Agriculture

టమాటా రైతుల్లారా….మీకు ప్రత్యేక బీమా సౌకర్యం ఉంది

Special Insurance Plan For Tomato Farmers In Telugu States and across india

ఉమ్మడి జిల్లాలో 52వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తారు. ఇందులో అత్యధికంగా టమాటా ఉంటుంది. ఏటా 20-25వేల ఎకరాల్లో వర్షాధారంగా దీన్నిసాగు చేస్తారు. జిల్లా నేలలు టమాటా సాగుకు అనుకూలంగా ఉండడంతో పాటు రైతులు అధునాతన పద్ధతులతో సాధారణ దిగుబడి కంటే ఎక్కువగా సాధిస్తున్నారు. ఇక్కడ నుంచి పక్క రాష్ట్రంలోని చంద్రాపూర్, నాగాపూర్ తదితర మార్కెట్లతో పాటు హైదరాబాద్, కరీంనగర్ తదితర జిల్లాలకు ఎగుమతి చేస్తారు. సాగు విస్తీర్ణం పెరిగినా రవాణాకు జిల్లా రోడ్లు అనుకూలంగా ఉండడంతో ఇతర రాష్ర్టాల్లోని మార్కెట్లకు ఎగుమతి చేసుకొని లబ్ధిపొందే అవకాశం ఉంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ, నార్నూర్, జైనూర్, ఆదిలాబాద్, జైనథ్, బేల తదితర మండలా ల్లో టమాటా సాగు అవుతుంది. సాధారణంగా హెక్టారుకు 15 టన్నుల దిగుబడి వస్తుంది. వాతా వరణం అనుకూలించిన సందర్భంలో జిల్లాలో 20 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టితో నష్టం వస్తుంది. అధిక వర్షాలతో బూజు తెగులు, పొగమంచుతో ఆకుముడత, సూది పురుగు సోకి ఆశించిన దిగుబడిని సాధించలేక నష్టపోతున్నారు. దీంతో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే టమాటాకు తొలి సారిగా బీమా అమలు చేస్తున్నారు. గత పదేళ్లలో వాతావరణ పరిస్థితులు, పంటకు జరిగే నష్టం తదితరాలను పరిశీలించి, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రం మొత్తంలో పైలట్ ప్రాజెక్టు కింద కేవలం రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో బీమా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెక్టారుకు రూ.75 వేలు పరిహారం కాగా ఇందులో 22శాతం ప్రీమియం కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. 22శాతంలో రైతులు 5 శాతం చెల్లించాలి. మిగిలిన మొత్తం రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈ లెక్కన హెక్టారుకు రూ.3,750 ప్రీమియం కాగా, ఎకరానికి రూ.1500 రైతులు చెల్లించాలి. ఇతర పంటలకైతే రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలోనే ప్రీమియాన్ని మినహాయించుకుంటాయి. టమాటా సాగుచేసే రైతులు నేరుగా మీసేవ, లేదా ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించుకోవచ్చు.