Editorials

టీటీడీలో సమూల మార్పులు–రమణ దీక్షితులకు పట్టం–జేఈవో బదిలీ–TNI ప్రేత్యేకం

ramana deekshitulu returns to ttd

ఏపీలో వైకాపా బాధ్యతలు తీసుకున్న వెంటనే తితిదేలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేతగా జగన్ తిరుమల సందర్శించినపుడు ఈవో సింఘాల్ కానీ, జేఈవో శ్రీనివాసరాజు కానీ జగన్ ను కలవలేదు. అపుడు ముఖం చాటేసిన వారిరువురు జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతున్న తరుణంలో విజయవాడకు హడావుడిగా ప్రధాన పూజారులతో వచ్చి జగన్ కు ఆశీస్సులు అందించడం చర్చనీయంశంగా మారింది. ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు పూర్వ వైభవం కల్పించాబోతున్నారు. రమణ దీక్షితులు గృహంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఫోటో ఉన్నదనే కారణంతో ఆయన్ను ప్రధాన అర్చకుడు పదవి నుండి తొలగించినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఆయనతో పాటు మరో ముగ్గురు అర్చకులకు కూడా పూర్వవైభవం రానుంది. వైకాపా ప్రభుత్వంలో ఏర్పడే తితిదే బోర్డు ఛైర్మన్‌ పదవి.. రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డికి దక్కనున్నట్లు సమాచారం. తెలుగుదేశం నుంచి మేడా మల్లికార్జునరెడ్డిని వైకాపాలోకి తీసుకునే సమయంలో తితిదే అధ్యక్ష పదవి ఇస్తామని అమరనాథ్‌రెడ్డికి జగన్‌ హామీ ఇచ్చినట్లు నేతలు చెబుతున్నారు. అమర్నాద్ రెడ్డి కాని పక్షంలో పర్చూరు నుండి వైకాపా ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది ఓట్ల మెజార్టీతో పరాజయం పాలైన డా. దగ్గుబాటి వెంకటేశ్వరావు పేరును టిటిడీ చైర్మన్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమచారం. తిరుమల జేఈవోగా ఎనిమిది సంవత్సరాలుకు పైగా పనిచేస్తున్న శ్రీనివాసరాజు తిరుమల కొండపై తిరుగులేని అధికారాన్ని చేలయిస్తున్నారు. ఈవో కన్నా జేఈవో శ్రీనివాసరాజు పెత్తనమే టీటీడీలో ఎక్కువగా కనిపిస్తుంది. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రస్తుత ధర్మకర్తల మండలి తప్పుకోకుండా వేచి ఉండాలని భావిస్తోంది. ప్రస్తుత ఈవో అశోక్ కుమార్ సింఘాల్ సొంతంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ధరలను భక్తులకు అందుబాటులో లేకుండా పెంచేశారు. గదుల అద్దేలను పెంచారు. ఆంధ్ర రాష్ట్రంలో అర్హత కలిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశానికి చెందిన అశోక్ కుమార్ సింఘాల్ ను తెదేపా ప్రభుత్వం టిటిడీ ఈవోగా నియమించడం పట్ల తెలుగు ప్రజలు అసంతృప్తి వ్యక్తపరిచారు. సింఘాల్ ను మార్చాలని ఎప్పటి నుండో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీగా సమర్ధమైన ఆంధ్రా అధికారి నియమించడం కోసం జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి టిటిడీ చైర్మన్ గా నియమించారు. భూమన హయాంలో తిరుమల కొండపై చాలా అపచారాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటువంటి అపచారాలకు తావివ్వకుండా నూతన పాలకవర్గాన్ని సమర్దవంతమైన నాయకులను సభ్యులుగా నియమించాలని ప్రజలు కోరుతున్నారు. – కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.