Politics

జగన్…నీ చెల్లికి జరిగినట్లే నాకూ జరుగుతోంది

Mudragada Writes To AP CM YS Jagan Comparing Himself To His Sister - జగన్...నీ చెల్లికి జరిగినట్లే నాకూ జరుగుతోంది

కాపు రిజర్వేషన్లతో పాటు తన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై కాపు నేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది.ఆ లేఖలో జగన్ విధానాలపై మండిపడిన ముద్రగడ… అయ్యా జగన్ గారు.. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని తెలిపారు. కొద్దిరోజుల క్రితం సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆమె బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్ధితి వచ్చింది. అలాగే తనపై సైతం కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజ దొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అంటూ ఎన్నో తప్పుడు వార్తలను అన్ని పార్టీల వారు రాయిస్తున్నారని పద్మనాభం గుర్తు చేశారు. వాటికి బెదిరిపోవడానికి.. తానేమీ ఎన్ఆర్ఐని కాదని గుర్తుంచుకోండి అంటూ జగన్‌కు సూచించారు.కాగా ఈ లేఖలో ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్లపై … ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్ చెబితే సంతోషిస్తానన్నారు. న్యాయస్థానం స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చే వరకు కాపుల హక్కులు, డిమాండ్లను అడగకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ ఘాటుగా పేర్కొన్నారు.ఈ లేఖపై కథనాలు వెలువడిన కొద్దిసేపట్లోనే కాపు రిజర్వేషన్లపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కన్నబాబు, అంబటి రాంబాబు ఉంటారు.కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టంపై ఈ కమిటీ అధ్యయం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. కాపు రిజర్వేషన్లపై వైసీఎల్పీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు.కాపు రిజర్వేషన్లతో పాటు పాటు ఈబీసీ బిల్లుపై వారు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితర కాపు నేతలు హాజరయ్యారు.అనంతరం కాపు నేతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వీరిని ఉద్దేశించి మాట్లాడిన జగన్.. కాపు రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వ వైఖరిని కోరుతూ.. ఏప్రిల్ 4న కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను ప్రస్తావించారు. అయితే ఆ లేఖకు నాటి సీఎం చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని నేతలు తెలిపారు.