Politics

ఏపీలో హంగ్ లేదు. బొంగు లేదు.

Lagadapati Rajagopal Survey Results For 2019 Andhra Elections

ఆంధ్రప్రదేశ్‌లో హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని.. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని, గజిబిజిగా తీర్పు ఇవ్వలేదని గుర్తుచేశారు. శనివారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉండబోతుందనే అంశంపై తన అంచనాలను వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంది గనకే అక్కడి ప్రజలు కారెక్కారని, లోటు బడ్జెట్‌లో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సైకిలే మార్గమైందని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. రేపు సాయంత్రం 6గంటలకు తిరుపతిలో చెప్పబోయే ఫలితాలు తన విశ్వసనీయతకు కచ్చితంగా ఓ పరీక్షేనని వ్యాఖ్యానించారు. ‘‘ఈ నెల 23న స్పష్టంగా ఫలితాలు తెలుస్తాయి. రేపు చివరి దశ ఎన్నికల తర్వాత అనేక ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేలు ప్రజల ముందుకు రాబోతున్నాయి. నేను విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రవాసాంధ్రులతోనూ మాట్లాడా. వారు కూడా మనకంటే ఎక్కువ ఆసక్తితో రాష్ట్రంలోని ఫలితాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏపీ ప్రజలు కోరుకోకుండానే రాష్ట్రం ఏర్పడింది.. రాజధాని, నిధులు లేవు. ఆనాడు పాండవులు ఖాండవ వనాన్ని ఇంద్రప్రస్థగా మార్చుకున్నారు. అలనాటి మయ సభలాంటి అసెంబ్లీ భవనం అమరావతిలో రాబోతోంది. అందరూ అసూయపడేలా మన రాజధాని అభివృద్ధిలోకి వస్తుంది. మన రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. ప్రతి ఒక్కరూ రాజధానిపై ఆసక్తితో చూస్తున్నారు. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ ప్రత్యేక హోదాపై దృష్టిసారించాయి. కేంద్రంలో రాష్ట్రానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వం వస్తే ఇబ్బందే లేదు. అనుకూలంగా లేని ప్రభుత్వం వస్తే మాత్రం పోరాటం తప్పదు. రాజకీయాలకు నేను దూరంగా ఉన్నా ప్రజలనాడి తెలుసుకోవడం నాకు ఆసక్తి. తెలంగాణలో నేను చెప్పిన దానికి వ్యతిరేక ఫలితం వచ్చింది. అన్నిసార్లు సరైన ఫలితం రావాలని ఏమీలేదు. నాకే పార్టీతోనూ అనుబంధంలేదు. ప్రజానాడి తెలుసుకుని రేపు సంఖ్య చెప్పబోతున్నా. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై రేపు సాయంత్రం 6గంటలకు తిరుపతిలో చెబుతాను. ప్రధానంగా మూడు పార్టీలే రాష్ట్రంలో పోటీలో ఉన్నాయి. పాలక పక్షం, ప్రతిపక్షం కలిసి వెళ్లాలనేది నా భావన. నేను చెప్పబోయే ఫలితాలు రాజకీయ కోణంలో చూడొద్దు. నేను చెప్పబోయే ఫలితాలు నా ఇష్టానుసారంతో చేసినవిగా భావించాలి. తెలంగాణ మిగులు బడ్జెట్‌ ఉన్న ప్రాంతం. అందుకే అక్కడి ప్రజలు కారు ఎన్నుకున్నారు. ఏపీ లోటు బడ్జెట్‌ ప్రాంతం గనక ప్రజలకు సైకిల్‌ మార్గమైంది. ఇరు ప్రాంత ప్రజలు వారి ఆలోచనలకు అనుగుణంగా కావాల్సిన వాహనం ఎక్కారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సాధించిన సీట్ల కంటే కొద్దిగా తక్కువగానే జనసేనకు వస్తాయి’’ అని లగడపాటి అభిప్రాయపడ్డారు.