Kids

క్రికెట్ బ్యాటు ఈ చెట్టుతోనే చేస్తారు

Willow trees are used to make cricket bats and here it is how they are made - kids telugu news

* మాకు తడి ఎక్కువ ఉండే చోట్లంటే ఇష్టం. అలాగే సమశీతోష్ణ వాతావరణాలన్నా కూడా. మీకు తెలుసో లేదో మీ భారత దేశంలో పైవైపు సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. అందుకనే మేం మీ కశ్మీర్‌లాంటి చల్లగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతుంటాం.
* నిజానికి మా పుట్టిల్లు చైనాలోని ఉత్తరభాగం. అందుకే ఆసియా, ఐరోపాల్లో ఎక్కువగా మా బంధు వర్గం కనిపిస్తుంటుంది.
* విల్లో అంటే నేనొక్కదాన్నే కాదు. మా చెట్ల జాతిలో మళ్లీ 12 రకాలున్నాయి. బ్లాక్‌ విల్లో, వైట్‌ విల్లో, డైమండ్‌ విల్లో… ఇలా వాటి పేర్లుంటాయి. అయితే కిందికి వేలాడే ఆకులతో ఉన్న నేను మాత్రం భలే ఫేమస్సు.
* పొట్టి కాండం, ఆ పైన కిరీటాన్ని పోలిన బలమైన పెద్ద కొమ్మలూ ఉంటాయి. వాటికి పొడవైన తీగ రెమ్మలు నాకెంతో చక్కదనాన్ని తెచ్చిపెడతాయి. నా ఆకులు కిందివైపునకు వేలాడుతూ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. అయితే నాలో అన్ని రకాలూ నా అంత అందంగా ఉండవులేండి.
* నేనిలా వేలాడుతుండటం నాకెంతో నచ్చుతుంది కానీ కొన్ని దేశాల్లో నన్ను విచారానికి గుర్తుగా భావిస్తారు. నన్ను చూస్తే ఏడుపు ముఖం గుర్తొస్తుందట. అందకనే నన్ను వీపింగ్‌ విల్లో అనీ పిలిచేస్తుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. నేనివేం పట్టించుకోనులేండి.
* నేను వేగంగా నాలుగైదు ఏళ్లలోనే పెద్ద చెట్టునవుతా. చెరువులు, కాలువల పక్కన పెరగడం నాకెంతో ఇష్టం.
* నన్ను చాలా మంది నీడ కోసం పెంచుకుంటారు.
* మిగిలిన పూలతో పోల్చినప్పుడు నా పువ్వుల్లో మకరందం ఎక్కువ. అందుకనే తేనెటీగలకు నేనెంటే చెప్పలేనంత ఇష్టం.
* ఈజిప్టు, గ్రీస్‌, ఇరాక్‌లాంటి దేశాల్లో నన్ను ఔషధాల్లో వాడుతుంటారు. నా ఆకులు, కాండాల్ని నొప్పులు, జ్వరాల మందుల్లో ఉపయోగిస్తారు.
* కొందరు నా పూగుత్తుల్ని మెత్తగా చేసి ఆహారంలో తింటారు.
* నా కలప కాస్తంత మెత్తగా ఎలాగైనా మలచడానికి వీలుగా ఉంటుంది. దీంతో పెద్ద పెద్ద కళారూపాల దగ్గర నుంచి క్రికెట్‌ బ్యాట్‌ల వరకూ అన్నింటినీ నాతో తయారు చేస్తారు. ఇంట్లో ఫర్నిచర్‌తో సహా.