంగా.. 9వ తేదీన తిరుపతి – వాస్కోడగామా (నంబరు. 17419), హైదరాబాద్‌-వాస్కోడగామా (17021)ను; 10వ తేదీన వాస్కోడగామా-తిరుపతి (17420), వాస్కోడగామా-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం.17022)ను మొదట్లో ద.మ.రైల్వే రద్దుచేసింది. డబ్లింగ్‌ పనులతో ఇబ్బంది లేకపోవడంతో, ఆ రైళ్లను యథావిధిగా నడపాలని నిర్ణయించింది. దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించిన మరికొన్ని రైళ్లను సాధారణ రూట్లలో పునరుద్ధరిస్తున్నామని పేర్కొంది.