NRI-NRT

కాలిఫోర్నియాలో ఘనంగా త్రిగళ నవావధానము

trigala-nava-avadhaanam-in-california-thrigala-navavadhanam - కాలిఫోర్నియాలో ఘనంగా త్రిగళ నవావధానము

సువిధ స్వచ్ఛంద సంస్థ-తెలుగు మిసిమి విభాగము ఆధ్వర్యంలో శాక్రమెంటో, కాలిఫోర్నియా లక్ష్మీనారాయణ మందిరములో జూలై 13న త్రిగళ నవావధానము ఘనంగా నిర్వహించారు. తెలుగు అవధాన చరిత్రలో మొట్టమొదటిసారిగా ముగ్గురు అవధానులతో, మూడు భాషలలో (వ్యావహారిక తెలుగు, అచ్చ తెలుగు, సంస్కృతము) ఒకే వేదిక పైన, ఒకే సమయములో, తొమ్మిది అంశములతో నిండుగా జరిగిన ఈ అపూర్వ కార్యక్రమానికి సుమారు 100 మంది వీక్షకులు శాక్రమెంటో, శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాల నుండి హాజరయ్యారు. 6గంటల పాటు వీక్షించారు. ముఖ్యఅతిథిగా తమిళనాట తెలుగులో అనేక రచనలు చేసిన శ్రీనివాసు విచ్చేశారు. అవధానులుగా డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పాలడుగు శ్రీచరణ్, నేమాని సోమయాజులులు వ్యవహరించగా, సంచాలకత్వ బాధ్యతను కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతి గ్రహీత, ప్రజ్ఞాభాస్కర ఆచార్య రాణి సదాశివ మూర్తి నిర్వహించారు. నిషిద్ధాక్షరిని తల్లాప్రగడ రామచంద్రరావు, దత్తపదిని పుల్లెల శ్యామసుందర్, సమస్యను మాజేటి సుమలత, వర్ణనను బుడమగుంట మధు, న్యస్తాక్షరిని పంచాంగం అప్పాజీ నిర్వహించగా క్రొత్త అంశం “ఆంగ్ల అనువాదం” మరియు అప్రస్తుతములను మైలవరపు సాయికృష్ణ నిర్వహించారు. ఆరేండ్ల బుడతడు మద్ది అథర్వ పురాణపఠన కార్యక్రామానికి పెద్ద ఆకర్షణగా నిలిచింది. ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి, ప్రముఖ భాషా శాస్త్రజ్ఞులు గంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వెంపటి భాస్కర్ , కార్యవర్గము పాలపర్తి వారిని “కుదురాట గండ” బిరుదుతో, పాలడుగు వారిని “అవధానభారతి”, నేమాని వారిని “అవధానివతంస” బిరుదులతో సన్మానించారు. ఆచార్య రాణీని “సంచాలకాసుధాకర” బిరుదముతో సత్కరించారు. సువిధ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు వెంపటి భాస్కర్ సభాముఖంగా వీక్షకులకు, సంచాలకులకు, పృచ్ఛకులకు, అవధానులకు, అట్లే కార్యవర్గమునకు కృతజ్ఞతలు తెలిపారు. దురిశెట్టి రావు, శ్రీధర్, శశాంక్, ధ్వని సహకారాన్ని అందించగా, మార్క్ కేంబ్రిడ్జి చలన చిత్ర సహాయాన్ని అందించగా, వెంపటి భాస్కరు దంపతులు, మైలవరపు సాయికృష్ణ దంపతులు, మద్ది అవినాశు దంపతులు, బైని జితేంద్ర , యనమండ్ర శ్రీకాంత్ దంపతులు, చండ్ర నగేశు దంపతులు, బుడమగుంట మధు దంపతులు, హరీశ్ దంపతులు కలసి ఈ అవధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, స్థానిక అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ వారు ఆహూతులందరికీ విందును అందించారు.