Sports

నేను మూర్ఖుడిని కాను

Sunil gawaskar speaks of his feud with kapil dev - నేను మూర్ఖుడిని కాను

టీమిండియా.. టెస్టుల్లో నంబర్‌ 1. వన్డేల్లో నంబర్‌ 2. టీ20ల్లో నంబర్‌ 5. ప్రస్తుతం భారత్‌ ఎప్పుడూ లేనంత నిలకడగా ఆడుతోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి సహా ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లు ఇప్పుడు జట్టులో ఉన్నారు. కానీ 1960, 70ల్లో అలా కాదు. ఒకరిద్దరుంటే గగనం. వెస్టిండీస్‌లాంటి దుర్భేద్యమైన జట్టుతో ఆడుతున్నప్పుడు పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. అలాంటి సమయంలో నిలకడగా ఆడిన ఇద్దరే సునిల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌. సారథ్యంతో పాటు కీలక ఆటగాళ్లుగా టీమిండియాకు వీరు అండగా నిలిచారు. ఐతే వీరి మధ్య విభేదాలు ఎలా మొదలయ్యాయో, అందులో నిజమెంతో సన్నీ వివరించారు. ‘1984-85 సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో కలకత్తా టెస్టుకు కపిల్‌కు చోటుదక్కలేదు. అప్పుడు చాలా సులభంగా నిందలన్నీ నాపై మోపారు. కపిల్‌ వద్దని నేను ప్రతిపాదించలేదు. అసలు నిజమేంటంటే అప్పటి సెలక్టర్‌ హనుమత్‌ సింగ్‌ అతడిని ఎంపిక చేయలేదు. ఏడాది తర్వాత ఓ కథనంలో హనుమత్‌ సింగ్‌ ఈ విషయాన్ని స్వయంగా రాశారు’ అని గావస్కర్‌ అన్నారు. అలా తమ మధ్య విభేదాలున్నాయని ప్రచారం చేశారన్నారు. ‘క్రికెట్‌ విషయంలో నేనంత మూర్ఖుడిని కాను. నా జట్టులో ఉన్న ఒకే మ్యాచ్‌ విన్నర్‌, గేమ్‌ ఛేంజర్‌ను వదులుకొనేందుకు నేనెందుకు సలహా ఇస్తాను. భారత్‌ గెలిచే అవకాశాలను ఎందుకు తగ్గించుకుంటాను. ఏదేమైనప్పటికీ సెలక్షన్‌ కమిటీ నిర్ణయానికి నేనే బాధ్యుడిని’ అని గావస్కర్‌ అన్నారు.