Sports

డీవిలియర్స్‌పై అక్తర్ చురకలు

Shoaib Akhtar Slams ab de villiers for retiring and requesting again

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ డివిలియర్స్‌కు ఆదాయం విషయంలో ఉన్న ఆసక్తి దేశం పట్ల లేదని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. అర్ధంతరంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌ ప్రపంచకప్‌లో ఆడేందుకు అవకాశం ఇవ్వాలని ఇటీవల ప్రతిపాదించగా.. దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఏబీడీ పునరాగమన ప్రతిపాదన విషయమై అతనిని ఉద్దేశిస్తూ.. అక్తర్‌ తాజాగా ఓ వీడియో ద్వారా స్పందించాడు. ‘మరో రెండేళ్లు ఆడగల సత్తా ఉన్నా.. నువ్వు అనవసరంగా రిటైర్మెంట్‌ ప్రకటించావు. మళ్లీ ఇప్పుడు దేశానికి ఆడుతానంటూ ముందుకు రావడం వెనుక ఏదో జిమ్మిక్కు ఉంది. ముందు రిటైర్మెంట్‌ ప్రకటించి ఒక తప్పు చేశావు. మళ్లీ ప్రపంచకప్‌లో ఆడతానంటూ అడగడం మరో తప్పిదం. ఒక్కసారి నీవే ఆలోచించుకో. ఆట విషయంలో నీకున్న గొప్ప పేరును చెడగొట్టకోవద్దు.’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘డివిలియర్స్‌ లేకపోవడంతోనే దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో చివరిస్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ అతను జట్టుతో ఉన్నట్లయితే మిడిల్‌ ఆర్డర్‌ కచ్చితంగా బలంగా ఉండేది. జట్టు కూడా మంచి స్థానంలో ఉండేది. కేవలం ఆదాయం కోసం దేశ ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టాడు. ఈ ప్రపంచకప్‌తో పాటు, వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ వరకు ఆడగల సత్తా ఏబీడీకి ఉంది. ఇలాంటి సమయంలో దేశానికి మొదటి ప్రాధాన్యతనివ్వకుండా ఆదాయం వచ్చే ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ వంటి టోర్నీలవైపు మొగ్గు చూపడం నిజంగా విచారించదగ్గ విషయమని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.