WorldWonders

పాపం శ్రీలంక ఏనుగులు ఎలా బక్కచిక్కిపోయాయో!

పాపం శ్రీలంక ఏనుగులు ఎలా బక్కచిక్కిపోయాయో!-The sad pathetic condition of elephants in Sri Lanka

మనుషుల్లో మానవత్వం కరవైపోతోంది. దీనికి నిదర్శనం శ్రీలంకలో జరిగిన ఈ సంఘటన. శ్రీలంకలోని కాండీ నగరంలో పెరాహెరా(perahera) అనే వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏనుగుల్ని అందంగా ముస్తాబు చేసి ఊరేగిస్తారు. ఈ ఏడాది దాదాపు 60 ఏనుగుల్ని ఊరేగింపు కోసం తీసుకొచ్చారు. అయితే వీటిలో బక్క చిక్కి శల్యమైన 70 ఏళ్ల టికిరీ అనే ముసలి ఏనుగు కూడా ఉంది. ఎముకల గూడులా తయారైన ఆ ఏనుగు కాలు తీసి పెట్టలేని పరిస్థితుల్లో ఉంది. అయినా సరే దానిపై నిర్వాహకులకు జాలి కలగలేదు. దానిపై రంగురంగుల వస్త్రాన్ని వేసి, వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని సేవ్‌ ఎలిఫెంట్‌ సంస్థ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. మూగ జీవుల్ని హింసించి పండుగ చేసుకోవడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించింది. ఈ ఏనుగుకు విముక్తి కల్గించి, దాన్ని అభయారణ్యానికి పంపాలని, చికిత్స చేయించాలని డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఏనుగు దుస్థితి చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.