Agriculture

రైతులను పీక్కుతింటున్న వడ్డీ వ్యాపారుల నడ్డి విరగ్గొట్టారు

Ramagundam Manchiryala Police Arrest Illegal Interest Businessmen-tnilive-telugu news international

వడ్డీ వ్యాపారులపై రామగుండం పోలీసులు కొరడా ఝళిపించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 49 మంది వడ్డీ వ్యాపారుల్ని అరెస్టు చేసినట్టు రామగుండం నగర పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వెల్లడించారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.65.52లక్షల నగదు, బాండ్‌ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 70 మంది వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నట్టు సీపీ వెల్లడించారు. గోదావరిఖనిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. రామగుండంలో వడ్డీ వ్యాపారులు అక్రమంగా అధిక వడ్డీలకు ఫైనాన్స్‌ చేస్తూ లాభార్జనకు పాల్పడుతున్నారని వివరించారు. ప్రాంసరీ నోట్లు, బాండ్‌ పేపర్లు రాయించుకోవడంతో పాటు ఏటీఎం కార్డులు, పట్టా పాసుపుస్తకాలు వారి వద్ద తనఖా పెట్టుకొని అప్పులు ఇస్తున్నారని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో అక్రమంగా నడుపుతున్న వడ్డీ వ్యాపారులపై ఏకకాలంలో దాడులు నిర్వహించి 1235 ప్రాంసరీ నోట్లు, 1019 బ్లాంక్‌ చెక్కులు, 347 ఏటీఎం కార్డులు, 175 బాండ్‌ పేపర్లు, 23 భూమి పత్రాలు, 9 పట్టాదారు పాసు పుస్తకాలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ అనుమతి లేని వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీలు సుదర్శన్‌, రక్షిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీలు అశోక్‌ కుమార్‌, రవికుమార్‌, ఏసీపీలు పాల్గొన్నారు.