Movies

విడాకుల తర్వాత స్నేహం

Dia Mirza Says Her Friendship Continues With Husband After Divorce-విడాకుల తర్వాత స్నేహం

తన భర్త సాహిల్‌ సంఘా మరో మహిళతో చనువుగా ఉన్న కారణంగానే బాలీవుడ్‌ నటి దియా మీర్జా ఆయన్నుంచి విడిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని దియా తేల్చి చెప్పారు. మీడియా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. సాహిల్‌ నుంచి విడిపోతున్నట్లు దియా గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య స్నేహం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే వీరిద్దరు విడిపోవడానికి ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ రచయిత కనికా దిల్లాన్‌ కారణమని పలు వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. అందుకే ఆమె కూడా తన భర్త ప్రకాశ్‌ కోవెలమూడికి దూరమయ్యారని వదంతులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో కనికా ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ‘నవ్వొస్తోంది.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. పత్రికలు ఇంకాస్త బాధ్యతగా ఉండాలి. రెండు వార్తలు ఒకేరోజు వచ్చినంత మాత్రానా.. రెండింటికీ సంబంధం ఉందని కాదు. నా జీవితంలో ఇంత వరకూ ఒక్కసారి కూడా దియా, సాహిల్‌ను కలవలేదు. ఇక దీని గురించి మర్చిపోయి మీ పనులు చేసుకోండి’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఇదే సందర్భంగా దియా.. కనికాకు మద్దతు తెలిపారు. వదంతుల్ని ఖండిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘సాహిల్‌తో నేను విడిపోవడం వెనుక ఏదో ఉందని వస్తున్న మీడియా కథనాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని స్పష్టత ఇస్తున్నా. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం చాలా బాధాకరం. సాహిల్‌తో విడిపోవడానికి మూడో వ్యక్తి కారణమని వచ్చిన వార్తల్లో నిజం లేదు. మాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలని మీడియాను కోరుతున్నా. మీరు మా అభిప్రాయాల్ని గౌరవిస్తారని భావిస్తున్నా’ అని ఆమె పేర్కొన్నారు.