Agriculture

రొయ్యలు చేపల సాగుతో తగ్గుతోన్న కొబ్బరి దిగుబడి

Aqua Farming Is Killing The Coconut Industry In Godavari District

కోనసీమ కొబ్బరి రైతుకు కొత్త కష్టమొచ్చింది. ఆక్వా సాగు పుణ్యమాని తూర్పు గోదావరి జిల్లాలో వందలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు రొయ్యలు, చేపల చెరువులున్న ప్రాంతాల్లో కొబ్బరి కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. గడచిన ఐదేళ్ల కాలంలో కాయ సైజు సగటున 100 గ్రాముల వరకు తగ్గినట్టు అంచనా. కొబ్బరి ధర పతనానికి.. మార్కెట్‌ సంక్షోభానికి కాయ సైజు తగ్గడం కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడి ఉండే తోటల్లో పక్వానికి వచ్చిన కొబ్బరి కాయ సగటు బరువు డొక్కతో కలిపి 600 గ్రాముల వరకు ఉంటుంది. డొక్క తీసిన తరువాత కాయ బరువు మన రాష్ట్రంలో సగటున 450 గ్రాములు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, విజయనగరం జిల్లాలో అయితే 450 నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో డొక్క తీసిన కాయ బరువు 500 గ్రాముల వరకు, కేరళలో 550 గ్రాముల వరకు వస్తోంది. మన రాష్ట్రంలో కొబ్బరి తోటలకు పెట్టింది పేరైన కోనసీమతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో వలిచిన కాయ సగటు బరువు 400 గ్రాముల వరకు ఉండేది. ఇప్పుటికీ ఆరోగ్యకరమైన తోటల్లో దిగుబడి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. కానీ.. తీరప్రాంత మండలాలు, ఆక్వా చెరువులు ఉన్న మండలాల్లో మాత్రం కాయ బరువు గణనీయంగా తగ్గుతోంది. ఇక్కడ వలిచిన కాయ సైజు 250 గ్రాములకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. కాయ బరువు తగ్గడమే కాదు.. కాయ స్వరూపం మరింత కోలగా మారిపోతోంది. కోనసీమతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, తాళ్లరేవు, తొండంగి మండలాల పరిధిలో ఆక్వా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగయ్యే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు తదితర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి తోటలు ఆక్వాబారిన పడి కాయ సైజు తగ్గిపోతోంది. ఇటీవల ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతున్న స్థాయిలోనే కొబ్బరికి నష్టం కలుగుతోంది. ఆక్వా ప్రభావం వల్ల ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు మోడువారిన విషయం తెలిసిందే. ఇది వెనామీ రొయ్యల్ని పెంచే చెరువు గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లకు మాత్రమే పరిమితమైందని రైతులు భావించేవారు. కానీ.. భూమి పొరల ద్వారా వస్తున్న ఆక్వా ఉప్పు నీటివల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోయారు. ఆక్వా సాగు చేస్తే చెరువు చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని భూమిలో సూక్ష్మ పోషకాలు నశించడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నీరు ఉప్పగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొబ్బరికి భూమి ద్వారా సహజ సిద్ధంగా అందే నీరు ఉప్పగా మారడంతో తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోతోంది. మరోవైపు పోషకాలు అందక కొబ్బరికాయ సైజు తగ్గుతోంది. ఫలితంగా ఇక్కడ పండే కొబ్బరి కాయలకు డిమాండ్‌ తగ్గి ధర పడిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో పండే కొబ్బరి కాయల్లో నూనె శాతం 69 ఉంటే.. ఇక్కడి కాయల్లో 61 శాతం మాత్రమే ఉంటోంది. ఫలితంగా ఈ ప్రాంత కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా దిగజారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయిలో ఉంది.