Business

SBIకు బంపర్ లాభాలు

SBIకు బంపర్ లాభాలు-SBI Reports Huge Profits In 2019's First Financial Quarter

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వరంగబ్యాంకు ఎస్‌బీఐ 2019 వార్షిక సంవత్సరపు మొదటి త్రైమాసికాన్ని లాభాలతో ముగించింది. శుక్రవారం విడుదల చేసిన నివేదికలో రూ. 2312.20 కోట్ల నికరలాభాన్ని అర్జించినట్లుగా వెల్లడించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4,875.85 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. రుణాలపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంలో కూడా మంచి ఫలితాలు కనిపించాయి. డిపాజిట్లపై ఖాతాదారులకు చెల్లించే వడ్డీ కంటే రుణాలపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ.22,938.79 కోట్ల మేర పెరిగింది. అలాగే స్థూలనిరర్థక ఆస్తుల(జీఎన్‌పీఏ) విలువ రూ.1.68 లక్షల కోట్లకు తగ్గడంతో ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో వీటి విలువ రూ.2.13 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఈ త్రైమాసికానికి 21శాతం మేరకు జీఎన్‌పీఏ తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల విలువ కూడా రూ.65,624 కోట్లకు తగ్గడంతో బ్యాంకు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.