DailyDose

పది గ్రాముల బంగారం ధర 37000 – వాణిజ్య వార్తలు – 08/14

10Grams Gold Priced At 37K-Telugu Business News Today-Aug142019

*వివిధ మాట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,630, విశాఖపట్నంలో రూ.38,680, ప్రొద్దుటూరులో రూ.37,500, చెన్నైలో రూ.37,840గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.35,860, విశాఖపట్నంలో రూ.35,580, ప్రొద్దుటూరులో రూ.34,440, చెన్నైలో రూ.36,270గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,300, విశాఖపట్నంలో రూ.44,600, ప్రొద్దుటూరులో రూ.43,900, చెన్నైలో రూ.49,000 వద్ద ముగిసింది.
* ప్యాసింజర్‌ వెహికిల్‌ కంపెనీలకు గత నెల కూడా కలిసి రాలేదు. వరుసగా తొమ్మిదో నెలలోనూ అమ్మకాలు పడిపోయాయి. గత జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో వీటి అమ్మకాలు 30.9 శాతం తగ్గి 200,790 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్‌ వెహికిల్స్‌ అమ్మకాలు 25.7 శాతం తగ్గి 56,866 యూనిట్లకు చేరాయని సొసైటీ ఆఫ్ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) డేటా వెల్లడించింది. బైకులు, స్కూటర్ల సేల్స్‌ 16.8 శాతం తగ్గి 15 లక్షల యూనిట్లుగా రికార్డయ్యాయి. ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు 36 శాతం పడిపోయి 122,956 యూనిట్లకు చేరాయి. దేశీయంగా ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ గత నెలలో 17 శాతం తగ్గిందని సియామ్‌ లెక్కలు తెలిపాయి. ‘‘ఆటోమొబైల్‌ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని సియామ్‌ డేటా చూస్తే అర్థమవుతుంది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. అమ్మకాలు పెంచుకోవడానికి ఇండస్ట్రీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. అయితే, ప్రభుత్వం సాయం చేయకుంటే పరిస్థితి మరింత విషమిస్తుంది’’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మథుర్‌ అన్నారు. మనదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ మార్కెట్‌ వాల్యుయేషన్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18.3 శాతం తగ్గింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో ఆటో సెక్టర్‌ ఇండెక్స్ 23 శాతం పతనమయింది.
*పెన్నార్ ఇండస్ట్రీస్ తొలి త్రైమాసికంలో రూ.16.51 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన లాభం రూ.13.13 కోట్లతో పోలిస్తే ఇది 25.8శాతం అధికం.
*కావేరీ సీడ్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.72 శాతం వృద్ధితో రూ.228.93 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత మొదటి త్రైమాసికానికి రూ.655.46 కోట్ల ఆదాయం నమోదైంది.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సన్ ఫార్మా రూ.1,387.48 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.1,057.29 కోట్లతో పోలిస్తే ఇది 31.23 శాతం ఎక్కువ.
*ఎన్ఎండీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 21 శాతం అధికంగా రూ.1,178 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నికరలాభం రూ.974.29 కోట్ల ఉంది. ప్రస్తుతం మొదటి త్రైమాసికానికి రూ.3,386.65 కోట్ల ఆదాయం నమోదు కాగా, క్రితం ఏడాది ఇదేకాలంలో ఆదాయం రూ.2,547.33 కోట్లు ఉంది. దీంతో పోల్చితే మొదటి త్రైమాసికానికి ఎన్ఎండీసీ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించినట్లు అవుతోంది.
*అపోలో హాస్పిటల్స్ ఏకీకృత ఖాతాల ప్రకారం ఏప్రిల్-జూన్లో రూ.49.15 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నమోదైన రూ.23.34 కోట్ల నికరలాభంతో పోల్చితే ఈసారి లాభం దాదాపు రెట్టింపు అయినట్లు స్పష్టమవుతోంది.
*దేశంలోనే అతి పెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వచ్చే 5-7 ఏళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ఆ సంస్థ ఛైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. చమురు శుద్ధి, పెట్రో రసాయనాల విభాగాన్ని విస్తరించి విపణిలో అగ్ర స్థానంలో కొనసాగాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. చమురు శుద్ధి వార్షిక సామర్థ్యాన్ని ప్రస్తుత 80.7 మిలియన్ టన్నుల నుంచి 150 మిలియన్ టన్నులకు చేర్చబోతున్నారు.
*ఫ్యూచర్ రిటైల్లో 8- 10 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తుదిదశ చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ వచ్చే కొన్ని వారాల్లో ఈ లావాదేవీ పూర్తి చేసే అవకాశం ఉంది.
* కొత్త బైక్ పల్సర్ 125 నియోను బజాజ్ ఆటో మంగళవారం ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ డ్రమ్ / డిస్క్ బ్రేక్లతో లభిస్తుందని సంస్థ తెలిపింది. డ్రమ్ బైక్ ధర రూ.64,000 కాగా, డిస్క్ బ్రేక్ రూ.66,618 (ఎక్స్ షోరూం, దిల్లీ) అని వివరించింది.
* రిటైలింగ్‌‌ సెగ్మెంట్లో మనదేశంలోనే నంబర్‌‌ 2 కంపెనీ అయిన ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో వాటా కొనడానికి ఈ–కామర్స్‌‌ కంపెనీ అమెజాన్‌‌ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం ఈ రెండు కంపెనీలు జరుపుతున్న చర్చలు తుదిదశలో ఉన్నట్టు తెలిసింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇండియా రిటైల్‌‌ మార్కెట్‌‌లో స్థానం సంపాదించుకోవడానికి అమెజాన్‌‌ ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో 10 శాతం తీసుకోనుంది. ఇందుకోసం ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ రూ.రెండు వేల కోట్ల వాల్యుయేషన్ అడుగుతోందని సంబంధిత ఆఫీసర్లు కొందరు వెల్లడించారు. హోల్డింగ్‌‌ కంపెనీ ద్వారా ఒప్పందం జరుగుతుందని, ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ ఫౌండర్‌‌, చైర్మన్‌‌ కిషోర్‌‌ బియానీ నుంచి మరిన్ని షేర్లు కొనేందుకు అమెజాన్‌‌కు అవకాశం ఇస్తారని అన్నారు. ముంబైకి చెందిన ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ బిగ్‌‌బజార్‌‌ పేరుతో సూపర్‌‌ బజార్‌‌ సహా పలు వ్యాపారాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వాటా దక్కడం వల్ల అమెజాన్‌‌ రిటైలింగ్‌‌ రంగానికి కూడా విస్తరించవచ్చు. అమెరికాలోని భారీ రిటైల్‌‌ చైన్‌‌ హోల్‌‌ ఫుడ్స్ మార్కెట్‌‌ను అమెజాన్‌‌ 2017లో కొనడం ద్వారా ఫుడ్ రిటైలింగ్‌‌ విభాగంపై పట్టుదక్కించుకుంది. కూరగాయలు, పాల వంటి వాటిని హోండెలివరీ విధానంలోనే కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతుండడంతో అమెజాన్‌‌ ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో వాటాపై దృష్టి పెట్టింది. చర్చలు తుదిదశకు వచ్చినప్పటికీ ఒప్పందం మాత్రం ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయమై మాట్లాడటానికి అటు ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ ఆఫీసర్లు గానీ, అమెజాన్ ప్రతినిధులు గానీ ఇష్టపడలేదు.