Kids

బెంజిమిన్ ఫ్రాంక్లిన్ విజయగాథ

Telugu Kids Moral Stories - Benjamin Franklin

మనలా స్కూలుకి వెళ్లలేదు… కానీ బదవడం ఆపలేదు… ఎన్నెన్నో విషయాలపై నైపుణ్యం సంపాదించాడు… బోలెడన్ని ఆవిష్కరణలు చేశాడు… ఆయన ఎవరో కాదు… ప్రముఖ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్… మరి ఆయన జీవిత విశేషాలేంటో చదివేద్దామా!
**ఇంటిని వదిలి…
ఫ్రాంక్లిన్ వార్తా పత్రికల్లో వ్యాసాలు రాయాలనుకునేవాడు. కానీ అతని అన్నయ్యకు అది నచ్చేది కాదు. తమ్ముడిని ప్రోత్సహించకపోగా, తనకు తెలియకుండానే కొన్ని వ్యాసాలు పత్రికల్లో ప్రచురణకు పంపాడని తెలిసి కోప్పడుతుండేవాడు. దాంతో నిరుత్సాహపడి తన 18వ ఏట ఇల్లు వదిలి ఫిలడెల్ఫియాకు వెళ్లిపోయాడు ఫ్రాంక్లిన్. అక్కడి వారి సాయంతో సొంతంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించాడు. ప్రెస్ ద్వారా ఒక గెజిట్ను ప్రచురించాడు. ఇంకా సూర్యోదయాలు, అస్తమయాలు, రోజువారీ వాతావరణ సమాచారం వివరించే కేలండర్ను మొదటిసారిగా రూపొందించాడు. ఆ కేలండర్లో ముద్రించిన ఆయన సూక్తులు ఈ నాటికీ మనకు వాడుకలో ఉన్నాయి.
*పుస్తకాల పురుగు!
బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికాలోని బోస్టన్లో 1706 జనవరి 17న జన్మించాడు. 14 మంది సంతానంలో చివరివాడు. తండ్రి కొవ్వొత్తుల తయారీ వ్యాపారం చేస్తుండేవాడు. ఇంటి దగ్గరే కొంత చదవడం, రాయడం నేర్చుకున్న ఫ్రాంక్లిన్ ఎనిమిదేళ్ల వయసులో స్కూలుకెళ్లాడు. కానీ పేదరికం వల్ల స్కూలు ఫీజు కట్టలేకపోవడంతో చేరిన రెండేళ్లకే స్కూలు మానేశాడు. తమ కొవ్వొత్తుల తయారీ దుకాణంలో చేరాడు. కొంతకాలానికి అక్కడి పని నచ్చక బోస్టన్ హార్బరులో పనికి చేరాడు. సముద్రయానం చేయాలని కలలు కంటుండేవాడు. అది ఇష్టం లేని తండ్రి ఈ పిల్లాడిని తన పెద్ద కుమారుడు నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్లో చేర్చాడు. అక్కడ ముద్రణకు వచ్చే బోలెడన్ని పుస్తకాలు చదివి, తనకు తానే విద్యనార్జించాడు. చిన్న వయసులోనే సంఖ్యాగణితం, ఆల్జీబ్రా, జామెట్రీ, నౌకాయానం, వ్యాకరణ, తర్క సంబంధిత గ్రంథాలు చదివి ఎంతో జ్ఞానాన్ని పొందాడు. పెద్దయిన తర్వాత ఈ విషయాలన్నీ తన ఆత్మకథలో వివరంగా రాసుకున్నాడు. ఈ పుస్తకం అమెరికన్ సాహిత్యంలో ఒక అపురూపమైన ప్రామాణిక గ్రంథం.
* మెరుపుల రహస్యం బయటపెట్టాడిలా!
* చిన్నప్పుడు భోజనం మానేసి ఆ డబ్బుతో ఫ్రాంక్లిన్ పుస్తకాలు కొనుక్కునేవాడు. ఆ రోజులు గుర్తొచ్చి తన 25వ ఏట ఒక సంచార గ్రంథాలయాన్ని ఆరంభించాడు. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఫిలడెల్ఫియా ప్రాంతంలో బాధితుల సాయం కోసం మొట్టమొదటి ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించాడు. ఇంకా ఈయన స్థాపించిన పెన్సిల్వేనియా అకాడమీ, తర్వాత రోజుల్లో పెన్సిల్వేనియా యూనివర్సిటీగా రూపుదిద్దుకొంది.
* ముద్రణా వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించిన ఫ్రాంక్లిన్ తన 38వ ఏట సైన్స్పై ఇష్టం పెంచుకున్నాడు. ఇది శాస్త్రరంగంలో ఒక గొప్ప మలుపు. ముఖ్యంగా స్థిరవిద్యుత్లో ఆయన చేసిన ప్రయోగాలు. విశ్వంలోని
ప్రతి పదార్థంలో విద్యుత్ ద్రవం అనే ద్రవం ఉంటుందని, ఒకపదార్థం ఆ ద్రవాన్ని కోల్పోయినప్పుడో లేక ఇతర పదార్థాల నుంచి ఆ ద్రవాన్ని గ్రహించినప్పుడో ఆ పదార్థంలో విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని ఈయన ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనే తర్వాతి రోజుల్లో భౌతిక శాస్త్ర అధ్యయనంలోని స్థిరవిద్యుత్ ప్రకరణానికి మార్గదర్శకమయ్యింది.
* దేవతలకు మానవులపై కోపం వచ్చినప్పుడు వాళ్లు చూసే చూపులే తళతళమని మెరిసే మెరుపులని ఆ రోజుల్లో ఒక మూఢనమ్మకం. ఆకాశంలోని మెరుపులు, ఉరుములు, పిడుగులు విద్యుత్ ప్రక్రియయే కానీ దేవతల ప్రభావం కాదు అని నిరూపించాడు ఫ్రాంక్లిన్. దానికోసం మేఘాల్లో మెరుపులు వస్తున్నప్పుడు వాటి వైపు ఒక గాలిపటం ఎగురవేశాడు. దానికి కట్టిన దారం చివరను ఒక ఎలక్ట్రోస్కోప్కు అనుసంధానించి ఎలక్ట్రోస్కోపులోని అల్యూమినియం రేకులు వికర్షించడాన్ని పరిశీలించాడు. దీని ద్వారా మేఘాల మధ్య జరుగుతున్న ఘర్షణ వల్ల విద్యుత్ ఉత్పన్నమవుతుందని, ఆ విద్యుత్తే మెరుపులకు కారణమని, ఆ విద్యుత్ వల్లే అల్యూమినియం రేకులు వికర్షించుకుంటున్నాయని నిర్ధరించాడు.
* ఇంకా భూమిని తాకే పిడుగుల నుంచి రక్షించుకోడానికి తటిద్దండాన్ని (Lightning Arrester), విద్యుత్ ఆవేశాలను నిల్వ చేసే ‘లేడన్ జార్’ను రూపొందించాడు. ఈ పరిశోధనలకుగానూ ఆయనకు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ పురస్కారం లభించింది.
* శాస్త్రపరిశోధనల్లో మునిగిపోయిన ఫ్రాంక్లిన్… రాజకీయ రంగంలో, సమాజసేవలో కొంతకాలాన్ని వెచ్చించేవాడు. అమెరికా విప్లవం తీవ్రదశలో ఉన్నప్పుడే ఆయన థామస్ జఫర్సన్, జాక్ ఆడమ్స్లతో పాటు స్వాతంత్య్ర ప్రకటనను డ్రాఫ్ట్ చేసే కమిటీలో సభ్యుడిగా చేరాడు. అలా శాస్త్రవేత్తగానే కాకుండా సాంఘిక, రాజకీయరంగాల్లో ఒక మహోన్నతునిగా శాశ్వతకీర్తిని సంపాదించుకున్న బహుముఖప్రజ్ఞాశాలి.